ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు ముగిసినా ఎవరు గెలుస్తారో అంచనాలు అందడం లేదు. ఎవరికి వారే గెలుపు తమదని ధీమాలు వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో 79 శాతం పై చిలుకు ఓటింగ్ నమోదు కాగా ఈ సారి 82 శాతానికి చేరడం విశేషం. పెరిగిన పోలింగ్ శాతం తమకే అనుకూలమని అటు కూటమి ఇటు వైసీపీ నేతల అంచనాలు వేసుకుంటున్నాయి.సోషల్ మీడియాలో నూ ఈ గందరగోళం కొనసాగుతోంది. కూటమి అభిమానులు తమదే విజయమని పోస్టింగులు పెడుతోంటే.. వైసీపీ అభిమానులు మరోసారి క్లీన్ స్వీప్ చేస్తామంటున్నారు.
ఏపీలో ఈ సారి ఓటర్లు పోటెత్తారు. పోలింగ్ రోజున ఉదయాన్నే పోలింగ్ బూత్ ముందు బారులు తీరారు. ఆ చైతన్యాన్ని చూసి రాజకీయ పరిశీలకులే ఆశ్చర్యపోయారు. గత ఎన్నికలను మించి పోలింగ్ నమోదు కావడం ఎవరికి లాభమన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పాలక పక్షం మరోసారి 150కి మించి అసెంబ్లీ స్థానాలు 22కి మించి లోక్ సభ స్థానాలు గెలుచుకుంటుందంటూ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి బాహాటంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం సంచలనం సృష్టించింది.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇంత వరకు ఇన్ని సీట్లు గెలుస్తామని ఎక్కడా అనలేదు.
చంద్రబాబు నాయుడు అయితే తర్వాతి ప్రభుత్వం తమదే అంటున్నారు కానీ ఎన్ని సీట్లో చెప్పడం లేదు. తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం కూటమికి 120 సీట్లు కచ్చితంగా వస్తాయని అంటున్నారు ఇటు వైసీపీ, అటు కూటమి తామే వస్తామని అంత ధీమా వ్యక్తం చేయడానికి కారణాలేంటన్న దానిపై చర్చ జరుగుతోంది. అయిదేళ్లుగా తమ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలే తమని గెలిపించాని వైసీపీ నేతలు అంటున్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై తాము చేసిన హెచ్చరికలు పనిచేశాయని టిడిపి అంటోంది. ఎవరి మాట నమ్మాలి? ఓటరు ఎవరిని ఆశీర్వదించారన్నది రహస్యమే.
కూటమి అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని వైసీపీ అంటోంది. కేవలం బెట్టింగు దందాల కోసమే టిడిపి తాము గెలుస్తున్నామంటూ బిల్డప్పులు ఇస్తోందని పాలక పక్షం ఆరోపిస్తోంది. విజయవాడ కేంద్రంగా జరిగే బెట్టింగ్ కేంద్రాలన్నీ కూడా టిడిపి నేతలవే అని వారంటున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా ప్రభంజనమే వీచిందని వారు చెబుతున్నారు. దానికి భిన్నంగా కూటమిలో కీలక నేతలే ఓడిపోతారని వైసీపీ నాయకత్వం అంటోంది. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ , లోకేష్, పురందేశ్వరి ఓడిపోవడం ఖాయమని వైసీపీ చేయించుకున్న సర్వేలో తేలిందట.
విజయంపై ధీమాతో ఉన్న వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా పెట్టేసుకుంది. జూన్ 9న విశాఖలోనే జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని పాలక పక్షం ప్రకటించేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులు జూన్ 9న విశాఖ వెళ్లడానికి అప్పుడే ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి భిన్నంగా తెలుగుదేశం పార్టీ ఈ నెలాఖరున జరగాల్సిన మహానాడు కార్యక్రమాన్ని రద్దు చేసుకుంది. ఓడిపోతున్నామని తెలుసుకాబట్టే మహానాడు నిర్వహించడం లేదని పాలక పక్షం ఆరోపిస్తోంది. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆర్భాటం్గగా మహానాడునిర్వహిస్తామని టిడిపి నేతలు అంటున్నారు.
కొన్ని సర్వేలు అయితే ఎవరు గెలిచినా వారికి 110 స్థానాలు ఖాయమంటున్నాయి. అయిదేళ్లలో 86శాతం మంది ప్రజలకు రక రకాల సంక్షేమ పథకాల రూపేణా 2లక్షల 70 వేల కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేశారు జగన్ మోహన్ రెడ్డి. తన ప్రభుత్వం వల్ల లబ్ధి పొందిన వారు కచ్చితంగా తనకు ఓటు వేస్తారని వైసీపీ నమ్ముతోంది. 66 లక్షల మంది పింఛను దార్ల ఓట్లు గంప గుత్తగా తమకే పడతాయంటోంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, పోలీసులు, ఆశావర్కర్లు ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్నారని వారి ఓట్లు తమకే పడ్డాయని టిడిపి లెక్కలు వేసుకుంది. ఇక ఈ సస్పెన్స్ కు తెరపడేది జూన్ 4నే. అప్పటి వరకు గప్ చుప్.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…