పవన్ కల్యాణ్ అసలు లక్ష్యమేమిటి ? 21 స్థానాల్లో పోటీ చేస్తున్న పవన్ ఎలాంటి గేమ్ ప్లాన్ అమలు చేస్తున్నారు. ఫలితాలపై జనసేనాని స్పష్టమైన అంచనాతో ఉన్నారా. ఏపీ రాజకీయాలను మార్చేసే సత్తా పవన్ కు ఉందా. జనసేన ఎటువైపు పావులు కదుపుతోంది… ? మిత్రపక్షాన్నే టార్గెట్ చేయాలని జనసేన అనుకుంటున్నట్లుగా వస్తున్న వార్తలు నిజమేనా….
సక్సెస్ రేటుపై జనసేన ఆశలు పెట్టుకుంది. 21 స్థానాల్లో పోటీ చేసిన పవన్… అసలు లక్ష్యాన్ని సైతం నిర్దేశించుకున్నారు. తీసుకున్నవి ఎన్ని అని ఆలోచించే కంటే.. వంద శాతం గెలిస్తే ప్రయోజనం ఉంటుందని పవన్ ఆలోచిస్తున్నారు. 19 నుంచి 20 సీట్ల వరకు గెలవగలిగితే ఏపీ రాజకీయాలను మార్చేసే సత్తా తమ చేతిలో ఉంటుందని పవన్ విశ్వసిస్తున్నారు. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. తాము ఎక్కువ సీట్లు తీసుకున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన కార్యకర్తలు బాగానే పనిచేశారని పవన్ నిర్థారణకు వచ్చారు. పవన్ కల్యాణ్ ను బలమైన నాయకుడిగా చూడాలనుకున్న కాపులంతా భారీగా డబ్బు ఖర్చుపెట్టారు.పార్టీకి ఓటేస్తారనుకున్న ఓటర్లను గుర్తించి, ఎంపిక చేసి, లెక్కగట్టి డబ్బులు పంచారు. వారంతా తమకే ఓటేస్తారని నిర్ధారించుకున్న తర్వాత ఇప్పుడు ధైర్యంగా ఉన్నారు. అందుకే జనసేనాని, ఆయన సైన్యం ఈ సారి దాదాపు నూరు శాతం సక్సెస్ పై ధీమాగా ఉన్నారు. పైగా తమకు వచ్చిన స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టామన్న ధీమా వారిలో కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్ ఇచ్చేందుకు సైతం జనసేన వెనుకాడలేదు. ఈ దిశగా వైసీపీ నుంచి వచ్చిన విమర్శలను సైతం పట్టించుకోలేదు.
ఏపీలో అధికారం ఎవరిదన్నది ఇప్పుడు పెద్ద చర్చగా కొనసాగుతోంది. టీడీపీ కూటమి గెలుస్తుందని ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తలు కూడా తెగేసి చెబుతున్నారు. జననాడి కూడా కూటమి వైపే ఉండటంతో తమకు మంచి రోజులు వచ్చాయని జనసేన ధైర్యంగా ఉంది. అయితే ఇప్పుడా పార్టీ లెక్కలు వేరుగా ఉన్నాయనుకోండి…
సైలెంట్ వేవ్ కూడా టీడీపీ కంటే జనసేన వైపే ఎక్కువగా ఉన్నట్లు మీడియాలో వినిపిస్తున్న మాట. 2019లో ఒక్క సీటుకే పరిమితమైన పీడకలను మరిచిపోయి… ఇప్పుడు గెలిచిన సీట్లతో పార్టీకి బంగారు రహదారి వేసుకోవాలని సేన భావిస్తోంది. దానిపై పవన్ కల్యాణ్ వేసుకుంటున్న లెక్కలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. జనసేనకు అటు ఇటుగా 19 సీట్లు వచ్చి, టీడీపీకి సొంతంగా 85 సీట్లు రాకపోతే తాము చక్రం తిప్పవచ్చన్నది పవన్ ఆలోచనా విధానమట. ఏదైనా అవకాశం వస్తే బీజేపీ కూడా తన పక్షానే ఉంటుందని, తాను మాత్రమే బీజేపీని తీసుకొచ్చి కూటమిలో కలిపానని పవన్ గుర్తు చేసుకుంటున్నారట. టీడీపీ మ్యాజిక్ ఫిగర్ దాటకపోతే అప్పుడు అసలైన రాజకీయం స్టార్ట్ అవుతుందని అంటున్నారు. కర్నాటకలోని జేడీఎస్ మాదిరిగా, అలాగే కుమారస్వామి తరహాలో కనీసం ఒక ఏడాది అయినా పవన్ కళ్యాణ్ సీఎం గా అయ్యేందుకు కూటమి నుంచి క్లెయిం చేసే చాన్స్ కచ్చితంగా ఉంటుందని అంటున్నారు. అది 2029 ఎన్నికలకు పునాది అవుతుందని ఎందురు చూస్తున్నారు. పైగా వైసీపీలోని కొందరు కాపు నేతలు ఎన్నికల ఫలితాల తర్వాత జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అందులో పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పై పోటీ చేసిన వంగా గీత కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను వంగా గీత ఎక్కడా ఖండించలేదు. నేతలు వచ్చి చేరితే జనసేన బలపడటం ఖాయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…
పవన్ ఏపీ సీఎం కావడమే జనసేన లక్ష్యం. అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకు ఈ సారి పరిస్థితులు అనుకూలిస్తాయని జనసేన వర్గాలు ఎదురుచూస్తున్నాయి. మిత్రపక్షాల బలహీనతే వారి బలం కాబోతోందని చెప్పేందుకు కూడా సందేహించకూడదు…..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…