ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వడంపై బిజెపి గుర్రుగా ఉంది. సుప్రీం కోర్టు కేజ్రీవాల్ కు స్పెషల్ ట్రీట్ మెంట్ ఇచ్చిందని స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించడం రచ్చ రాజేసింది. దీనిపై రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు పుట్టాయి. సుప్రీంకోర్టు మాత్రం.. కేజ్రీవాల్‌కు ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్యంత బెయిల్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దీనికి కారణంగా మారాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చిందని వ్యాఖ్యానించారు షా. ప్రచారం కోసం బెయిల్ ఇవ్వడం సాధారణ జ్యుడీషియల్ తీర్పు కాదన్నారు. ఇది తనొక్కడి ఉద్దేశం మాత్రమే కాదని, చాలామంది తనలానే భావిస్తున్నారని చెప్పారు. జాతీయ మీడియా సంస్థ ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు అమిత్ షా.
దేశంలో చాలామంది ప్రజలు కేజ్రీవాల్‌ను సుప్రీంకోర్టు ప్రత్యేకంగా చూసిందనే నమ్ముతున్నారని తెలిపారు. అమిత్ షా వ్యాఖ్యలతో కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పందించింది. కేజ్రీవాల్‌కు ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని స్పష్టంచేసింది. తమ తీర్పు స్పష్టంగా ఉందని, తాము న్యాయం అనుకున్న విషయాన్నే తీర్పులో చెప్పామని తేల్చిచెప్పింది. కోర్టు తీర్పుపై విమర్శనాత్మక విశ్లేషణలను స్వాగతిస్తున్నామని వ్యాఖ్యానించింది.. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తాజాగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మధ్యంతర బెయిల్ వ్యవహారాన్ని లేవనెత్తారు.. ఈడీ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ప్రచారంలో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలంతా ఆమ్ఆద్మీ పార్టీకి ఓటేసి గెలిపిస్తే, తాను తిరిగి జైలుకు వెళ్లనంటూ కేజ్రీవాల్ చేసిన ప్రకటనను ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. ఇది కేవలం ఆయన ఊహని, దానిపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని స్పష్టంచేసింది.
లిక్కర్ కేసులో మధ్యంతర బెయిల్‌పై రిలీజ్ అయిన కేజ్రీవాల్.. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. చీపురుకు ఓటేసి ఆప్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. ఆప్ పార్టీకి ఓటేస్తే.. తాను మళ్లీ జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. మద్యం కుంభకోణంలో మార్చి 21న అరెస్టయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు.. ఈ నెల 10న మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది సుప్రీంకోర్టు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించింది. ఎన్నికల ప్రచారం అనేది ప్రాథమిక హక్కు కాదని.. ఇందుకోసం బెయిల్ అవ్వాల్సిన అవసరం లేదని గట్టిగా వాదించింది ఈడీ. సామాన్యులకు ఒక న్యాయం, ప్రముఖులకు మరో న్యాయం ఉండదని పేర్కొంది. దీనివల్ల ప్రజల్లోకి తప్పుడు సందేశం వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేసింది. ఐదేళ్లకోసారి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేయాల్సిన బాధ్యత పార్టీ అధినాయకుడికి ఉంటుందని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు.. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది.
జూన్ 2 తిరిగి జైలుకెళ్లాలని ఆదేశించింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వస్తాయి కాబట్టి, జూన్ 5 వరకు బెయిల్ ఇవ్వాలన్న కేజ్రీవాల్ తరపు న్యాయవాదుల విజ్ఞప్తిని తోసిపుచ్చింది సుప్రీం ధర్మాసనం. జూన్ 2న లొంగిపోవాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అయితే ప్రచారం కోసం ఒకరికి బెయిల్ ఇవ్వడం.. దేశ న్యాయచరిత్రలో ఇదే తొలిసారి అని విశ్లేషిస్తున్నారు న్యాయకోవిదులు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పెషల్ ట్రీట్మెంట్ వ్యాఖ్యలతో ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారిపోయింది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…