అయిదో విడత పోలింగ్ పరిసమాప్తం

By KTV Telugu On 22 May, 2024
image

KTV TELUGU :-

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో మరో అంకం ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా.. ఐదో దశ ఓటింగ్‌

ప్రశాంతంగా పూర్తయ్యింది. ముంబైలో బాలీవుడ్‌ ప్రముఖులు, పారిశ్రామిక రంగ ప్రముఖులు  ఉత్సాహంగా ఓటేశారు. అయినప్పటికీ మహారాష్ట్రలోనే అత్యల్ప పోలింగ్ నమోదైంది. జూన్ 4 వరకు  అభ్యర్ధులు ఫలితాలకోసం ఎదరు చూడాల్సిందే.

లోక్‌సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ ముగిసింది. పశ్చిమ బెంగాల్‌లో కొన్ని కేంద్రాల వద్ద ఉద్రిక్తతలు తలెత్తినా.. మొత్తంగా ఓటింగ్‌ ప్రశాంతంగానే ముగిసిందని తెలిపారు ఎన్నికల అధికారులు. 60శాతానికిపైగా పోలింగ్ నమోదైనట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. ఘర్షణలు చెలరేగినా బెంగాల్‌లో భారీగా 75శాతానికిపైగా ఓటింగ్ నమోదైంది. మహారాష్ట్రలో తక్కువ పోలింగ్ శాతం రికార్డయ్యింది.

ఉత్తరప్రదేశ్‌లో గాంధీ కంచుకోటలుగా పేరున్న రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలకు ఐదో దశలోనే పోలింగ్ పూర్తయ్యింది.

రాయ్‌బరేలీ నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఓటింగ్ సందర్భంగా నియోజకవర్గంలోనే మకాం వేశారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ లక్నోలో, కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ముంబైలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. లక్నోలో ఓటేసిన BSP అధినేత్రి మాయావతి.. ప్రజలు  మార్పు కోసం  కోరుకుంటున్నారన్నారు.

ముంబై మహానగరంలోని ఆరు లోక్‌సభ స్థానాలకు ఐదో దశలో పోలింగ్ నిర్వహించింది ఈసీ. పలువురు సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. బాలీవుడ్‌ స్టార్స్‌ రాకతో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం ఏర్పడింది. షారూఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్‌, అమీర్‌ఖాన్‌, రణ్‌బీర్‌ కపుర్‌, రణ్వీర్ కపుర్‌, హృతిన్ రోషన్‌ సహా పలువురు స్టార్స్‌ ప్రజాస్వామ్య పండుగలో పాలుపంచుకున్నారు.

భారత పౌరసత్వం తిరిగి పొందిన తర్వాత తొలిసారి ఓటేశారు హీరో అక్షయ్‌కుమార్‌. ఐశ్వర్యారాయ్‌, మాధురీ దీక్షిత్, దీపికా పడుకోణ్‌, కరీనా కపూర్‌ఖాన్‌ జాన్వీ కపూర్‌, సారా ఆలీఖాన్, అనన్యా పాండే, శ్రద్ధకపూర్, కియారా అడ్వాణీ సహా పలువురు బీటౌన్‌ బ్యూటీస్‌  ఓటింగ్‌లో పాల్గొన్నారు.పారిశ్రామిక వేత్తలు ముకేష్‌ అంబానీ, అనీల్ అంబానీ, సీరం సీఈఓ ఆదర్ పూనావాలాతోపాటు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్‌ ముంబైలో ఓటేశారు.

ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం పౌరుల బాధ్యత అన్నారు రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ..

6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు ఐదో దశలో ఓటింగ్ జరిగింది. ఈ విడతతో కలిపి.. దేశవ్యాప్తంగా 428 సీట్లకు పోలింగ్‌ పూర్తయ్యింది. మిగిలిన రెండో దశల్లో 115 స్థానాలకు పోలింగ్ నిర్వహించనుంది. జూన్‌ 1న తుదిదశ పోలింగ్ జరగనుండగా.. జూన్‌ 4న ఫలితాలు వెలువడనున్నాయి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి