బిగ్ పోస్ట్‌కు రాహుల్ గాంధీ రెడీ అయ్యారా..? ప్రధాని పదవి ఎలాగూ దక్కలేదు.. ప్రతిపక్ష నేతగా అయినా బాధ్యతలు చేపడతారా..? కాంగ్రెస్ వర్గాల్లో ఇప్పుడిదే హాట్‌టాపిక్. లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలతో సత్తాచాటిన రాహుల్.. లోక్‌సభలో విపక్ష నేత పదవి చేపట్టాలని తీర్మానం చేసింది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. గత రెండు ఎన్నికలతో పోలిస్తే ఈ సారి కాంగ్రెస్ పార్టీ మంచి విజయాలనే సొంతం చేసుకుని సత్తా చాటింది. అందుకే రాహుల్ ను ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించాలని పార్టీ నేతలు ఆకాంక్షిస్తున్నారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాలని తీర్మానించింది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ.
పార్లమెంట్లో అధికార పక్షాన్ని ఎదుర్కొనేందుకు ఆయనే సరైన నాయకుడని అభిప్రాయపడింది. ఢిల్లీలో భేటీ అయిన CWC సభ్యులు.. దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ పేరును ప్రతిపాదిస్తూ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించారు. 2014లో కేంద్రంలో అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభలో ప్రతిపక్ష హోదా దక్కడం ఇదే తొలిసారి.
గత రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆ పార్టీకి విపక్ష పాత్ర పోషించేందుకు అవసరమైన సంఖ్యాబలం రాలేదు. 2019లో కాంగ్రెస్ 52 స్థానాల్లో గెలవగా.. అంతకుముందు 2014లో 44 సీట్లతో సరిపెట్టుకుంది. ఈసారి 99 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో రాహుల్ గాంధీ ఫ్లోర్ లీడర్‌గా బాధ్యతలు చేపట్టాలని బలంగా కోరుతున్నారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి సాధించిన విజయాలను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అభినందించింది. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో అధిక సీట్లు గెలుచుకోవడంపై హర్షం వ్యక్తంచేసింది.
కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో పార్టీ ఫలితాలపై అసంతృప్తి వ్యక్తంచేశారు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే. పార్టీ సామర్థ్యానికి, అంచనాలకు తగినట్టు రిజల్ట్స్ రాలేదన్నారు. సంప్రదాయంగా కాంగ్రెస్ పార్టీకి పట్టున్న రాష్ట్రాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకూడదన్న ఖర్గే.. అత్యవసరంగా లోపాలను సవరించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియా గాంధీ మరోసారి ఎన్నికయ్యారు. పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్లో సమావేశమైన కాంగ్రెస్ ఎంపీలు.. ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. సీపీపీ ఛైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ పేరును ఖర్గే ప్రతిపాదించగా.. గౌరవ్ గొగోయ్, తారిక్ అన్వర్ బలపరిచారు.
ఇక లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన రెండు స్థానాల్లో రాహుల్ గాంధీ.. ఏ సీటు వదులుకుంటారనే ఆసక్తికరంగా మారింది. 2019లో అమేథీలో ఓడిపోయిన రాహుల్‌ను ఆదరించింది వయనాడ్ నియోజకవర్గమే. అటు రాయ్‌బరేలీ సీటు ఫ్యామిలీ సెంటిమెంట్. దీంతో ఏ స్థానం వదులుకుంటారనే విషయంలో తీవ్ర సందిగ్ధత నెలకొంది. దీనిపై ఈనెల 17లోగా నిర్ణయం తీసుకోనున్నారు రాహుల్ గాంధీ. వచ్చేవారం చెల్లెలు ప్రియాంక వాధ్రాతో కలిసి రాయ్‌బరేలీలో పర్యటించనున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…