పోలింగ్ శాతం పెరిగితే ప్రభుత్వ వ్యతిరేకతేనా ?

By KTV Telugu On 17 May, 2024
image

KTV TELUGU :-

ఏపీలో పోలింగ్ శాతం గత ఎన్నికల కన్నా రెండు శాతం పెరిగింది.  రాజకీయాలపై విశ్లేషణలు చేసే వారికి రెండు శాతం ప్రాధాన్యత ఏమిటో బాగా తెలుసు ఎందుకంటే ఏపీలో సహజంగానే పోలింగ్ ఎక్కువగా జరుగుతుంది. గతంలో దాదాపుగా ఎనభై శాతం ఉంటే.. అది ఎనభై రెండు శాతం అయింది. ఇంత ఎక్కువగా పోలింగ్ జరిగే రాష్ట్రాలు ఇండియాలో అరుదు.  పార్టీల ఎలక్షనీరింగ్ కానీ మరొకటి కానీ మొత్తానికి అత్యధిక పోలింగ్ జరిగింది. మరి ఇది ప్రభుత్వానికి వ్యతిరేకతమేనా ?.  ఎందుకు అలా విశ్లేషిస్తున్నారు ?

ప్రభుత్వంపై బాగా వ్యతిరేకత ఉంటే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని దింపడానికి ఉత్సాహంగా ఓటింగ్ కు వస్తారు..  ఆ ప్రభుత్వంపై పాజిటివ్ ఉంటే.. ఓటు వేయడానికి ఆసక్తి చూపరు… అనేది భారత రాజకీయాల్లో చాలా రోజులుగా వినిపించే ఓ సూక్తి. దీన్ని రాజకీయవర్గాలు ఎక్కువగా నమ్ముతూంటాయి.  వీరి నమ్మకానికి తగ్గట్లుగానే అనేక రాష్ట్రాల్లో పోలింగ్ శాతం పెరిగినప్పుడల్లా ప్రభుత్వాలు మారిపోయాయి. అయితే మారని సందర్భాలు కూడా ఉన్నాయి. ఒడిషాలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వానికి ఎప్పుడూ పాజిటివ్ ఓటు పడుతూనే ఉంది. పోలింగ్ శాతం పెరుగుదలతో అక్కడ ఫలితాలకు సంబంధం లేదు.

కానీ అక్కడి రాజకీయ పరిస్థితులు వేరు.. అక్కడి జనం ఆలోచనలు వేరు.  దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజలు రాజకీయంగా హైపర్ యాక్టివ్ గా ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో ఇంకా హైపర్ యాక్టివ్ గా ఉంటారు. అందుకే ఫలితాలు అంచనాలకు అందని విధంగా ఉంటాయి.

ఈ సారి ఆంధ్రప్రదేశ్‌లో 82 శాతానికి కొద్దిగా తక్కువగా పోలింగ్ నమోదు అయింది. ఏపీలో ఎప్పటికప్పుడు పోలింగ్ పర్సంటేజీ పెరుగుతూనే ఉంది.   2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో పోలిస్తే 2024లో  రెండు శాతం అధికంగా ఓట్లు పోలయ్యాయి. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ఉపాధి కోసం బయట రాష్ట్రాలకు వెళ్లిన ప్రజలు  దూరాభారమైనా, ఖర్చులకు వెనుకాడకుండా వచ్చి ఓటేసి వెళ్లారు.   ఇదగి వారిలో ఉన్న చైతన్యాన్ని  తెలుపుతోంది. ప్రజాస్వామ్యంలో ఎంత ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకుంటే అంత నిజమైన ప్రజాభిప్రాయం వెలుగులోకి వస్తుంది. దేశంలో అత్యధిక ఓటింగ్ పర్సంటేజీ ఉన్న రాష్ట్రం ఏపీ.  ఎక్కువ గ్రామీణ ప్రాంతాలు ఉండటం పట్టణ ప్రజలు కూడా ఓటు విషయంలో ఎంతో పర్టిక్యులర్ గా ఉండటంతో  ఓటింగ్ శాతం ఎక్కువగా మారింది. ప్రతి వంద మందిలో 82 శాతం ఓటు హక్కు వినియోగించుకోవడం మామూలు విషయం  కాదు. పోస్టల్ ఓట్లలో కూడా 95 శాతానికిపైగా వినియోగించుకోవడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. మామూలుగా అయితే వారు దరఖాస్తు కూడా సగం మందే చేసుకుంటారు.

ఎలా చూసినా ఆంధ్రప్రదేశ్ కు సంబంధిచిన ఓటర్లలో ఓ రకమైన భావన ఉందని ఈ పోలింగ్ వేవ్ చూస్తే అర్థమవుతుంది. ఈ  భావన ప్రభుత్వాన్ని కాపాడుకోవాలన్న కసి అని వైసీపీ వర్గాలంటున్నాయి. కాదు ఐదేళ్లలో రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని సరిదిద్దాలన్న తపన కనిపించిందని విపక్షాలు చెబుతున్నాయి. పాజిటివ్ ఓటు వేయడానికి ఇలా వెంటపడి ..  అష్టకష్టాలు పడి ఏపీకి వెళ్లే వారు ఉంటారని ఎక్కువ మంది భావించడం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసేవాళ్లే ఉంటారని అంచనా. ఎందుకంటే గత ఐదేళ్లుగా ఏపీలో అనేక రకమైన సమస్యలు చుట్టుముట్టాయి.  పోలవరం ఆగిపోయింది..అమరావతి ఆగిపోయింది. కనీస రోడ్ల సదుపాయాలు లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే… ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ప్రజల ఖాతాల్లో డబ్బులేస్తామని మాత్రం చెబుతోంది. అలా డబ్బులు తీసుకునే ఓటర్లు బయట రాష్ట్రాల్లో ఉండేవారు తక్కువ.  వారిలోనూ ఉపాధి విషయంలో గుబులు ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. అందుకే ఏపీలో పెరిగిన ఓటింగ్ ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకతేనని చెబుతున్నారు.

సహజంగా అధికారంలో ఉండే పార్టీలు పెరిగిన పోలింగ్ ను తమకు అనుకూలంగా చెప్పుకుంటాయి. 2019లో ఒక్క శాతం ఓటింగ్ పెరిగితే..  టీడీపీ ఘోర పరాజయం చూడాల్సి వచ్చింది.  అప్పట్లో ఓటింగ్ కు కౌంటింగ్ కు మధ్య రెండు నెలల గ్యాప్ ఉంది.  ఈ మధ్య కాలంలో అనేక విశ్లేషణలు చేసినా ఓటింగ్ టీడీపీకి అనుకూలంగా జరిగిందా.. వ్యతిరేకంగా జరిగిందా అన్నది తేల్చలేకపోయారు.  ఫలితాలే  .. వైసీపీ వేవ్ ఉందని తేల్చాయి.  ఈ సారి కూడా ఎవరెన్ని విశ్లేషణలు చేసినా ఫలితాలే అసలు నిజం.  పెరిగిన పోలింగ్ పర్సంటేజీ  ఎటు వైపు ఉంటుందన్న దానిపై ఎవరి విశ్లేషణలు వారు చేసుకుంటారు. కానీ ఈ రెండు శాతం ఓట్లు మాత్రం ఫలితాల్ని   డిసైడ్ చేయబోతున్నాయి.  మా ఒక్క ఓటు వేయకపోతే ఏమవుతుందన్న అభిప్రాయానికి తావు లేకుండా.. . ఓటు అనేది అత్యంత ముఖ్యం అని భావిస్తున్న ఓటర్ల చైతన్యం.. ప్రజాస్వామ్యానికి రక్ష అనుకోవచ్చు.

కేవలం పోలింగ్ పర్సంటేజీ పెరిగిందని అధికార పార్టీ ఓడిపోతుందని చెప్పలేం. పోలింగ్ పర్సంటేజీ పెరగడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. అందులో ప్రభుత్వ వ్యతిరేకత ఓ కారణం అయితే..  మాత్రం ఖచ్చితంగా ఫలితాలు అలాగే వస్తాయి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి