మోదీ కాక ఇంకెవరు !

By KTV Telugu On 22 May, 2024
image

KTV TELUGU :-

ఐదు విడతల  పోలింగ్ తర్వాత బీజేపీకి సానుకూల పవనాలు లేవన్న ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ అనుకూల వర్గాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. సెఫాలజిస్టులు, ప్రశాంత్ కిషోర్ వంటి స్ట్రాటజిస్టులు , సర్వేలు అన్నీ బీజేపీకి ఎదురే లేదని చెబుతున్నాయి. బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉన్న వారు ఆ పార్టీ వెనుకబడాలని కోరుకుంటున్నారు. రెండు వందలకు మించి సీట్లు రాకూడదని కేసీఆర్ లాంటి వారు అభిలాషిస్తున్నారు. కానీ బీజేపీకి ఎంత ప్రతికూల పరిస్థితులు ఉన్నా ప్రభుత్వం మాత్రం బీజేపీదే వస్తుంది.. మోదీ నే ప్రధాని అవుతారు. ఎందుకంటే .. విపక్ష కూటమి అవకాశాలను అందిపుచ్చుకునే స్థితి లేదు మరి.

భారతీయ జనతా పార్టీకి రెండు వందల సీట్ల కంటే ఎక్కువ రావని .. రాకూడదని కొన్ని ప్రాంతీయ పార్టీల నేతలు కోరుకుంటున్నారు.  బీజేపీకి రెండు వందల సీట్లు వచ్చినా.. కాంగ్రెస్ పార్టీకి 125 సీట్లు వచ్చినా చాలు తమ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి  చెబుతున్నారు.  కాంగ్రెస్‌కు 125 సీట్లు వస్తే  మిత్రపక్షాలు 150 సీట్లు తెచ్చుకుని కాంగ్రెస్ కు మద్దతివ్వాలి. ఇండియా కూటమిలో పార్టీలు అంత బలంగా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే అసలు అలాంటి చాన్స్ వస్తే.. ఆయా పార్టీ కాంగ్రెస్ వైపే ఉంటాయన్న నమ్మకమే లేదు. ఆ  పరిస్థితిని మొదటి సారిగా మమతా బెనర్జీ చూపించారు. ఇండియా కూటమితో కలిసి ఆమె పయనిస్తున్నారో లేదో తెలియనంతగా రాజకీయం చేస్తున్నారు. ఖచ్చితంగా  ఆమెకు మ్యాజిక్ మార్క్ కు సరిపడా సీట్లు వస్తే..  ఆమె ప్రధానమంత్రి పదవిని ఆశిస్తారు లేకపోతే.. బీజేపీకి మద్దతిస్తారు కానీ.. కాంగ్రెస్ జోలికి వెళ్లే అవకాశం ఉండదు. ఎందుకంటే బీజేపీకి మద్దతిస్తే..  బెంగాల్ లో ఆ పార్టీని పూర్తిగా కంట్రోల్ చేయవచ్చు.  కాంగ్రెస్ కు మద్దతిస్తే బీజేపీ మరింత చెలరేగిపోతుంది. అలాంటి పరిస్థితిని మమతా బెనర్జీ కోరుకోరు.

ఇక ఇండియా కూటమిలో మరో కీలక పార్టీ డీఎంకే, మిత్రపక్షాలు, ఈ కూటమికి 30 సీట్ల వరకూ వస్తాయి.  రాహుల్ గాంధీ వేపే ఉంటాయి. కేరళలో లెఫ్ట్ పార్టీలకు సీట్లు వస్తాయో లేదో చెప్పడం కష్టంగా మారింది. వచ్చినా రాకపోయినా కేరళలో సీట్లు  కాంగ్రెస్‌కు మద్దతు పలుకుతాయి. సౌత్ లో బీజేపీ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా బీజేపీ బ్యాలెన్స్ చేసుకుంది. ఇక్కడ కాంగ్రెస్ సాధించేదేమీ ఉండకపోవచ్చు. కర్ణాటకలో కొన్ని సీట్లు.. తెలంగాణలో కొన్ని సీట్లు అదనంగా సంపాదించవచ్చు. కానీ దేశంలో ఇంకెక్కడా కాంగ్రెస్ మెరుగుపడిందని ఎవరూ చెప్పడం లేదు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క తెలంగాణ మినహా అన్ని చోట్లా పరాజయం పాలైంది. గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లో పుంజుకుంటారన్న దానికి అవకాశాలు కనిపించడంలేదు.  కాంగ్రెస్ పార్టీ ఎలా చూసినా వంద స్థానాల్లో విజయం సాధిస్తే అద్భుతం చేసినట్లే.

అదే బీజేపీ విషయానికి వస్తే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లోనే ఈజీగా అరవై సీట్లు సాధిస్తుంది.  పాతిక సీట్లకుపైగా ఉన్న గుజరాత్  , రాజస్థాన్ , మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.  బెంగాల్ లో ఈ సారి పాతిక సీట్ల వరకూ సాధిస్తారని అంచాలు ఉన్నాయి.  హిమాచల్ ప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర ఇలా అనేక రాష్ట్రాలను చూసుకుంటే.. బీజేపీ ఎంత లీస్ట్ పరిస్థితుల్లో అయినా 250 సీట్లను సులువుగా సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి.  ఆ పార్టీ టార్గెట్ 370 సీట్లు, ఎన్డీఏ కూటమికి నాలుగు వందల సీట్లు . కానీ మ్యాజిక్ మార్క్ సాధించడానికి 272  సరిపోతాయి.   ఈ లెక్కలు చూస్తే..  ఎలాంటి ఘోరమైన ఫలితాలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ అధికారానికి ఆమడదూరంలోనే ఉంటుందని అనుకోవచ్చు.

నిజానికి బీజేపీపై వ్యతిరేకత ఉందని ఎవరూ అనుకోవడం లేదు. కానీ సానుకూలత లేదని మాత్రం చెబుతున్నారు. సానుకూలత లేదు..  అలాగని వ్యతిరేకత లేదు. అందుకే దేశంలో ఓటింగ్ పర్సంటేజీ చాలా తక్కువగా ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.  అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న రాష్ట్రాల్లో 80 శాతం వరకూ పోలింగ్ నమోదవుతున్నప్పటికీ..  లోక్ సభ ఎన్నికలు మాత్రమే జరుగుతున్న రాష్ట్రాల్లో మాత్రం అరవై నుంచి 70 శాతం పోలింగ్ నమోదవుతుంది. ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటే ప్రజలు వెల్లువలా వచ్చి  ఓటేస్తారు. అది ప్రభుత్వ వ్యతిరేకతకు సూచికగా  భావిస్తారు. అలాంటి సూచనలేమీ కనిపించడం లేదు.

బీజేపీ వెనుకబడుతుందనేది చాలా మంది అంచనా మాత్రమే. 2019 ఎన్నికల సమయంలో ఇంత కన్నా ఎక్కువగా అంచనా వేశారు. ప్రాంతీయ పార్టీలన్నీ అవే అనుకున్నాయి.  కానీ భారతీయ జనతా పార్టీ అంతకు ముందు ఎన్నికల కన్నా ఎక్కువ సీట్లు సాధించింది. అప్పుడు తాము  సొంతంగా మూడు వందల కన్నా ఎక్కువ సీట్లు సాధిస్తామని అమిత్ షా, మోడీ గట్టి నమ్మకం గా చెప్పేవారు ఇప్పుడు కూడా వారు ఎన్డీఏ కూటమి నాలుగు వందల సీట్లు సాధిస్తుందని అంతే నమ్మకంగా చెబుతున్నారు. బీజేపీ నేతలు .. వారి స్టైల్ రాజకీయం.. ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ.. ఇండియా కూటమి ఎజెండాను డిసైడ్ చేయలేక .. బీజేపీ కి కౌంటర్లు ఇచ్చుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు. ఇది గెలుపొందేవారి లక్షణం కానే కాదని అనుకోవచ్చు.

ప్రజాస్వామ్యంలో ఎవరూ అజేయలు కాదు. కానీ ఉత్తినే విజయం మాత్రం రాదు. ఈ సూత్రాన్ని అవగాహన చేసుకుంటే.. ఈ సారి బీజేపీని ఓడించడం మరో వింత అవుతుంది. అలాంటి వింతలు ఇప్పుడు జరిగే అవకాశాలు కనిపించడం లేదనుకోవచ్చు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి