అక్కడ్నుంచి గెలిస్తే మంత్రి పదవి ఖాయమట

By KTV Telugu On 14 June, 2024
image

KTV TELUGU :-

కేంద్ర మంత్రివర్గంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు ఎంపీలకు స్థానం దక్కింది. వీరిలో ముగ్గురు బీజేపీ మంత్రులు ఎన్నికైన నియోజకవర్గాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. బీజేపీ అధికారంలోకి వస్తే ఈ సెగ్మెంట్ల నుంచి ఎన్నికైన వారికి తప్పకుండా కేంద్రంలో బెర్త్‌లు గ్యారెంటీ అని చరిత్ర చెబుతోంది. గతంలో వాజ్‌పేయి ప్రభుత్వం, మోదీ గత రెండు ప్రభుత్వాలను గమనించినా ఇదే విషయం స్పష్టం అవుతోంది. ఇంతకీ ఆ మూడు నియోజకవర్గాలు ఎక్కడున్నాయి? వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్నది ఎవరు? వాచ్ దిస్ స్టోరీ..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి నరేంద్ర మోదీ మూడో మంత్రివర్గంలో బెర్త్‌లు సంపాదించిన ఐదుగురిలో ముగ్గురు బీజేపీ నుంచి ఎన్నికైనవారే ఉన్నారు. వీరిలో ఏపీలోని నర్సాపురం నుంచి ఎన్నికైన శ్రీనివాసవర్మ, తెలంగాణలో సికింద్రాబాద్‌ నుంచి రెండోసారి గెలిచిన కిషన్‌రెడ్డి, కరీంనగర్‌ నుంచి రెండోసారి విజయం సాధించిన బండి సంజయ్‌ల నియోజకవర్గాలకు కేంద్ర మంత్రుల నియోజకవర్గాలుగా పేరుంది. ఎందుకంటే గతంలో అటల్‌బిహారీ వాజ్‌పాయ్ ప్రధానిగా ఉన్నపుడు కూడా ఈ మూడు నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ఎంపీలు కేంద్రం మంత్రులుగా పనిచేశారు. ఈసారి కూడా ఈ మూడు నియోజకవర్గాల నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలకే కేంద్ర మంత్రులుగా అవకాశం రావడాన్ని విశేషంగా చెబుతున్నారు.

సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి బండారు దత్తాత్రేయ 1999 ఎన్నికల్లో విజయం సాధించి నాటి వాజ్ పేయి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. 2014లోనూ సికింద్రాబాద్ నుంచే ఎంపీగా గెలిచి మోదీ తొలి కేబినెట్ లో కూర్చొన్నారు. ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన బండారు దత్తాత్రేయ రెండుసార్లు కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ సికింద్రాబాద్ నుంచే 2019, 2024 ఎన్నికల్లో గెలిచి వరసగా రెండు సార్లు కేంద్రమంత్రి అయ్యారు కిషన్ రెడ్డి. సో సికింద్రాబాద్ నుంచి బిజెపి అభ్యర్థిగా గెలిస్తే..కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే సెంటిమెంట్ ప్రకారం సెంట్రల్ మినిస్టర్ పక్కా అని అంటున్నారు.

ఇక కరీంనగర్ నుంచి 1999లో ఎన్నికల్లో విద్యాసాగర్ రావు విజయం సాధించి నాటి వాజ్‌పాయ్ ఎన్డీయే కేబినెట్‌లో బెర్త్ దక్కించుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా సేవలు అందించారు. ఇప్పుడు అదే కరీంనగర్ నుంచి రెండోసారి గెలిచిన బండి సంజయ్ కూడా మోదీ సర్కారులో కేంద్రహోంశాఖ సహాయమంత్రిగానే ఎంపికయ్యారు. కరీంనగర్ లో బిజెపి కమిట్ మెంట్ లీడర్ కు ఎంపీగా విజయం దక్కితే మంత్రివర్గంలో చోటు పక్కా అనేది సెంటిమెంట్‌గా కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లోనూ బిజెపి పార్లమెంటరీ సెగ్మెంట్‌ సెంటిమెంట్ కంటిన్యూ అయింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన బిజెపి క్యాండిడేట్స్ ను మంత్రిపదవి వరిస్తూ వస్తోంది. 1999లో గెలిచిన సినీ నటుడు కృష్ణంరాజు కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా గెలిచిన బిజెపి నేత భూపతిరాజు శ్రీనివాస వర్మకు కడూఆ క్యాబినెట్ లో చోటు దక్కింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లోని బిజెపి నేతల్లో గతంలో ఏ నియోజకవర్గాల నుంచి గెలిచి మంత్రులయ్యారో ఇప్పుడు కూడా అక్కడి నుంచి విజయం సాధించినవారికే మోదీ మూడో మంత్రివర్గంలో చోటు దక్కడంతో ఆ నియోజకవర్గాలపై సెంటిమెంట్ పండిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇక్కడ ఇంకో విశేషం కూడా కనిపిస్తోంది. కరీంనగర్ నుంచి ఎన్నికై కేంద్ర మంత్రిగా పనిచేసిన సీహెచ్ విద్యాసాగరరావు మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు. సికింద్రాబాద్‌ నుంచి గెలిచి వాజ్‌పాయ్‌, మోదీ మంత్రివర్గాల్లో పనిచేసిన బండారు దత్తాత్రేయ ప్రస్తుతం హర్యానా గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సో భవిష్యత్తులో కిషన్  రెడ్డి, బండి సంజయ్ లకు గవర్నర్ పదవులు దక్కే యోగం కూడా ఉండచ్చన్న మాట.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి