హైదరాబాద్ లో మరోసారి యాభై శాతంలోపే పోలింగ్ జరిగింది. దీంతో ఎక్కువ మంది సీమాంధ్ర ఓటర్లు ఏపీకి వెళ్లడమే కారణంగా చెబుతున్నారు. కానీ కానే కాదని తాజా గణాంకాలు చెబుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు కానీ అంతకు ముందు 2019 నాటి పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే కాస్త పెరుగుదల నమోదైంది. ఈ పరిస్థితుల్ని విశ్లేషిస్తే.. ఓటర్ జాబితాలో అక్రమాలతో పాటు పాతబస్తీ నియోజకవర్గాల్లో ఓటర్లు ఆసక్తి చూపించకపోవడమే కారణమని అనుకోవచ్చు.
2019 పార్లమెంట్ ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం స్వల్పంగానే పెరిగింది. మొత్తంమీద యాభై శాతం పోలింగ్ దాటలేదు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 44.75 శాతం పోలింగ్ నమోదు అయింది. తాజాగా జరిగిన ఎంపీ ఎన్నికల్లో హైదరాబాద్ లో 48.48 శాతానికి పెరిగింది. గత పార్లమెంట్ ఎన్నికల కంటే 3.73 శాతం ఓటింగ్ పెరిగింది. పాత బస్తీ ఓటర్లు ఓటేసేందుకు ముందుకు రాని పరిస్థితి కనిపించింది. చార్మినార్, యాకుత్ పురా, చాంద్రాయణగుట్ట, బహదూర్ పురా ప్రాంతాల్లో యాభైశాతానికి పైగా ఓటర్లు పోలింగ్ ప్రక్రియలో పాల్గొనలేదు. మలక్ పేటలో మజ్లిస్ కార్యకర్తలు ఇంటింటికి వచ్చి తలుపులు బాది ఓటింగుకు తరలిరావాలని కోరినా ఓటర్లు మాత్రం పోలింగ్ కేంద్రాలకు రాలేదు.
సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో 2019 ఎంపీ ఎన్నికల్లో 46.26 శాతం ఓటర్లు పోలింగులో పాల్గొన్నారు. ఈ సారి ఎంపీ ఎన్నికల్లో సికింద్రాబాద్ లో పోలింగ్ శాతం 49.04కు పెరిగింది. సికింద్రాబాద్ లో గత ఎంపీ ఎన్నికల కంటే 2.78 శాతం ఓటింగ్ పెరిగింది. అక్షరాస్యతతోపాటు సంపన్నులు అధికంగా నివాసమున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ శాతం తక్కువగానే నమోదైంది. నాంపల్లి, ముషిరాబాద్, సనత్ నగర్ ప్రాంతాల్లోనూ పోలింగ్ అంతంత మాత్రమే. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో గత 2019 ఎన్నికల్లో 45.65 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ సారి జరిగిన ఎంపీ ఎన్నికల్లో పోలింగ్ శాతం 48. 91శాతానికి పెరిగింది. పెరిగిన పోలింగ్ శాతాలను చూస్తే.. ఏపీకి వెళ్లిన ఓటర్ల ప్రభావం కాదని అంచనా వేసుకోవచ్చు. ఓటర్ కార్డును ఆధార్ తో అనుబంధానం చేసిన తర్వాత చాలా మందికి డబుల్ ఓట్లు తగ్గిపోయాయి. కానీ పూర్తిగా కాదు.
పోలింగ్ శాతం తగ్గడానికి ప్రధానంగా కారణం పాతబస్తీలో ప్రజలకు అవగాహన పెంచలేకపోవడం. పాతబస్తీలో ఏ పార్టీ కూడా ప్రచారం కూడా చేయలేదు. అసలు ఎన్నికలు జరుగుతున్నాయని కూడా చాలామంది ఓటర్లకు తెలియదు. మజ్లిస్ పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ కనీసం ఎన్నికల్లో మేనిఫెస్టోను కూడా విడుదల చేయరు. ప్రచారం, ఎలాంటి హామీలు ఇవ్వకుండానే గల్లీ లీడర్ల ఆధ్వర్యంలో పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఓటర్లను చైతన్యవంతులను చేస్తే వారు నిలదీస్తారనే భయంతో పాటు మజ్లిస్ వ్యతిరేక ఓటు పడుతుందని వారు అసలు ఎన్నికల గురించి ఎవరికీ చెప్పరని అంటారు. పాతబస్తీలో నిరక్షరాస్యత, నిర్లిప్తత, నిర్లక్ష్య ధోరణి పోలింగ్ శాతం తగ్గడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు.
హైదరాబాద్లో పోలింగ్ శాతం తక్కువగా ఉండటానికి హైదరాబాద్ నగర ఓటర్ల జాబితాల్లో డబుల్ ఓటింగ్, మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించక పోవడం మరో కారణం. ఓటర్ల జాబితాలో పేరున్న వృద్ధులు మరణించినా వారి పేర్లను జాబితా నుంచి తొలగించక పోవడంతో ఓటింగు తగ్గుతున్నట్లు కనిపిస్తుంది. ప్రధానంగా పాతబస్తీలో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తేనే సులువుగా పోలింగ్ శాతం పెరుగుతుంది. కానీ ఆ దిశగా ప్రయత్నం చేసేవారు లేరు.
హైదరాబాద్ లోని పాతబస్తీ ప్రాంతంతో పాటు ఎక్కువ మంది వలస ప్రజలు ఉండటం కూడా పోలింగ్ శాతం ప్రభావం చూపిస్తోంది. అందుకే ఓటర్ జాబితాలో ఉన్న వారిలో సగం మంది ఓటేసినా భారీ పోలింగ్ జరిగిందని అనుకోవాల్సి వస్తోంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…