గత వైభవం వస్తుందా మరి?

By KTV Telugu On 3 June, 2024
image

KTV TELUGU :-

కర్నూల్ జిల్లాలోని నాలుగు కుటుంబాలు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాయి. ఒకప్పుడు రెండు కుటుంబాల మధ్య హోరా హోరీ ఫైట్ కూడా జరిగింది. కుటుంబాల్లోని పెద్దలంతా ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా పనిచేసినవారే. కాని ఇప్పుడు వారికి గత వైభవ చిహ్నాలే మిగిలాయి. తాజా ఎన్నికలు వారికి రాజకీయంగా జీవన్మరణ సమస్యగా మారాయి. ఈసారి గెలిస్తేనే ఆ కుటుంబాల రాజకీయ మనుగడ కొనసాగుతుంది. మరి పోటీలో ఉన్న వారి వారసుల భవిష్యత్ ఎలా ఉండబోతోంది? వాచ్ దిస్ స్టోరీ.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా ఉమ్మడి కర్నూల్ జిల్లాలో కోట్ల, కేఈ, భూమా, టీజీ కుటుంబాలకు ఒక గుర్తింపు ఉంది. దశాబ్దాలుగా ఈ కుటుంబాలు జిల్లా రాజకీయాల్ని శాసిస్తూ..రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాయి. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ఈ కుటుంబాల వారసులు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఫ్యాన్ గాలికి కకావికలమయ్యారు. 2014లో జరిగిన ఎన్నికల్లో కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ నుంచి కర్నూల్ ఎంపీగా పోటీ చేసి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి బుట్టా రేణుక చేతిలో ఓడిపోయారు. పత్తికొండ నుంచి టీడీపీ తరుపున పోటీ చేసిన కేఈ క్రిష్ణమూర్తి స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ఆళ్ళగడ్డలో భూమా అఖిల ప్రియ వైఎస్‌ఆర్‌సీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ టీడీపీలో చేరిపోయారు.

2019 ఎన్నికల్లో కోట్ల కుటుంబం కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరింది. మరోసారి కర్నూల్ ఎంపీగా కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, ఆయన భార్య సుజాతమ్మ ఆలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయగా..ఇద్దరూ వైఎస్‌ఆర్‌సీపీ చేతిలో ఓడిపోయారు. పత్తికొండ నుంచి టీడీపీ తరుపున కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబు తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి ఓటమి చెందారు. అలాగే ఆళ్లగడ్డ నుంచి టీడీపీ తరుపున పోటీ చేసిన భూమా అఖిలప్రియ కూడా చిత్తుగా ఓడిపోయారు. ఇక కర్నూలు నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన మాజీ మంత్రి టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ కూడా ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఉమ్మడి కర్నూల్ జిల్లాలో ఫ్యాన్ సునామీకి సైకిల్‌ పార్టీ పూర్తిగా కనుమరుగైపోయింది.

2014 నుంచి ఓడిపోతూ వస్తున్న కోట్ల కుటుంబ సభ్యులు ఈ సారి ఎలాగైనా గెలిచి తమ రాజకీయ ఉనికిని చాటుకోవాలని తీవ్రంగా ప్రయత్నించారు. ప్రతిసారి కర్నూలు పార్లమెంట్ నుంచి బరిలోకి దిగే కోట్ల కుటుంబం ఈ సారి డోన్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసింది. అలాగే పత్తికొండ నుంచి ఈసారి కూడా తెలుగుదేశం నుంచి కేఈ శ్యాంబాబు మరోసారి పోటీ చేశారు. మరో పక్క ఆళ్ళగడ్డలో భూమా అఖిల ప్రియను, కర్నూలు నుంచి టీజీ భరత్ ను రంగంలోకి దింపారు. ఈ ఎన్నికల్లో గెలిస్తేనే కోట్ల, కేఈ, భూమా, టీజీ కుటుంబాలకు రాజకీయ భవిష్యత్‌ ఉంటుందని, ఇప్పుడు కూడా ఓడిపోతే.. ఇక ఈ నాలుగు కుటుంబాల రాజకీయ చరిత్ర ముగిసిపోతుందనే చర్చ నడుస్తోంది.

ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపునే పోటీ చేసిన ఆ నాలుగు కుటుంబాలకు చెందిన వారసులు విజయం సాధిస్తారా..? లేదా..? అన్న చర్చ జోరుగా సాగుతోంది. కర్నూలు, పత్తికొండ, డోన్, ఆళ్ళగడ్డ నియోజకవర్గాల్లో ఈసారి కూడా వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులే విజయం సాధిస్తారని లక్షల్లో బెట్టింగ్ జరుగుతోంది. గత ఎన్నికల్లో మాదిరిగా ఈసారీ ఉమ్మడి కర్నూల్ జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ స్వీప్ చేస్తుందని..మరోసారి టీడీపీ అడ్రస్ గల్లంతవుతుందనే టాక్ వినిపిస్తోంది. బెట్టింగ్‌లో డబ్బే గాకుండా…కొంతమంది పొలాలు, స్థలాలు కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్‌లో పెట్టినట్టు సమాచారం. బేతంచెర్లకు చెందిన ఓ వ్యాపారి రూ.2 కోట్లు బెట్టింగ్ పెట్టినట్టు సమాచారం. మరో నేత కోట్ల విలువ చేసే స్థలాన్ని పందెం కాసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ బెట్టింగులన్నీ వైఎస్‌ఆర్‌సీపీ గెలుస్తుందనే కాస్తున్నారు.

మొత్తం మీద ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆ నాలుగు నియోజకవర్గాలు హాట్ సీట్స్‌గా మారాయి. దశాబ్దాలుగా జిల్లా రాజకీయాలను శాసిస్తున్న ఆ కుటుంబాల నుంచి నేతలు, వారసులు బరిలో నిలవడం.. గతంలో ఓటమి పాలవ్వడం, ఈ సారి గెలవకపోతే భవిష్యత్‌లో రాజకీయ జీవితం ఉండదనే భయం వారిని వెంటాడుతోంది. ఇదిలా ఉంటే..ఈసారి కూడా సర్వేలన్నీ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులకే అనుకూలంగా ఉండడంతో వారిలో రోజు రోజుకూ టెన్షన్ పెరుగుతోందని సమాచారం. మరి వారి రాజకీయ జాతకాలపై స్పష్టత రావాలంటే జూన్ నాలుగు వరకు ఆగాల్సిందే.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి