నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు ఇప్పుడు ఎటూ పాలు పోవడం లేదట. ఈ సారి కేంద్ర మంత్రి పదవి పక్కా అనుకుని ముందస్తుగా సంబురాలు స్టార్ట్ చేసిన అర్వింద్ కు బీజేపీ అధిష్టానం షాకిచ్చింది. ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ కు సహాయ మంత్రి పదవి ఇచ్చి… అర్వింద్ కు మొండి చేయి చూపించింది. దానితో అర్వింద్ తీవ్ర మనస్థాపంతో రగిలిపోతున్నట్లు సమాచారం. అధిష్టానం తనను కాకుండా సంజయ్ ను ఎందుకు ఎంపిక చేసుకుందో అర్థం కావడం లేదని అర్వింద్ వాపోతున్నారు..
ధర్మపురి అర్వింద్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి డీ. శ్రీనివాస్ తొలుత కాంగ్రెస్ లో ఉండేవారు. పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత బీఆర్ఎస్ లో చేరి రాజ్యసభ సభ్యుడయ్యారు. కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నించి మళ్లీ వెనక్కి తగ్గారు. అర్వింద్ సోదరుడు ధర్మపురి సంజయ్.. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆర్వింద్ మాత్రం హిందూత్వ భావజాలంతో బీజేపీలో చేరి అక్కడే కొనసాగుతున్నారు. తెలంగాణ బీజేపీలో ఆయన బలమైన నాయకుడనే చెప్పాలి. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే.. ఆయన కూతురు.. ప్రస్తుత బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను 2019 లోక్‌సభ ఎన్నికల్లో నిజాబాబాద్‌లో ఓడించి అర్వింద్ సంచలనం సృష్టించారు.
పసుపు బోర్డు తెస్తానని బాండు పేపర్ రాసి ఇచ్చి.. కాస్త ఆలస్యంగా అయినా బోర్డు సాధించాడు. ఇదే 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ అర్వింద్ ను మళ్లీ నిజామాబాద్ ఎంపీగా గెలిపించింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత అయిన అర్వింద్.. రెండోసారి ఎంపీగా గెలిస్తే తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నుంచి ఓడిపోయినా బాధ పడలేదు. లోక్ సభ ఎన్నికల్లో గెలుస్తానని, కేంద్ర మంత్రి అవుతానని చెప్పుకుంటూ వచ్చారు…
నిజామాబాద్ లోక్ సభా నియోజకవర్గంలో అర్వింద్ సునాయాసంగా గెలిచారు. మరి కోరుకున్న కేంద్ర మంత్రి పదవి ఎందుకు రాలేదన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నే అవుతుంది. అందుకు సమీకరణాలు పనిచేయలేదని చెబుుతున్నారు…..
ఈ సారి తనను గెలిపిస్తే మంత్రిగా తిరిగి వస్తానని నిజామాబాద్ లోక్ సభా పరిధిలో అర్వింద్ ప్రచారం చేసుకున్నారు. గెలిచిన మాట నిజం, మంత్రి పదవి రావడం మాత్రం అబద్ధమైంది. బీసీ కోటాలో సంజయ్, డాక్టర్ లక్ష్మణ్, ఈటల రాజేందర్, అర్వింద్ లో ఒకరికి కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కుతుందని వార్తలు వచ్చాయి. ఈటలకు టీబీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చేందుకు ఆయన మంత్రి పదవిని ఆపినట్లుగా చెబుతున్నారు. డాక్టర్ లక్ష్మణ్ ను జాతీయ పార్టీలో ఫుల్ టైమ్ వాడుకోవాలని నిర్ణయించినట్లుగా నేతలు అంటున్నారు. దానితో బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచి ఉండొచ్చు. ఇద్దరూ ప్రధాని మోదీకి సన్నిహితులే అయినప్పటికీ.. సంజయ్ కాస్త ఎక్కువ సమానుడని తేలిపోయింది. పైగా టీబీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మోదీ, అమిత్ షాలను మెప్పించే విధంగా బండి సంజయ్ పనిచేశారు. కిషన్ రెడ్డి నాచురల్ ఛాయిస్ కావడంతో ఆయనకు మంత్రి పదవి దక్కగా.. తెలంగాణలో రెండో పదవి సంజయ్ కు వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఏకంగా 72 మంది మంత్రులు బాధ్యతలు చేపట్టారు. దానితో ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ, పునర్ వ్యవస్థీకరణ ఉండదని కూడా అర్థమైపోయింది. అందుకే ధర్మపురి అర్వింద్ తీవ్ర నిరాశలో ఉన్నట్లుగా తెలుస్తోంది..
అర్వింద్ మాటల మరాఠీ. దూకుడుగా ఉండే నాయకుడు. ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడతారు. పార్టీ బలోపేతం కోసం పనిచేస్తారు. ఉమ్మడి నిజామాబాద్ రాజకీయాల్లో పూర్తి పట్టు సాధించారు. అందుకే ప్రస్తుతానికి నిరాశ తప్పకపోయినా భవిష్యత్తులో కీలక పదవి రావచ్చని తెలంగాణ పార్టీ వర్గాలు అంటున్నాయి….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…