స్పీకరా ? హోమ్ మినిష్టరా ?

By KTV Telugu On 24 May, 2024
image

KTV TELUGU :-

రఘురామ కృష్ణరాజు రాజకీయ భవిష్యత్తు ఏమిటి ?  ఎన్నికల తర్వాత టీడీపీ గెలిస్తే ఆయనకు ఏ పదవి రాబోతోంది ? రఘురామ అనుచరులు, అభిమానుల  ఊహాగానాలు ఏమిటి ? వారిలో జోష్ ఎందుకు కనిపిస్తోంది ? ఇప్పటికే రెండు పదవులపై రఘురామ కన్నేశారా ? అందుకు అభిమానులు కూడా సిద్ధమయ్యారా ? ఒక  కీలక పదవి ఖాయమని ఎదురు చూస్తున్నారా ?

అనేక నాటకీయ పరిణామాల మధ్య ఉండిలో పోటీ చేసిన రఘురామ  కృష్ణరాజు.. ఎన్నికల తర్వాత  కొన్ని రోజులు మౌనంగా  ఉండిపోయినా  ఇప్పుడు యమ యాక్టివ్ అయ్యారు. రఘురామ ఉండీ లేనట్లుగా తయారయ్యారని విమర్శించే వారికి గట్టి సమాధానంగా ఇప్పుడు తెగ తిరిగేస్తున్నారు. వైసీపీలో ఉంటూనే  జగన్ పై పోరాటం సాగించిన రఘురాజు ఇప్పుడు కూడా అదే ఫోర్స్ కొనసాగిస్తున్నారు. విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో సుడిగాలి పర్యటన జరుపుతున్న రాజు.. మళ్లీ జగన్ పై వాగ్భాణాలు సంధించారు.  రఘురామ ఉత్తరాంధ్రలోని గుళ్లూ గోపురాలు తిరిగారు. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. విజయనగరం పైడితల్లి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. తనకు రెండేళ్ళుగా ఈ ప్రాంతాల వైపు రావడం వీలు పడలేదని జగన్ పెట్టిన నిర్బంధం వన్ల్లనే ఇలా జరిగిందని ఆయన విమర్శించారు. మరో పది రోజులలో జగన్ పాలన అంతం అవుతుందని చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి పాలన మొదలవుతుందని రఘురామ జోస్యం చెప్పారు. మే 13న వైసీపీకి జనాలు సమాధి కట్టారని జూన్ 4న పెద్ద కర్మ అంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు.  రఘురామ వైసీపీని ధీటుగా ఎదిరించారు అని విశాఖలో కొందరు ఆయన అభిమానులు సన్మానం చేశారు. రఘురామ కాబోయే హోం మంత్రి అని వారు ముందే చెప్పేశారు. రఘురామ హోం మంత్రి అయితేనే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగుంటుంది అని అభిమాన సంబరంతో వారు అంటున్నారు.

టీడీపీ గెలిస్తే రఘురామకు ఏ  పదవి దక్కుతుందన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. పోలింగ్ కు ముందు ఆయనకు స్పీకర్ పదవి  వస్తుందని  చెప్పుకున్నారు. ఇప్పుడు మాత్రం హోం మంత్రి అంటున్నారు.  ఆ రెండు పదవులపై  చర్చ జరగడానికి కారణాలు కూడా ఉన్నాయి. అవి రెండు శక్తిమంతమైన పదవులు అని మరిచిపోకూడదు…

ఇంతకాలం వైసీపీ వాళ్లు రఘురామను వెంటబడి కొట్టారు. జైల్లో పెట్టి పోలీసులతో కొట్టించి ఆటవిక ఆనందాన్ని పొందారు. ఆ కసి ఆయనలో విపరీతంగా కనిపిస్తోంది. టీడీపీ అధికారంలోకి రాగానే అంతకు పదింతలు తిరిగి ఇవ్వాలన్న ఆగ్రహంతో ఆయన ఉన్నారు. టీడీపీ కూడా ఆయన్ను ఎంకరేజ్ చేసి వైసీపీపై ఉసిగొల్పేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో  తొలుత ఆయనకు స్పీకర్ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. అసెంబ్లీలో స్పీకర్ కీలకమని, వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడినా వాళ్ల నోరు మూయించి, ఎప్పటికప్పుడు వారిని సస్పెండ్ చేసేందుకు వీలుంటుందని లెక్కలేసుకున్నారు.గెలిచిన  వైసీపీ ఎమ్మెల్యేలను నోరు తెరవనివ్వకుండా ఉండాలంటే రఘురామ లాంటి దృఢనిశ్చయం  ఉన్న వ్యక్తి స్పీకర్ గా ఉండటం అవసరమని కూడా చంద్రబాబు  భావించినట్లు సమాచారం. అయితే ఇప్పుడు మరో చర్చ తెరమీదకు వచ్చింది. రఘురామకు హోం మంత్రి పదవి ఇస్తారని  చెప్పుకుంటున్నారు. హోం మంత్రి అయితే పోలీసు శాఖ ఆయన చేతిలో  ఉంటుంది. ఒక ప్లాన్ ప్రకారం వైసీపీ అవినీతిపరులను జైల్ లో వేసేందుకు వీలుంటుంది.  అరెస్టు అయిన వాళ్లు బయటకు రాకుండా బిగించి పడేసే  ఛాన్సు కూడా ఉంటుందని లెక్కలేసుకుంటున్నారు.  ఎప్పటికప్పుడు కేసుల ఫాలోవప్ కు కూడా ఛాన్స్ ఉంటుంది….

వైసీపీ వాళ్ల మీద ఫుల్ టైమ్ దృష్టి పెట్టే నాయకుడు ఒకరు కావాలి. ఇంతకాలం వాళ్లు  చేసిన అరాచకాలకు సమాధానం  చెప్పే వాళ్లు చాలా అవసరం. ఆ పని రఘురామతోనే సాధ్యమని నిర్థారణకు వచ్చినట్లే తెలుస్తోంది. ఆయనకు స్పీకర్ లేదా హోం మంత్రి పదవి ఇవ్వలేకపోతే అంతకంటే  కీలకమైన పదవి ఇవ్వడం  మాత్రం  ఖాయమేనన్న చర్చ టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి