బెట్టింగ్ కోస‌మే ఫేక్ స‌ర్వేలా?

By KTV Telugu On 16 May, 2024
image

KTV TELUGU :-

ఆంధ్ర ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల తంతు ముగిసింది. 81శాతానికి పైగా  పోలింగ్ జ‌రిగింది. ప్రధాన రాజ‌కీయ పార్టీలు  విజ‌యంపై ధీమాతో ఉన్నాయి. అయితే గెల‌వ‌బోయేది ఒక ప‌క్ష‌మే. కానీ ర‌క ర‌కాల స‌ర్వేలు అంచ‌నాలు వెలువ‌డుతున్నాయి. కొన్ని కూట‌మి గెలుస్తుందంటే మ‌రి కొన్ని పాల‌క ప‌క్షం విజ‌యం ఖాయ‌మంటున్నాయి. ఈ గంద‌ర‌గోళం వెనుక బెట్టింగ్ దందాలే కార‌ణ‌మని  రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. కృష్ణాజిల్లా కేంద్రంగా ఎన్నిక‌ల వేళ బెట్టింగులు నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఈ ముఠాల వెనుక ఓ ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీకి చెందిన నేత‌లే ఉన్నార‌ని అంటూ ఉంటారు.

ఎన్నిక‌లకు కొద్ది రోజుల ముందు ఒక సారి పోలింగ్ న‌కు రెండు రోజుల ముందు మ‌రో సారి ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్  తెర‌పైకి వ‌చ్చి ఏపీలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోవ‌డం ఖాయ‌మ‌న్నారు. అది సంచ‌ల‌నం అయ్యింది. చిత్రం ఏంటంటే తాను ఏపీలో తిర‌గ‌లేద‌ని పీకే అన్నారు. ఏపీలో త‌న‌కి ఎలాంటి బృందాలు కూడా లేవ‌న్నారు. ఏ రాజ‌కీయ పార్టీ మేనిఫెస్టోనీ తాను చూడ‌లేద‌న్నారు. తాను ఏ పార్టీకి వ్యూహ‌క‌ర్త‌గా ప‌నిచేయ‌డం లేద‌న్నారు. మ‌రీ ఏమీ లేకుండా ఎక్క‌డో కూర్చుని ఏపీలో ఎవ‌రు గెలుస్తారో పీకే ఎలా చెబుతున్నార‌ని మేథావులు ప్ర‌శ్నిస్తున్నారు.

ప్ర‌శాంత్ కిషోరే కాదు  ఏపీలో గ‌తంలో ఎల‌క్ట్రానిక్ మీడియాలో ఓ వెలుగు వెలిగిన  జ‌ర్న‌లిస్ట్  కూడా స్ట‌డీ  రిపోర్ట్ పేరిట ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వ‌స్తాయో జోస్యం చెప్పారు. ఏపీలో కూట‌మే అధికారంలోకి వ‌స్తుంద‌ని  ఈ జ‌ర్న‌లిస్ట్  అంచ‌నా వేశారు.  ఈ జ‌ర్న‌లిస్టే ఆ త‌ర్వాత పీకే తో ఇంట‌ర్వ్యూ చేయించారు. ఇద్ద‌రూ కూడా కూట‌మి వైపే మొగ్గు చూపారు. ఏపీలో పోలింగ్ స‌ర‌ళిని గ‌మ‌నించిన  మ‌రి కొంద‌రు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు  సంపాద‌కులు మాత్రం  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ మ‌రోసారి ఘ‌న విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని జోస్యాలు చెప్పారు. జ‌ర్న‌లిస్టులు, విశ్లేష‌కులు ఇలా ప‌ర‌స్ప‌ర విరుద్ధ‌మైన అంచ‌నాలు చెప్ప‌డానికి కార‌ణాలేంటి? అన్న అంశంపై చ‌ర్చ జ‌రుగుతోంది.

పోలింగ్ ముగిసిన త‌ర్వాత నిజానికి కూట‌మి నేత‌ల్లో ఎక్క‌డా జోష్ క‌న‌ప‌డ‌లేదు. ఎవ‌రూ ముందుకు వ‌చ్చి సంతోషంగా ఉన్న‌ట్లు క‌నిపించ‌లేదు. అయితే కొంద‌రి స‌ర్వేలు మాత్రం వారికి అనుకూలంగా ఉన్నాయి. చంద్ర‌బాబు నాయుడు సైతం కూట‌మి గెలుస్తుంద‌ని అన్నా ఆయ‌న వ‌ద‌నంలో ఎక్క‌డా ఉత్సాహం లేదు..జోష్ లేదు. మ‌రి ఎందుక‌ని ఇటువంటి అభిప్రాయాలు స‌ర్వేలు వ్య‌క్తం అవుతున్నాయ‌ని ఆరా తీస్తే విజ‌య‌వాడ కేంద్రంలో జ‌రుగుతోన్న బెట్టింగ్ దందా  గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.

ప్ర‌తీ ఎన్నిక‌ల్లోనూ విజ‌య‌వాడ కేంద్రంగా బెట్టింగులు జ‌రుగుతున్నాయి. వీటిలో ప్ర‌జ‌ల‌ను పెద్ద ఎత్తున బెట్టింగ్ వైపు  న‌డిపించేందుకే బెట్టింగ్ సంస్థ‌ల నిర్వాహ‌కులు ఫేక్ స‌ర్వేలు చేయించి వాటిని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తూ ఉంటారు. ఆ ఫ‌లితాలే నిజ‌మ‌నుకునే అమాయ‌కులు బెట్టింగులు క‌ట్టి ల‌క్ష‌ల్లో న‌ష్ట‌పోతున్నారు. చాలా మంది అప్పుల పాల‌వుతున్నారు. అక్క‌డ‌క్క‌డా అప్పుల్లో కూరుకుపోయి ఆత్మ‌హ‌త్య‌లు కూడా చేసుకుంటున్నారు. ఈ దందాల వెనుక కూట‌మిలోని ఓ రాజ‌కీయ పార్టీ నేత‌లు ఉన్నార‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యం అంటున్నారు రాజ‌కీయ పండితులు. వీరే త‌మ పార్టీ గెలుస్తుంద‌ని ప్ర‌చారం చేయిస్తున్నార‌ని వారు అనుమానిస్తున్నారు.

2018లో తెలంగాణా ఎన్నిక‌లు జ‌రిగాయి. అప్పుడు కూడా విజ‌య‌వాడ బెట్టింగ్ ముఠాల  జోక్యంతో  వారి అనుకూల రాజ‌కీయ పార్టీ  ప్రోత్సాహంతో ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ఓ  స‌ర్వే చేసిన‌ట్లు చెప్పి ఫ‌లితాలు వెలువ‌రించారు. ఆ ఎన్నిక‌ల్లో తెలంగాణాలో బి.ఆర్.ఎస్. ఓట‌మి ఖాయ‌మ‌ని ఆయ‌న తేల్చారు. టిడిపి-కాంగ్రెస్ కూట‌మి ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌న్నారు. చాలా మంది ల‌గ‌డ‌పాటి స‌ర్వేని న‌మ్మి భారీగా బెట్టింగులు క‌ట్టారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డే స‌రికి బి.ఆర్.ఎస్. అఖండ విజ‌యం సాధించింది. కూట‌మి కుదేలైంది. కూట‌మి త‌ర‌పున బెట్టింగులు క‌ట్టిన ప్ర‌తీ ఒక్క‌రూ నాశ‌నం అయ్యారు.ఆ ఎన్నిక‌ల  ఫ‌లితాల రోజున ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ త‌న స‌ర్వే త‌ప్పు కావ‌డం ప‌ట్ల సారీ చెప్పి ఇక‌పై స‌ర్వేలు చేయ‌న‌ని ప్ర‌క‌టించారు.

తెలంగాణా ఎన్నిక‌లు ముగిసిన ఆరు నెల‌ల త‌ర్వాత ఏపీలో ఎన్నిక‌లు  జ‌రిగాయి. ఆ ఎన్నిక‌ల్లోనూ స‌రిగ్గా పోలింగ్ కు రెండు రోజుల ముందు ఇదే ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ చేత ఫేక్ స‌ర్వే చేయించారు. ఆ ఎన్నిక‌ల్లో ఏపీ ప్ర‌జ‌లు అనుభ‌వ‌జ్ఞుడైన చంద్ర‌బాబు నాయుడి  పార్టీనే గెలిపించ‌బోతున్నార‌ని జోస్యం చెప్పారు. ల‌గ‌డ‌పాటి మాట‌లు న‌మ్మి టిడిపి గెలుస్తుంద‌ని బెట్టింగులు క‌ట్టిన వారంతా మోస‌పోయారు. ఆ ఎన్నిక‌ల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్  151 స్థానాల్లో ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. మిస్ట‌రీ ఏంటంటే త‌న స‌ర్వే ఫ‌లితం చెప్ప‌డానికి ముందు రోజు రాత్రి ల‌గ‌డ‌పాటి టిడిపికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించే మీడియా ప్ర‌తినిథిని క‌లిశారు. ఇద్ద‌రూ చంద్ర‌బాబుతో ట‌చ్ లో ఉండే ఈ అంచ‌నా వెలువ‌రించార‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యం.

ఈ ఎన్నిక‌ల్లోనూ  బెట్టింగ్ ముఠాలు రెడీ అయిపోయాయి.ఈ ఎన్నిక‌ల్లో  ఎవ‌రు గెలుస్తారో అంద‌రికీ ఓ అంచ‌నా ఉన్న‌ప్ప‌టికీ బెట్టింగ్ దందాల‌కోస‌మే  ముందుగా ప్ర‌శాంత్ కిషోర్ ని రంగంలోకి దించారు.  పీకే కొద్ది వారాల క్రితం చంద్ర‌బాబు నాయుడితో  రెండు గంట‌ల‌కు పైగా ఏకాంతంగా భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత  ఆర్. టీవీ అధినేత  ర‌వి ప్ర‌కాష్  త‌న  సంస్థ స్ట‌డీ రిపోర్ట్ వెలువ‌రించారు. ర‌వి ప్ర‌కాష్ చేత ఈ స‌ర్వే చేయించింది నారా లోకేషే అని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏ పార్టీ గెలుస్తుంద‌న్నది జూన్ 4న ఎలాగూ తేలుతుంది. అయినా వీరు బ‌రితెగించి త‌ప్పుడు స‌ర్వేలు ప్ర‌క‌టించ‌డం వ‌ల్ల ఆ పార్టీల‌కు రాజ‌కీయంగా లాభం ఉండ‌దు. కాక‌పోతే బెట్టింగ్ నిర్వాహ‌కుల‌కు మాత్రం కోట్ల‌కు కోట్లు క‌లిసొస్తుంది. ఇదీ ఈ ఫేక్ స‌ర్వేల వెనుక ఉన్న  ప‌ర‌మార్ధం అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి