హస్తం సోషల్ మీడియా వింగ్ కి ఏమైంది?

By KTV Telugu On 31 May, 2024
image

KTV TELUGU :-

ప్రపంచమంతా సోషల్ మీడియాలో మునిగి తేలుతోంది. ఇక రాజకీయ పార్టీలకు ఇదొక ప్రధానంగా మారింది. ఎన్నికల సమయంలో సోషల్ మీడియా పాత్ర గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. మొన్నటి వరకు ఆయుధంగా ఉపయోగపడిన ఈ సోషల్ మీడియానే టీ.కాంగ్రెస్‌ పార్టీకి తలనొప్పిగా మారిందా? హస్తం నేతలు అధికారం వచ్చాక సోషల్ మీడియా వాడకంలో ఇబ్బంది పడుతున్నారా? సోషల్ మీడియాలో వెనకంజ వల్ల పార్టీకి నష్టం జరుగుతోందా ? అసటు టీ.కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? వాచ్ దిస్ స్టోరీ..

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో సోషల్ మీడియా అత్యంత కీలక పాత్ర పోషించిందని ఆ పార్టీ నాయకులే చెబుతారు. ఇప్పుడు అదే సోషల్ మీడియా అధికార పార్టీకి ఇబ్బందిగా తయారయిందట. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వలేక హస్తం నేతలు చేతులెత్తేస్తున్నారంటూ క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ప్రతిపక్ష పార్టీలు, సామాన్య ప్రజలు ఏదో ఒక అంశంపై సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయినా అటు పార్టీ నుంచి కానీ ఇటు ప్రభుత్వం నుంచి కానీ ప్రతిపక్షాల విమర్శలపై వివరణలు, సమాధానాలు కనిపించడం లేదు.

ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని తిప్పి కొట్టడంలో పూర్తిగా విఫలం అవుతున్నామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. దీంతో అతి తక్కువ కాలంలోనే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందనే ఆవేదన వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజు నుండి కాంగ్రెస్ తీసుకుంటున్న నిర్ణయాలపై బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు మొదలు పెట్టాయి. ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలం అయిందని, కరెంటు, వడ్ల కొనుగోలు లాంటి అంశాల్లో కాంగ్రెస్ సర్కార్ ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తోందని సోషల్ మీడియాలో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అగ్ర నేతలు ప్రతిరోజూ ఏదో ఒక అంశంపై ప్రభుత్వాన్ని నిలదిస్తున్నా మంత్రులు, పార్టీ కీలక నేతలు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టడంలో విఫలమవుతున్న  నేపథ్యంలో ప్రభుత్వంపై, పార్టీపై అన్ని వర్గాల నుంచీ వ్యతిరేకత వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ సోషల్ మీడియా వింగ్ మౌనంగా ఉండడం పట్ల పార్టీలోని పలువురు కీలక నేతలు సైతం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా కోసం పెద్ద వింగ్ ఉంది. తెలంగాణలోని ప్రతి మండలానికి కనీసం వంద మందితో సోషల్ మీడియా ఆర్మీ ఉంది.

ఎన్నికల ముందు గాంధీ భవన్ లో  పెద్ద సెటప్ పెట్టి ఒక ఔట్ సోర్సింగ్ టీమ్ తో సోషల్ మీడియా కోసం పని చేయించారు. ఆ సమయంలో బీఆర్ఎస్, బీజేపీలకు కాంగ్రెస్ పార్టీ ముచ్చెమటలు పట్టించింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సోషల్ మీడియా వింగ్ పూర్తిగా కనుమరుగైపోయిందనే చెప్పాలి. దీని ప్రభావం మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలపై పడిందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రభుత్వ తప్పిదాలపై కేసీఆర్, హరీష్, బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి నేతలు రోజూ సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం మౌనంగా ఉంటోంది. దీని వల్ల పార్టీ క్యాడర్‌కు నిరాశ తప్పడం లేదనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

విమర్శలు, ప్రతి విమర్శలు సోషల్ మీడియాలో హాట్ హాట్ గా సాగుతుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం పత్రికా ప్రకటనలు, మీడియా సమావేశాలకు మాత్రమే పరిమితమవుతున్నారు. దీంతో పార్టీకి, ప్రభుత్వానికి నష్టం జరుగుతోందని నాయకులు చెబుతున్నారు. మరి కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్‌ను యాక్టివేట్ చేసేదెప్పుడు? అసలు సోషల్ మీడియాకు నాయకత్వం వహిస్తున్నది ఎవరనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంత నిర్లిప్తంగా ఉండటానికి కారణం ఏంటి? అసలు ఈ సమస్యను హస్తం నేతలు ఎలా అధిగమిస్తారో చూడాలి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి