కొందరు అత్యుత్సాహంతో వివాదాల్లో చిక్కుకుంటారు. కొందరు ఏదో చేయబోతే ఏదో అవుతుంది. టీడీపీ సానుభూతిపరుడైన ఎన్ఆర్ఐ డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ పరిస్థితి కూడా అలాగే ఉంది. టీడీపీ మద్దతుగా ఎన్ఆర్ఐలంతా ప్రచారం చేస్తుంటే ఆయన కూడా ఆంధ్రా వచ్చి తన వంతుగా పనిచేశారు. ఈ క్రమంలో జగన్ పై ఒకటి రెండు మాటలు జారడంతో వైసీపీ నేతలు నోట్ దిస్ పాయింట్ అనేశారు. ఇప్పుడు లోకేష్ ను వైసీపీ నీడలా వెంటాడుతూ కష్టాలను ఆయనపై కుమ్మరిస్తోంది. అమెరికా వెళ్లేందుకు కూడా అడ్డు తగులుతోంది…..
డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడి పౌరసత్వం తీసుకున్నారు. ఇప్పుడు మాత్రం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏపీకి వచ్చి టీడీపీ తరపున పనిచేస్తున్నారు. ఇటీవల ఒక టీవీ ఇంటర్వ్యూలో సీఎం జగన్ పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. 2015 నుంచి జగన్ విదేశాలకు డబ్బు తరలిస్తున్నారని, అదీ భారత నేవీ సహకారంతో ఆ పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 2015లో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని ఎందుకు ఆపలేకపోయారంటే మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు. పైగా జగన్ కు వ్యతిరేకంగా వరుస ట్వీట్లు చేయడంతో ఉయ్యూరు లోకేష్ పై వైసీపీ సర్కారు ఒక కన్నేసి ఉంచింది. ఈ క్రమంలో గన్నవరం విమానాశ్రయ సంఘటన కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. జగన్ ఫారిన్ టూర్ కు వెళ్తున్నప్పుడే ఉయ్యూరు లోకేష్ గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. దానితో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. వ్యక్తిగత హామీ మేరకు ఆయన్ను వదిలిపెట్టారు. తర్వాత టీడీపీ కార్యాలయంలో ప్రత్యక్షమైన లోకేష్..పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనను కిడ్నాప్ చేసిన పోలీసులు, గుండెనొప్పి వస్తుందని చెప్పినా వినకుండా ఛాతిమీద కొట్టారని ఆరోపించారు. తన టికెట్ ను ప్రింటవుట్ తీసుకునేందుకు గన్నవరం విమానాశ్రయానికి వెళ్లానని ఉయ్యూరు లోకేష్ చెప్పడం కూడా హాస్యాస్పదంగానే అనిపించింది. పైగా అమెరికా పౌరుడినైనా తనను అరెస్టు చేసినందుకు అమెరికన్ గవర్నమెంటుకు, కేంద్రప్రభుత్వానికి, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కు ఫిర్యాదు చేశానని కూడా డాక్టర్ లోకేష్ కుమార్ వెల్లడించారు..
అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించిన లోకేష్ కుమార్ ను వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. ఇప్పుడు నోటీసులు విచారణకు రావాలని ఆదేశించింది. మరో పక్క ఇండియన్ నేవీ కూడా ఆయనపై కేసు వేసే అవకాశం ఉందని చెబుతున్నారు….
ఢిల్లీ మార్గంలో అమెరికా వెళ్లేందుకు డాక్టర్ లోకేష్ కుమార్ ప్రయత్నించారు. విమానాశ్రయ అధికారులు ఆయన్ను అడ్డుకున్నారు. కేసు ఉన్నందున ఆపుతున్నట్లు ప్రకటించారు. సీఎం జగన్‌ను దూషించారని పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులకు పోలీసులు సమాచారం అందించారు. ఆ క్రమంలోనే డాక్టర్ లోకేష్‌కు 41A CRPC కింద నోటీసులు జారీ చేశారు. ఈనెల 30న హాజరు కావాలని కూడా తెలిపారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు నిలిపివేయడంతో డాక్టర్ లోకేష్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు. ఇప్పటికే శాటిలైట్ ఫోన్ వివాదంలో చిక్కుకుని లోకేష్ కుమార్ ఇరకాటంలో పడ్డారు. భారత్లో అనుమతి లేకుండా శాటిలైట్ ఫోన్ వాడుతున్నారన్న కేసు నమోదు చేశారు. విచారణకు సహకరిస్తానని హామీ ఇవ్వడంతో ప్రస్తుతానికి ఆయన్ను వదిలేసినా, 30న ప్రశ్నించిన తర్వాత ఏమవుతుందో చూడాలి…
లోకేష్ కుమార్ పై అమెరికాలో ఎలాంటి కేసులు లేకపోయినా ఏపీకి వచ్చి కొంత ఓవరాక్షన్ చేశారని మాత్రం ఇట్టే అర్థమవుతోంది. జూన్ 4 తర్వాత టీడీపీ అధికారంలోకి వస్తే ఆయనకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. జగన్ గెలిస్తే మాత్రం సీన్ సితారవుతుందన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…