నేతలు పార్టీలు మారడం రాజకీయాల్లో సర్వ సాధారణం. విపక్షాల నుంచి అధికార పార్టీలోకి వలసలు చాలా ఏళ్లుగా ఉన్న ధోరణే. అయితే, సిద్ధాంతాలు, విలువలకే తొలి ప్రాధాన్యత అని చెప్పుకునే బీజేపీ.. ఫిరాయింపు నేతలకు పెద్దపీట వేయడం ఆశ్చర్యపరిచే విషయం. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేస్తున్న అభ్యర్థుల్లో నాలుగోవంతు వలసనేతలే.గతంలో కాంగ్రెస్ పార్టీలో ఈ విధానం ఉండేది. ఇపుడా అవలక్షణం బిజెపికి కూడా వచ్చిందంటున్నారు.
లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 435మంది స్థానాల్లో బరిలో ఉంది బీజేపీ. పోటీలో ఉన్న అభ్యర్థులను గమనిస్తే ఆశ్చర్యకరమైన వివరాలు తెలుస్తాయి. వీరిలో ఏకంగా 106 మంది, అంటే నాలుగో వంతు అభ్యర్థులు గత పదేళ్లలో కమలం గూటికి వలస వచ్చినవాళ్లే. అందులోనూ 90 మంది గత ఐదేళ్లలో బీజేపీలోకి ఫిరాయించారు.ఈసారి ఎలాగైనా 2019 కంటే ఎక్కువ లోక్సభ స్థానాలు సాధించాలని బీజేపీ తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీచేస్తోంది.
ప్రాంతీయ పార్టీల్లో టికెట్లు రాని వారు, మోదీ కరిష్మా కలిసొస్తుందని భావించినవాళ్లు ఎన్నికల ముందే కమలదళంలో చేరారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఆరు లోక్సభ స్థానాల్లో పోటీ చేయగా వారిలో ఏకంగా ఐదుగురు 2019 తర్వాతే కాషాయ తీర్థం తీసుకోవడం విశేషం. తెలంగాణలోనూ 17 మంది బీజేపీ అభ్యర్థుల్లో 11 మంది 2014 తర్వాత వచ్చి చేరినవారే. వీరిలో చాలామంది మాజీ కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ నేతలే. ఏపీ వంటి చోట్ల బీజేపీ బలహీనంగా ఉంది గనుక వలస నేతలకు పెద్దపీట వేసిందనుకుంటే.. పార్టీ ఎదురులేని పొజిషన్లో ఉన్న యూపీ, హరియాణా తదితర చోట్లా ఇదే బాట పట్టడం ఆశ్చర్యం కలిగించే విషయం.
హరియాణాలోని 10 లోక్సభ స్థానాల్లో బీజేపీ తరఫున బరిలో ఉన్నవారిలో ఆరుగురు 2014 తర్వాత పార్టీలో చేరినవారే. ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ అయితే లోక్సభ ఎన్నికల ముందే బీజేపీ కండువా కప్పుకున్నారు. పీసీసీ మాజీ చీఫ్ అశోక్ తన్వర్ కూడా అంతే. ఇక యూపీలో బీజేపీ సొంతంగా పోటీ చేస్తున్న 74 లోక్సభ స్థానాల్లో.. 23 చోట్ల బయట నుంచి వచ్చినవారిని బరిలో దించింది. పంజాబ్లోని 13 స్థానాల్లో ఏకంగా ఏడుగురు బీజేపీ అభ్యర్థులు వలస పక్షులే. వీళ్లో చాలామంది కాంగ్రెస్ మాజీలు. వీరు చాలావరకు మాజీ సీఎం అమరీందర్ సింగ్ తన పార్టీని బీజేపీలో విలీనం చేసినప్పుడు బీజేపీలోకి వచ్చారు.
జార్ఖండ్లో 13 మంది బీజేపీ అభ్యర్థుల్లో ఏడుగురు జేఎంఎం, కాంగ్రెస్, జార్ఖండ్ వికాస్ మోర్చాల నుంచి జంప్ చేసిన నేతలకు బీజేపీ టికెట్లు లభించాయి. వీరిలో మాజీ సీఎం హేమంత్ సోరెన్ మరదలు సీతా సోరెన్ కూడా ఉన్నారు. ఒడిశాలో 29 శాతం, తమిళనాడులో 26 శాతం మంది బీజేపీ అభ్యర్థులు ఫిరాయింపుదారులే. మహారాష్ట్రలోనూ 25 వంతు బీజేపీ అభ్యర్థులు బయటి పార్టీల నుంచి వచ్చిన బాపతే. బీజేపీ బలహీనంగా ఉన్న ఏపీ, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలే గాక బలంగా ఉన్నచోటా ఫిరాయింపులను భారీగా ప్రోత్సహించడం వెనుక అసలు వ్యూహం విజయం. విపక్షాలకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదనే బీజేపీ రాజకీయం.
గత రెండు లోక్సభ ఎన్నికల నుంచి యూపీలో బీజేపీ హవా నడుస్తోంది. అక్కడ కూడా 31 శాతం మంది వలసదారులకు టికెట్లివ్వడానికి అదే కారణం అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కుల సమీకరణాలు, నాయకుల వ్యక్తిగత పరపతి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని.. అవసరమైన చోట వలస నేతలకే జైకొట్టింది కమలం హైకమాండ్. తనకు గెలుపు గుర్రాలు లేరనుకున్న స్థానాల్లో ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులను ఆకర్షించేందుకు బీజేపీ ఏమాత్రం వెనుకాడలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…