నాడు TDP – నేడు YSRCP !

By KTV Telugu On 27 May, 2024
image

KTV TELUGU :-

2019 ఎన్నికలప్పుడు ఏపీలో ఏం జిరగిందో ఇప్పుడు అలాగే జరుగుతున్నట్లుగా కళ్ల ముందు కనిపిస్తోంది. అప్పట్లో అధికార పార్టీగా ఉన్న టీడీపీ ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేసింది. ఇప్పుడు అధికార పార్టీగా ఉన్న వైఎస్ఆర్‌సీపీ అదే  పని చేస్తోంది. ఎన్నికలు సక్రమంగా జరగలేదని అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు సీఈవోపై విరుచుకుడ్డారు. ఇప్పుడా పని వైసీపీ చేస్తోంది. అప్పట్లో చంద్రబాబు ఎన్ని జరిగినా తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేసేవారు. ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ కూడా అదే అంటోంది.  ఫలితం కూడా అలాగే ఉండబోతోందా ?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రివర్స్ లో కనిపిస్తున్నయి.  ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాపై వైఎస్ఆర్‌సీపీ తీవ్ర ఆగ్రహంతో ఉంది.   టీడీపీతో కుమ్మక్కయి ఆయన ఎన్నికలు నిర్వహించారని  అంటున్నారు. పల్నాడులో ఘర్షణలకు ఆయనే  కారణం అని ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు ముందు అధికారుల్ని మార్చారని.. వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన దృశ్యాలు వెలుగులోకి రావడం వైసీపీ ఆగ్రహాన్ని మరింతగా పెంచింది. 2019లో అధికార పార్టీగా ఎన్నికలకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ కూడా అప్పటి సీఈవోపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఎన్నికల అధికారిగా గోపాలకృష్ణ ద్వివేదీ ఉండేవారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుండి తెలుగుదేశం పార్టీ తమపై పక్షపాతం చూపిస్తున్నారని ఆరోపణలు ప్రారంభించింది. డీజీపీ, ఇంటలిజెన్స్ చీఫ్ సహా చాలా జిల్లాల్లో ఎస్పీలను మార్చేశారు. చివరికి చీఫ్ సెక్రటరీని కూడా మార్చేశారు. చీఫ్ సెక్రటరీగా ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ఎన్నికలకు ముందు నియమించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో సీఎంగా చంద్రబాబు ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేకుండా పోయింది న్నికల ప్రక్రియలో లోపాలపై టీడీపీ మండిపడింది. పోలింగ్ రోజు కొన్ని వందల చోట్ల ఈవీఎం మెషిన్లలో లోపాలు బయట పడ్డాయి. ఈ కారణంగా  పోలింగ్ కూడా ఆలస్యమయింది. ఈ పరిణామాలన్నింటితో ఈసీపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. సీఈవో కార్యాలయానికి వెళ్లి ధర్నా చేసినంత పని చేశారు.

సాధారణంగా ఎన్నికల ప్రక్రియపై ఏదైనా రాజకీయ పార్టీ అనుమానం వ్యక్తం చేస్తే.. రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజల్లోనూ ఓ రకమైన నెగెటివ్ ప్రచారం ప్రారంభమవుతుంది. అప్పుడే ఓటమికి కారణాలు చెబుతున్నారన్న అభిప్రాయం బలపడుతుంది. తెలుగుదేశం పార్టీకి 2019లో ఇలాంటి అనుభవమే ఎదురయింది. అప్పట్లో ఈసీ పని తీరును వైసీపీ నేతలు విమర్శించలేదు. పైగా బాగా పని చేసిందని కితాబిచ్చారు కూడా. ఓటమికి కారణాలు చెబుతున్నారని వైసీపీ నేతలు టీడీపీపై విరుచుకుపడేవారు. ఇప్పుడు అదే పరిస్థితి వైఎస్ఆర్‌సీపీకి వచ్చింది. పల్నాడు, చిత్తూరు, తాడిపత్రి వంటి చోట్ల జరిగిన  దాడుల వ్యవహారంలో మొత్తం వైసీపీదే తప్పని నిందిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసిందని ఆరోపిస్తున్నారు. టీడీపీ భారీగా రిగ్గింగ్ చేసిందన్న అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. ఎక్స్ లో ట్రెండింగ్ లోకి కూడా తెచ్చారు. అయితే టీడీపీ మాత్రం.. ఇవన్నీ వైసీపీ ఓటమికి కారణాలుగా ముందే చెబుతోందని .. అంటున్నారు.

వైసీపీ చేస్తున్న ఆరోపణలతో ఆ పార్టీ ఓటమికి కారణాలు వెదుక్కుంటోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం గెలిచి తీరుతున్నామని గట్టిగా చెబుతున్నారు. రెండో సారి సీఎంగా జగన్ ప్రమాణ స్వీకార తేదీని ప్రకటించారు. ముహుర్తాన్ని ప్రకటించారు. ప్లేస్ ను జగన్ ముందే  ప్రకటించారు. విశాఖలో హోటల్స్ కూడా బుక్ చేసుకున్నామని.. బోగాపురంలో ప్రమాణస్వీకార స్థలాన్ని సీఎస్ జవహర్ రెడ్డి కూడా పరిశీలించారని అంటున్నారు. అయితే ఇవన్నీ మైండ్ గేమ్ కోసమేనని.. వైసీపీ ఓడిపోతుందని వారికి కూడా తెలుసని.. టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. కారణం ఏదైనా ఈ సారి ఎన్నికలు అచ్చంగా 2019లో జరిగినట్లే కనిపిసున్నాయి. ఫలితాలు ఎలా ఉంటాయో జూన్ నాలుగో తేదీన క్లారిటీ వస్తుంది.

అయితే ఎన్నికలు జరిగిన విధానాన్ని బట్టి రాజకీయ పార్టీలకు ఫలితంపై ఓ అంచనా ఉంటుంది. దానికి తగ్గట్లుగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇప్పుడు అదే జరుగుతోంది. వైసీపీ ఓడిపోతున్నట్లుగా కారణాలు వెదుక్కుంటోంది. రీపోలింగ్ కావాలంటూ ఈసీకి విజ్ఞప్తులు చేస్తున్నారు. టీడీపీ నేతలు మాత్రం గుంభనంగా ఉంటున్నారు. ఈ పరిణామాలు ఏపీలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అంచనాను ప్రజల ముందు ఉంచుతున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా బీఆర్ఎస్ ఇలాగే కారణాలు చెప్పే ప్రయత్నం చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని కాన్ఫిడెంట్ గా చెప్పింది.  ఆ నమ్మకం వైసీపీలో లేకుండా పోయింది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి