పట్టభద్రుల ఎమ్మెల్సీ – కేటీఆర్ రాంగ్ స్టెప్

By KTV Telugu On 17 May, 2024
image

KTV TELUGU :-

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాలుగు నెలలకే లోక్ సభ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికలతో కిందా మీదా పడుతున్న సమయంలోనే మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభావం చూపేలా మరో ఉపఎన్నిక వచ్చి పడింది. అదే  ఖమ్మం, నల్గొండ, వరంగల్, పట్టభద్రుల ఉపఎన్నిక. మూడేళ్ల క్రితం ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ స్థానం నుంచి గెలిచారు. ఆయన జనగామ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. దాంతో రాజీనామా తప్పనిసరి అయింది. ఉపఎన్నిక వచ్చేసింది.  కానీ వలస నేతకు టిక్కెట్ ఇచ్చి బీఆర్ఎస్ మొదటి అడుగులోనే తడబడింది.

గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీల బలం పరిమితంగా ఉంటుంది. విద్యావంతులు ఎవరికి నచ్చితే వారికి ఓటు వేస్తారు. గతంలో విద్యా సంస్థల అధినేత ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి.. బీఆర్ఎస్ అభ్యర్థిగా అంగ, అర్థబలాలను ఉపయోగించుకుని విజయం సాధించారు. రెండో స్థానంలో తీన్మార్ మల్లన్న, మూడో స్థానంలో కోదండరాం నిలిచారు.  అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థి రేసులో కూడా లేరు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికార పార్టీ హోదాలో ఉండటంతో  ముందస్తుగానే అభ్యర్థిని ప్రకటించింది. గ్రాడ్యూయేట్లలో మంచి ఆదరణ ఉన్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ను ఎంపిక చేసుకుంది.  ఆయన  ప్రచారం చేసుకుంటున్నారు.

బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డిని కేసీఆర్ ఖరారు చేశారు. బీజేపీ టిక్కెట్ రాకపోవడంతో ఆయన అసెంబ్లీ ఎన్నికల సమయమంలో బీఆర్ఎస్ లో చేరారు.  రాకేశ్ రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి సహా మెజార్టీ లీడర్లు వ్యతిరేకిస్తున్నారు.  బుధావారం తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నిర్వహించిన సమావేశానికి సగానిపైగా లీడర్లు హాజరు కాలేదు. 130 మంది నాయకులకు ఆహ్వానం ఉండగా కేవలం 50 నుంచి 55 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ టికెట్ ను వికలాంగుల సంక్షేమ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి, గీత కార్మికుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్,  దూదిమెట్ల బాల్ రాజ్ యాదవ్ ఆశించారు.  వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పరిధిలోని మఖ్యనేతలే మీటింగ్ కు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్ల ధర్మారెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బస్వారాజు సారయ్య, తక్కెళ్లపల్లి రవీంద్ రావుతో పాటు పలువురు కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఈ మీటింగ్ కు గైర్హాజరయ్యారు.  రాకేశ్ రెడ్డికి మద్దతు ఇచ్చేది లేదని పలువురు బహిరంగంగానే చెబుతున్నారు.

ఇక బీఆర్ఎస్ కు ఓ రకంగా ఇది సిట్టింగ్ స్థానం. తమ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా వల్ల వచ్చిన ఉపఎన్నిక. అందుకే గెలవడం మరింత ప్రతిష్టాత్మకం. కానీ ఇప్పుడు అభ్యర్థిని నిలపడంతోనే తడబడ్డారు. మరో వైపు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ప్రత్యేక శైలితో ప్రచారం చేసుకుంటున్నారు ఆయనకు కాంగ్రెస్ నేతలు సహకరిస్తున్నారు.  సాధారణ రాజకీయ నేతలతో పోలిస్తే ఆయనది భిన్నమైన శైలి.   నామినేషన్ వేయగానే  తనతో పాటు తన కుటుంబానికి ఉన్న ఆస్తులన్నింటినీ ప్రభుత్వానికి రాసిచ్చేశారు. తీన్మార్ మల్లన్న పబ్లిసిటీ స్టంట్ చేశారని అనుకున్నారు. కానీ ఆయన పత్రాలు రిజిస్టర్ కూడా చేసేశారు.   పనితీరు ఆధారంగా తనపై తానే రీకాల్ సిస్టమ్ కూడా పెట్టుకుంటానని చెబుతున్నారు.   కేసీయార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూట్యూబ్ ఛానల్లో చేసిన వీడియోలతో తీన్మార్ మల్లన్న   పాపులర్ అయ్యారు. క్యూ న్యూస్ పేరుతో ఉన్న ఆయన చానల్ కు యువతలో మంచి క్రేజ్ ఉంది.  ఓ టీవీ చానల్లో ‘తీన్మార్ మల్లన్న’ కార్యక్రమంతో చింతపండు నవీన్ కుమార్ కు తీన్మార్ మల్లన్న అన్న పేరు స్ధిరపడిపోయింది.  దాన్ని ఆయన క్రమబద్దంగా ఉపయోగించుకుంటూ వస్తున్నారు.

ఈ స్థానానికి 2021లో ఎన్నికలు జరిగినప్పుడు మల్లన్న ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. కోదండరాంను కూడా దాటేసి రెండో స్థానంలో నిలిచారు.  2021లో జరిగిన  నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు. అప్పట్లో బీఆర్ఎస్ అధికారంలో ఉంది.  పల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యా సంస్థల అధినేత. ఆయన తన నెట్ వర్క్‌ను ఉపయోగించుకుని పట్టభద్రుల ఓట్లను పెద్ద ఎత్తున ఎన్‌రోల్ చేయించారు. పకడ్బందీగా పోల్ చేయించుకోగలిగారు. కానీ ఈ సారి ఓట్ల నమోదులోనూ పార్టీలు పెద్దగా జోక్యం చేసుకోలేదు.  దీనికి కారణం సాధారణ ఎన్నికల హడావుడిలో పడిపోవడమే.

మొత్తంగా సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానంలో  అభ్యర్థిని గెలిపించుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ మొదటి అడుగులు ఫెయిలయింది. సొంత నేతల మద్దతును కూడగట్టుకోలేకపోయింది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి