రూ., 20 వేల కోట్లు – ఏపీ బెట్టింగ్ మార్కెట్ !

By KTV Telugu On 19 May, 2024
image

KTV TELUGU :-

ఆంధ్రప్రదేశ్ రాజకీయ  పార్టీలు ఎన్నికల కోసం ఎవరూ ఊహించని రీతిలో ఖర్చు పెట్టాయి.   అవి ఎన్ని వేల కోట్లు ఉంటుందో చెప్పలేం కానీ.. ఏపీ ఎన్నికలపై బెట్టింగ్ మార్కెట్ మాత్రం ఇరవై వేల కోట్లకు దాటిపోయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరు గెలుస్తారు అనే  చర్చ ప్రారంభమై.. పందెం అంటే పందెమా అనే దాకా ఇద్దరు మిత్రుల మధ్య చర్చలు సాగుతున్నాయి. అక్కడా ఇక్కడా అనే తేడా లేదు. ఎక్కడైనా ఇంతే.  ఈ బెట్టింగ్ ఎంతో మంది జీవితాలను తలకిందులు చేయబోతోంది.

ఆసక్తి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను ఇప్పుడు బెట్టింగ్ ఫీవర్ పట్టుకుంది.  పోలింగ్‌కు ఎంతో ముందు నుంచే పందేల జోరు మొదలయింది.  ఓటింగ్‌ ముగిశాక తారా స్థాయికి చేరాయి. పోలింగ్‌కు ఓట్ల లెక్కింపునకు మూడు వారాల సమయం ఉండటంతో …చర్చలతో ప్రారంభమయి బెట్టింగులతో ముగుస్తున్నాయి.  గతంలో బెట్టింగ్‌లంటే రూ.వేలల్లో నగదు రూపంలో ఎక్కడో ఉండేవి. రాను రాను పందేలు కూడా యాప్‌ల స్థాయికి చేరుకున్నాయి.  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తోడై కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వెబ్‌సైట్లు, ఆన్‌లైన్‌లు, యాప్‌ల వంటి డిజిటల్‌ వ్యవస్థలతో పాటు పెద్ద ఎత్తున ఆఫ్‌లైన్‌, మాన్యువల్‌ బెట్టింగ్‌లూ సాగుతున్నాయి. ఈ పందేలు కూడా వివిధ కేటగిరీల్లో జరుగుతున్నాయి. వ్యవస్థీకృతంగా జరిగే బెట్టింగులే కాదు.. ఇద్దరి మధ్య లేదా. ఓ కార్యాలయంలో పని చేసే వారి మధ్య.. మిత్రుల మధ్య ఇలా పందెలు జరుగుతున్నాయి.

సాధారణంగా ఎన్నికల పందేలంటే… ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయి అనే బెట్టింగ్‌లు గతంలో ఉండేవి. ఇప్పుడు అలా కాదు. ఫలాన పార్టీకి ఇన్ని సీట్లకు తగ్గవు అనే దాంతో మొదలుకొని నియో జకవర్గాలపైనా, మెజార్టీపైనా.. ఇలా అనేక అంశాలపై బెట్టింగ్‌లు తెరమీదికొచ్చాయి. పులివెందులలో జగన్‌ మెజారిటీపైనా, కుప్పంలో చంద్రబాబు మెజారిటీపైన, పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ గెలుపు, మెజార్టీపైన, కడప లోక్‌సభలో వైఎస్‌ షర్మిల గెలుపుపైన, రాజమండ్రిలో పురందేశ్వరి గెలుపు పైన… ఇలా అనేకానేక రకాల బెట్టింగ్‌లు పురుడు పోసు కుంటున్నాయి. అలాగే టిడిపి కూటమికి ఎంఎల్‌ఎ సీట్లెన్ని, ఎంపి సీట్లెన్ని, టిడిపికి ఎన్ని ఎంఎల్‌ఎ, ఎంపి సీట్లొస్తాయి, కూటమిలోని బిజెపికి, జనసేనకు ఎన్ని ఎంఎల్‌ఎ, ఎంపి సీట్లొస్తాయి, వైసిపికి ఎన్ని సీట్లొస్తాయి, అధికారం నిలబెట్టుకుంటుందా లేదా… ఇలా పందేలు కాస్తున్నారు. ఆంధ్ర ఎన్నికల ఫలితాలపై రూ.20 వేల కోట్ల వరకు బెట్టింగ్‌లకు అవకాశం ఉందని ఈ రంగంలో ఆరితేరిన బెట్టింగ్‌ రాయుళ్ల అంచనా. అంతకంటే ఎక్కువ మొత్తంలో బెట్టింగ్‌లు జరిగినా ఆశ్చర్యపడాల్సింది లేదంటున్నారు. పందేలు ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాదు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, వంటి రాష్ట్రాలతో పాటు, విదేశాల్లో స్థిరపడ్డ ఎన్‌ఆర్‌ఐలు కూడా ఎపి ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌ల్లో విరివిగా పాల్గొంటున్నారు.

ఐపిఎల్‌, వరల్డ్‌కప్‌, రేస్‌ కోర్స్‌ మాదిరిగా ఎలక్షన్‌ బెట్టింగ్‌లు సాగుతున్నాయి. జూదాన్ని మించిపోయింది. వీటిలోనూ మ్యాచ్‌ ఫిక్సింగ్‌లు జరుగుతున్నాయన్న ఆరోపణలొస్తున్నాయి.  వీరిని కొన్ని రాజకీయపార్టీల నేతలు వ్యూహాత్మకంగా రంగంలోకి దించుతున్నారన్న విమర్శలూ ఉన్నాయి.   బెట్టింగ్‌ల్లో నగదుతో పాటు ఆన్‌లైన్‌ పేమెంట్స్‌నూ ఉపయోగిస్తున్నారు. డబ్బు అందుబాటులో లేని వాళ్లు తమ ఆస్తులను, దస్తావేజులను పందెంలో పెడుతున్నారు. నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంప్‌ పేపర్లపై ఆస్తులకు సంబంధించి అగ్రిమెంట్‌లు సైతం రాసుకుంటున్నారు. బహిరంగంగా వేల కోట్లు చేతులు మారుతున్నా బెట్టింగ్‌లను నిరోధించేందుకు సరైన వ్యవస్థ మనకు లేదు.

కొన్ని పార్టీల అభ్యర్ధులు, నాయకులు తమ పార్టీ వైపు కాకుండా ప్రత్యర్థి పార్టీల వారు గెలుస్తారని బెట్టింగ్‌లు కాస్తున్నారు. ఎక్కడ ఖర్చు చేశామో అక్కడే రాబట్టుకోవాలనే సిద్ధాంతం కొందరు అభ్యర్ధుల్లో బయలుదేరింది. ఈ క్రమంలోనే అనేక ఫేక్ సర్వేలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ పార్టీ గెలుస్తుందని ఊరూపేరూ లేని సంస్థల పేరుతో సర్వేలు తరచూ  వస్తున్నాయి. ఇలాంటి కంపెనీల సర్వేలు చేసే అవకాశమే ఉండదు. ఎందుకంటే.. ఎవరికి ఓటేశావు అని.. కనుక్కుని డిసైడ్ చేయడం సర్వే కాదు. కులం, మతం, వర్గం.. ఓటు వేయడానికి కారణం ఇలా ఎన్నో విశ్లేషించుకునే మేథడాలజీని ఫాలో అయిన తర్వాత ఫలితం వస్తుంది. కానీ చాలా సంస్థలు సొంతంగా సర్వేను గ్రాఫిక్ ప్లేట్‌గా ప్రకటించేస్తూ ఉంటాయి. పోలింగ్ ముగిసినా ఇలాంటి సర్వేలు రావడం వెనుక బెట్టింగ్ వ్యవహారాలు ఉంటాయని ఎక్కువ మంది  నమ్ముతున్నారు.

బెట్టింగ్ అనేది జాడ్యం.  ఆ విష వలయంలో చిక్కుకుంటే సర్వనాశనం అయిపోయినా బయటపడలేరు. ఎన్ని చట్టాలు తెచ్చినా నిలువరించలేని పరిస్థితికి చేరింది.  మారాల్సింది బెట్టింగ్‌కు పాల్పడేవారి ఆలోచనలే.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి