ఆయనకు జాక్ పాట్.. ఆమెకు పాట్లు

By KTV Telugu On 12 June, 2024
image

KTV TELUGU :-

కేంద్ర మంత్రివర్గంలో ఐదుగురు తెలుగువారికి ఛాన్స్ దక్కింది. ఇదీ ఓ మోస్తరు గౌరవమైనప్పటికీ ఎవరికి ఎందుకు మంత్రిపదవి  వచ్చిందనే అంశంపై ఇప్పుడు  చర్చ ఊపందుకుంది. కుల సమీకరణాల లెక్కలు చూశారా. పార్టీ లెక్కలు కట్టారా. వ్యక్తిగత ఆధిపత్యాలకు చోటిచ్చారా లాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఏపీ బీజేపీలో ఇప్పుడు  రెండు గ్రూపుల మధ్య పెద్ద రచ్చ  ఖాయమనిపిస్తోంది. పురంధేశ్వరికి కేంద్ర మంత్రి పదవి రాకపోవడంపై ఒక వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది….

తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి  సంజయ్  కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒకరు రెడ్డి సామాజికవర్గమైతే, మరోకరు మున్నూరు కాపు వర్గానికి చెందిన నాయకుడు. ఇక ఏపీలో ముగ్గురికి ఛాన్స్ దొరికింది. అందులో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు మాజీ ఎంపీ ఎర్రన్నాయుడు కుమారుడు. తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన యువ రాజకీయ వెత్త. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, కమ్మ సామాజిక వర్గం ఎంపీ. నర్సాపురం ఎంపీ  భూపతిరాజు శ్రీనివాస వర్మ… క్షత్రియ సామాజికవర్గం నాయకుడు. రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్ ఇద్దరూ టీడీపీ ఎంపీలైతే…. మిగతా ముగ్గురు బీజేపీ  నేతలు. బీజేపీ అసలు ఏ లెక్కన పదవులిచ్చిందన్న చర్చ జరుగుతుండగా.. ఈ సారి ఎంపికలో ఆరెస్సెస్ గాలి వీచిందని చెబుతున్నారు. ఆరెస్సెస్ పునాది మీదనే బీజేపీ భవనం నిర్మితం అవుతూ వస్తోంది. అయితే మోదీ హయాంలో మాత్రం ఆరెస్సెస్ ప్రాతినిధ్యం తగ్గిందన్న  ప్రచారం జరుగుతోంది.  బీజేపీ కార్పొరేట్ శక్తులకు నిలయం అనే భావన ఏర్పడింది. ఈ భావనను తొలగించాలన్న ఉద్దేశ్యంతోనే ఆరెస్సెస్ కంకణం కట్టుకుంది. ఈసారి మాత్రం ఆరెస్సెస్ జోక్యం మోదీ మంత్రి వర్గం కూర్పులో కనిపిస్తోంది.  మూడున్నర దశాబ్దాలు క్రితం ఆరెస్సెస్ కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించిన శ్రీనివాసవర్మకు అనూహ్యంగా నరసాపురం లోక్ సభ టికెట్ దక్కడం వెనక ఆరెస్సెస్ ఉంది. ఎంపీల సంఖ్య కోసం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చినా మంత్రి పదవుల విషయంలో మాత్రం బీజేపీ ఆరెస్సెస్ చాలా శ్రద్ధగా అన్నీ చూసే ఎంపిక చేసాయని అంటున్నారు. ఇక తెలంగాణాలో తీసుకుంటే ఇద్దరు కేంద్ర మంత్రులూ ఆరెస్సెస్ నేపధ్యం కలిగిన వారే కావడం విశేషం. కిషన్ రెడ్డి అయితే 1977 నుంచి ఆరెస్సెస్ లో పనిచేస్తూ అలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు ఈ స్థితికి చేరుకున్నారు.అలాగే మరో ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ కలిగిన నేత కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్. ఆయన కూడా తన జీవితంలో సగం భాగం ఆరెస్సెస్ కే కేటాయించారు.

కమ్మ సామాజికవర్గం అయినందుకే పురంధేశ్వరికి టికెట్ రాలేదా. బీజేపీ  పెద్దలు నడ్డా, అమిత్ షాకు అత్యంత సన్నిహితుడైనప్పటికీ సీఎం రమేష్ ఎందుకు కేబినెట్ బెర్త్ దక్కించుకోలేకపోయారు. ఈ వ్యవహారాల్లో చంద్రబాబు గాలి వీచిందన్న ప్రచారం ఎంతవరకు నిజం…

ఎన్టీయార్ తనయ, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ప్రస్తుతం రాజమండ్రి ఎంపీ  దగ్గుబాటి పురంధేశ్వరి విషయంలో ఏం జరిగినా దాని వెనుక చంద్రబాబు హస్తం ఉందని ప్రచారం చేసేందుకు సోషల్ మీడియాలో ఒక వర్గం రెడీగా ఉంటుంది. ఈ సారి ఆమెకు మంత్రి పదవి దక్కకపోవడంతో ఇంకేముంది చంద్రబాబు చక్రం  తిప్పి ఆమెకు కేబినెట్ పదవి దక్కకుండా ఆపారని అప్పుడే  పుంఖానుపుఖాలుగా  రాయడం మొదలైంది. నిజానికి అలాంటిదేమీ లేదని బీజేపీ  వర్గాలు ఆఫ్ ది రికార్డు చెబుతున్నాయి. గతంలో కూడా తొలుత మంత్రివర్గంలో  చోటు ఇవ్వలేని వారికి పునర్   వ్యవస్థీకరణలో ఇచ్చినట్లుగా గుర్తుచేస్తున్నారు. మోదీ, అమిత్ షా వేరే కారణాలతో పురంధేశ్వరికి మంత్రి పదవి  తాత్కాలికంగా ఆపారని ప్రచారం జరుగుతోంది. అయితే కుల సమీకరణాలు కొంత మేర పనిచేయశాయని అంటున్నారు. మంత్రివర్గంలోకి కమ్మ కులానికి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు సిఫార్సు చేసిన తర్వాత మరో కమ్మ నేతను తీసుకోవడం అసాధ్యమన్న ఫీలింగ్ వచ్చేసింది. పైగా కమ్మ సామాజికవర్గం స్థూలంగా టీడీపీలో ఉన్నప్పుడు ఇక పురంధేశ్వరిని ప్రోత్సహిస్తే ఎంత, ప్రోత్సహించకుంటే ఎంత అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్న మాట వాస్తవం.శ్రీనివాస్ వర్మకు మంత్రి పదవి ఇవ్వడం కూడా క్షత్రియ సామాజికవర్గాన్ని ఓన్ చేసుకునేందుకేనని చెబుతున్నారు. కమ్మ కులం టీడీపీ, రెడ్డి కులం వైసీపీకి, కాపు కులం జనసేనకు ఉన్నప్పుడు స్థూలంగా తమకు కూడా బలమైన క్షత్రియ సామాజికవర్గం ఉంటే మంచిదన్న అభిప్రాయం బీజేపీ వర్గాల్లో కలిగింది. బలిజ సామాజిక వర్గానికి చెందిన సీఎం  రమేష్ ను కూడా మంత్రి పదవికి దూరం పెట్టారు.  కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలన్నీ ఇప్పుడు జనసేన వైపు మొగ్గు చూపుతున్నప్పుడు ఎటూ వెళ్లని సామాజిక వర్గాన్ని తమ వైపుకు తిప్పుకుంటే బావుంటుందని బీజేపీ లెక్కకట్టుకుంది. మరో పక్క సీఎం రమేష్ ను పూర్తిగా  విశ్వసించలేమని కూడా బీజేపీ భావిస్తుండొచ్చు. ఎందుకంటే బీజేపీ కంటే కాంగ్రెస్ కు ఆయన ఎక్కువ మొత్తంలో ఎలక్టోరల్ బాండ్స్ కొనిచ్చారు…

పురంధేశ్వరికి లోక్ సభ స్పీకర్ పదవి ఇస్తారని మరో ప్రచారం జరుగుతోంది.ఇదీ కూడా మీడియా సృష్టిగానే పరిగణించాలా వద్దా అన్నది ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పటిదాకా స్పీకర్  గా చేసిన ఓం బిర్లా మరోసారి  కోటా లోక్ సభా నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆయనకు కేంద్ర మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. చూడాలి మరి ఏం  జరుగుతుందో, ఎలా జరుగుతుందో…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి