బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఎంపీగా గెలుస్తారా? ఆమె గెలుపుపై సొంత పార్టీలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. రాజమండ్రి పార్లమెంట్ పై ఏ మాత్రం అవగాహన లేకపోయినా ఆమె అక్కడి నుంచి పోటీ చేశారు. పైగా రాజమండ్రి సీటు ఆశించిన పార్టీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో ఎలాంటి సయోధ్యకు రాలేకపోయారు. సీటు రాలేదన్న ఆగ్రహంతో ఉన్న సోము ఎంపీ ఎన్నికల్లో పురందేశ్వరికి ఏమాత్రం సహకరించలేదనే టాక్ వినిపిస్తోంది. మరి రాజమండ్రిలో పురందేశ్వరి పోటీ ఎలా సాగింది? వాచ్ దిస్ స్టోరీ..
రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 16 లక్షల 23 వేలమంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 82 శాతం అంటే 12లక్షల 80వేల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా ఉన్నది శెట్టి బలిజ సామాజిక వర్గమే. అదే సామాజికవర్గానికి చెందిన వైఎస్ ఆర్ సీపీ అభ్యర్ధి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కే శెట్టిబలిజ వర్గం మద్దతు ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు పురంధేశ్వరితోపాటు పార్టీ కార్యక్రమాల్లో, ప్రచారంలో పాల్గొన్నా, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వర్గం మనస్ఫూర్తిగా పురంధేశ్వరి కోసం పనిచేయలేదన్న విషయం స్పష్టమవుతోంది. పార్టీలోని పెద్దలు ఇదే విషయాన్ని ధృవ పరుస్తున్నారు.
రాజమండ్రి పార్లమెంటరీ అభ్యర్ధిగా ప్రకటించినా, చాలారోజుల వరకూ పురంధేశ్వరి రాజమండ్రి ముఖం చూసిన పరిస్థితి లేదు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న పురంధేశ్వరి ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రాజమండ్రి వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వచ్చీ రావడంతోనే ఆ పార్టీ వర్గాలే విస్తుపోయే విధంగా బీజేపీ పార్టీ కార్యాలయాన్ని వదిలేసి.. ప్రత్యేకంగా ఓ ప్రయివేటు భవనాన్ని తన కార్యాలయంగా ఎంపిక చేసుకున్నారు. అక్కడి నుంచే తన ప్రచార కార్యకలాపాలను నిర్వహించారు.
పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత సోము వీర్రాజు ప్రమేయం లేకుండానే పురంధేశ్వరి ఎన్నికల కార్యక్రమాలు ప్రారంభించారు. అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో మాట్లాడి ప్రచారంలో పాల్గొన్నారు. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఉన్న నేతలంతా సోము వర్గానికే చెందినవారు అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో వారితో కలిసే ఎన్నికల ప్రచారంలో పాల్గొనవలసి వచ్చింది. సోమువర్గంతో అయిష్టంగానే కలసి పనిచేసిన పురంధేశ్వరికి ఆదిలోనే నియోజకవర్గ ఇంఛార్జులతో సమన్వయం లేకుండా పోయింది.
రాజానగరం నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో టీడీపీ ఇంఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదిరి, జనసేన నాయకుడు బత్తుల బలరామకృష్ణ కూడా సమావేశాన్ని బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా పరిస్థితి ఆశాజనకంగా లేకపోయినా, తప్పనిసరి పరిస్థితుల్లో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పోలింగ్ సమయంలో పార్లమెంట్ పరిధిలో సోము వర్గం ఎక్కడా పురంధేశ్వరికి మద్దతుగా పనిచేయలేదనే వాదన ఆ పార్టీ నేతల్లోనే వినిపిస్తోంది. బయటి నుంచి వచ్చిన నేతను ప్రోత్సహిస్తే, భవిష్యత్తులో తమపైనే పెత్తనం చేస్తారని, అదే విధంగా ఆమె చుట్టూ కొత్త కోటరీ ఏర్పడి తమను దూరం పెడతారనే ఆలోచనతో పురంధేశ్వరి గెలుపునకు స్థానిక బీజేపీ నేతలు ఏ మాత్రం సహకరించలేదనే ప్రచారం జరుగుతోంది.
స్వంత జిల్లా అయిన రాజమండ్రిలో దశాబ్దాలుగా పాతుకుపోయిన సోము వీర్రాజు, ఆయన క్యాడర్ ను పట్టించుకోకుండా పారాచ్యూట్ లో వచ్చిన పురంధేశ్వరికి బీజేపీ వర్గాలే కాకుండా టీడీపీ నేతల నుండి కూడా మద్దతు కరువైనట్టు తెలుస్తోంది. తమ పార్టీ తరపున పార్లమెంట్ అభ్యర్ధులుగా పోటీ చేసినవారికి ఏమాత్రం సహకరించని బుచ్చయ్య చౌదిరి లాంటి నేతలు పురంధేశ్వరి గెలుపుకోసం ఎంతమేర పనిచేశారన్న విషయంపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సవాలక్ష కారణాలతో రాజమండ్రి పార్లమెంట్ స్థానంలో పురంధేశ్వరి గెలుపుపై కూటమి నేతలే పెదవి విరుస్తున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…