కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కని ఏపీ తెలంగాణా బిజెపి నేతలపై పార్టీ హైకమాండ్ దృష్టి సారించింది. రక రకాల సమీకరణల కారణంగా కొందరికి మంత్రి పదవులు ఇవ్వలేకపోయిన నాయకత్వం ఇపుడు వారికి తాయిలాలు ప్రకటించడానికి సమాయత్తమవుతోంది. పార్టీలో కీలక పదవులు అప్పగించడం ద్వారా వారిని గౌరవించడానికి రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ఏపీ తెలంగాణా రాష్ట్రాల్లో పదవులు రాని వలస నేతలకు మంచి రోజులు రాబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కేంద్ర మంత్రి వర్గంలో తెలంగాణా నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు పదవులు దక్కిన సంగతి తెలిసిందే. అయితే పార్టీలో సీనియర్ నేతలయిన మాజీ మంత్రులు ఈటల రాజేంరర్, డి.కె.అరుణలు తమకి పదవులు రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. ఈటల రాజేందర్ అయితే బి.ఆర్.ఎస్. లో నెంబర్ టూ గా ఓ వెలుగు వెలిగిన నాయకుడు. సమర్ధుడు. ఆయన కేసీయార్ తో తేడాలు వచ్చి బిజెపిలో చేరిన సంగతి తెలిసిందే. మల్కాజగిరి నుండి ఎంపీ అయిన ఈటల రాజేందర్ తనకు మంత్రి పదవి ఖాయమనుకున్నారు. అయితే పార్టీ నాయకత్వం మరోలా ఆలోచించింది. దీంతో ఈటల నిరాశ చెందారు.
మరో వైపు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన గద్వాల మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి డి.కె. అరుణ కూడా కొన్నేళ్ల క్రితమే కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపిలో చేరారు. కాంగ్రెస్ హయాంలో ఆమె మంత్రిగా పనిచేశారు కూడా. ఈఎన్నికల్లో మహబూబ్ నగర్ నియోజక వర్గం నుండి విజయం సాధించిన అరుణ తనకు కేబినెట్ లో బెర్త్ గ్యారంటీ అనుకున్నారు. స్మృతి ఇరానీ లాంటి కేంద్ర మంత్రి ఈ ఎన్నికల్లో ఓడిపోవడం తనకు కలిసొస్తుందనుకున్నారు. ఇరానీ స్థానంలో తనకు మంత్రి పదవి ఇస్తారని అనుకున్నారు. అయితే బిజెపి అధినాయకత్వం ఆలోచనలు మరోలా ఉన్నాయి.
అటు ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఏపీ బిజెపి చీఫ్ పురందేశ్వరి, అనకాపల్లి ఎంపీ సి.ఎం.రమేష్ లు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. తమ తమ స్థాయిల్లో పైరవీలూ చేసుకున్నారు. అయితే ఏవీ వర్కవుట్ కాలేదు. ఇద్దరికీ మంత్రి పదవులు ఇవ్వలేదు. వీరికి ఇవ్వకపోవడమే కాకుండా మొదటి సారి ఎంపీ అయిన నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మకు మంత్రి పదవిని ఇవ్వడంతో పురందేశ్వరిలో మంట పుట్టింది. కూటమి విజయంలో కీలక పాత్ర పోషిస్తే తనకిచ్చే కానుక ఇదేనా అని ఆమె అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. సిఎం రమేష్ కూడా చంద్రబాబు నాయుడి చేత పైరవీ చేయించుకున్నా లాభం లేకపోయిందంటున్నారు.
మంత్రి పదవులు దక్కని ఈటల రాజేందర్, డి.కె. అరుణ విషయంలో బిజెపి హై కమాండ్ క్లారిటీతో ఉన్నట్లు చెబుతున్నారు. ప్రత్యేకించి ఈటల రాజేందర్ కు సముచిత పదవి ఇవ్వడానికి నాయకత్వం సిద్ధంగా ఉందంటున్నారు. రేపో మాపో ఈటల రాజేందర్ ను తెలంగాణ బిజెపి చీఫ్ గా నియమించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. 20ఏళ్లుగా తెలంగాణా ఉద్యమంలోనూ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించారు ఈటల. బీసీ సామాజిక వర్గాలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల నేతలతోనూ ప్రాంతాలతోనూ ఈటలకు మంచి సంబంధాలున్నాయి. ఇవన్నీ పార్టీ బలోపేతానికి పనికొస్తాయని నాయకత్వం భావిస్తోంది. అందుకే ఈటలను పార్టీ అధ్యక్షుణ్ని చేయాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు.
డి.కె.అరుణ కూడా సీనియర్ నాయకురాలే. పైగా తెలంగాణాలో కీలకమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు. దీంతో ఆమెకు పార్టీ కేంద్ర కార్యవర్గంలో ఏదైనా కీలక పదవి ఇవ్వచ్చని అంటున్నారు.
ఇక ఏపీలో ప్రస్తుత అధ్యక్షురాలు పురందేశ్వరి గతంలో రెండు సార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఈ సారి తనకు ఆ సీనియారిటీ కలిసొస్తుందనుకున్నారు. అయితే బిజెపి నాయకత్వం వలస నేతలెవరికీ మంత్రి పదవులు ఇవ్వకపోవడంతో పురందేశ్వరికీ రాలేదు. అయితే పార్టీ జాతీయ కార్యవర్గంలో పురందేశ్వరికి ప్రమోషన్ ఇవ్వచ్చని అంటున్నారు. అదే విధంగా సి.ఎం. రమష్ కు కూడా పార్టీ పరమైన పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కేంద్ర కేబినెట్ కూర్పు తెచ్చిన అసంతృప్తిని దారికి తెచ్చేందుకు కమలనాథులు ప్రయత్నాలు మొదలు పెట్టేశారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…