పగబట్టిన జగన్

By KTV Telugu On 23 May, 2024
image

KTV TELUGU :-

సొంత మనుషులనే పక్కన పెట్టేయ్యడం. వారి  స్థానంలో కొత్తవారిని తెచ్చుకోవడం వైసీపీ  అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి అలవాటే. తనను  కాదని  వెళ్లిపోయిన వారిపై ఆయన కక్షసాధిస్తుంటారు. ఎంతటి వారైనా జగన్ ఆగ్రహానికి గురి కావాల్సిందేనని అనడంలో సందేహించాల్సిన పనిలేదు. తాజాగా బీసీ నేత జంగా కృష్ణమూర్తి కూడా జగన్ చేష్టలకు బలయ్యారు. నిన్నటి దాకా వైసీపీలో ఉన్నారన్న కనికరం కూడా జంగా కృష్ణమూర్తి పట్ల చూపించలేదు మన జగనన్న….

జంగా కృష్ణమూర్తి ఒకప్పుడు జగన్ కు వీర భక్తుడు. ఉంటే  జగన్ పక్షానే ఉంటాను అనేంతగా అత్యంత ఆప్తుడైన అనుచరుడిగా కొనసాగారు. జగన్ రెడ్డి సీఎం కావాలని ఆయన పల్నాడు నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర కూడా చేశారు.

జగన్ రెడ్డి మాట కోసం తన ఎమ్మెల్యే సీటు కూడా త్యాగం చేశాడు.  ఇంత చేసిన ఆ బీసీ నేత పై జగన్ రెడ్డి అర్ధరాత్రి పగ తీర్చుకున్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గానికి చెందిన బీసీ నేత  , ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి పై ఎమ్మెల్సీ గా అనర్హత వేటు వేయించారు. జంగా కృష్ణ మూర్తి పార్టీ మారడంతో  ఎమ్మెల్సీ పదవి ని కక్ష్య పూరితంగా తొలగించి   పగ తీర్చుకున్నారు.  పోలింగ్ ముగిసిన  వెంటనే ఇలాంటి చర్యలు దిగడం రాష్ట్రంలోని బీసీ సామాజికవర్గాల్లో తీవ్ర నిరసనకు కారణమవుతోంది. జంగా కృష్ణమూర్తిని ఎమ్మెల్సీగా తొలగిస్తూ   అర్ధరాత్రి గెజిట్ విడుదల చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

యాదవ సామాజికవర్గంలో జంగా కృష్ణమూర్తి  బలమైన నాయకుడు.  నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటే నేత. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా  వెనక్కి తగ్గని తత్వం ఆయనది. వైసీపీలో అవమానాలు భరించలేకే ఆయన బయటకు వెళ్లిపోతే జగన్ ఆయనపై పగబట్టారు…

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని యాదవ సామాజిక వర్గంలో జంగా కృష్ణమూర్తికి ప్రత్యేకమైన స్థానముంది. 1999 కి ముందు జంగా  తెలుగుదేశం పార్టీ ట్రేడ్ యూనియన్ నాయకునిగా ఉండేవారు. గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపటంతో ఆ పార్టీలో చేరారు. వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ నుంచి  ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురజాల సీటును గుంటూరు కు చెందిన డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లకు కేటాయించినప్పటికీ జంగా వైఎస్ కుటుంబానికి  విధేయుడుగానే కొనసాగుతూ వచ్చారు. రాజశేఖర్  రెడ్డి మరణాంతరం జంగా కృష్ణమూర్తి జగన్ వెన్నంటే వున్నారు. వైసీపీలో చేరటానికి చాలామంది తటపటాయిస్తున్న రోజుల్లో అందరికంటే ముందు ఆ పార్టీలో చేరారు. జగన్  రెడ్డి ఓదార్పు యాత్రలో ఆయన వెన్నంటే వున్నారు. వైసీపీ బీసీ రాష్ట్ర అధ్యక్షుడు పదవిని తీసుకుని జగన్ కోసం రాష్ట్రం వ్యాప్తంగా  విసృతంగా  పర్యటించారు. బీసీ సామాజిక వర్గాలను ఏకతాటి పైకి తీసుకువచ్చి వైసీపీకి ఓట్లు వేయించారు.  రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురజాల నుంచి హైదరాబాదు వరకు పాదయాత్ర చేశారు. ఇంత చేసిన జంగా కృష్ణ మూర్తికి గురజాల సీటు విషయం లో కూడా జగన్ అన్యాయం చేశారు.  జంగా సీటు త్యాగంతో గురజాలలో అడుగుపెట్టిన కాసు మహేష్ రెడ్డి  ఆయన్ను చాలా అవమానిస్తూ వచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ఒక దశలో కాసు మహేష్ రెడ్డికి జంగా కృష్ణమూర్తికి మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది.తనకోసం ఎంతో కష్టపడిన జంగాకు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నా జగన్ రెడ్డి కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆత్మాభిమానం చంపుకోలేక వైసీపీని వీడి ఎన్నికల ముందు జంగా టీడీపీలో చేరి పోయారు. జంగా నిష్క్రమణతో పల్నాడు బీసీలు వైసీపీకి దూరం జరిగారు. ఎన్నికల్లో దాని ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఓటమి చెందే పరిస్థితి వచ్చింది. దీనితో ఆగ్రహానికి గురైన జగన్, ఆయనపై కక్షపెంచుకున్నారు. సరిగ్గా పోలింగ్ పూర్తయిన తర్వాత అనర్హత వేటు వేయించారు….

జగన్ రెడ్డి తీరుపై జంగా తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కనీసం వివరణ కూడా తీసుకోకుండా అనర్హత వేటు వేశారని ఆవేదనగా ఉన్నారు. జగన్ రెడ్డి చాలా తెలివిగా వ్యవహరించి ఉండొచ్చు. కాకపోతే జంగా తొలగింపు ప్రభావం వైసీపీపై దీర్ఘకాలం ఉండటం మాత్రం  ఖాయం.జగన్ రెడ్డి బీసీ వ్యతిరేకి అన్న ఫీలింగ్ రావడమూ  ఖాయమే…..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి