తెలంగాణ లోక్‌సభ ఫలితాలపై కాంగ్రెస్ అధిష్టానం అసంతృప్తిగా ఉంది. ఇటీవలే అధికారంలోకి వచ్చిన తెలంగాణాలో 14 స్థానాలు వస్తాయనుకుంటే ఎనిమిది స్థానాలకే పరిమితం కావడాన్ని హై కమాండ్ జీర్ణించుకోలేకపోతోంది. ఇంత దారుణమైన ఫలితాలకు కారణాలేంటి? అంటూ తెలంగాణా కాంగ్రెస్ నేతలను ఆరా తీశారు అధిష్ఠానం దూతలు. హై కమాండ్ సీరియస్ కావడంతో తెలంగాణా ఫలితాలపై కాంగ్రెస్ నేతలు నివేదకి సమర్పించారు. బి.ఆర్.ఎస్.-బిజెపికి సహకరించడం వల్లనే సీట్లు తగ్గాయని వివరణ ఇచ్చారు.
లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పోస్ట్‌మార్టం స్టార్ట్ చేసింది. ముఖ్యంగా తాము అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలపై దృష్టిసారించింది. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లోనూ భారీగా సీట్లు వస్తాయని అధిష్టానం ఆశించింది. అందులోనూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలోపే లోక్ సభ ఎన్నికలు జరగడంతో మెజార్టీ సీట్లలో తామే గెలుస్తామని భావించింది. అయితే.. మూడు రాష్ట్రాల్లోనూ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఆ రాష్ట్ర నేతల తీరుపై అసహనం వ్యక్తం చేసారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.
ముఖ్యంగా తెలంగాణలో 17 స్థానాలకు గాను 14 స్థానాల్లో విజయం సాధిస్తామని ఆ రాష్ట్ర నేతలు గట్టిగా విశ్వసించారు. టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండం అంటూ సవాల్ చేశారు. 12 నుంచి 14 స్థాలాల్లో మూడు రంగుల జెండా ఎగురుతుందని ఘంటాపథంగా చెప్పారు. తీరా ఫలితాల్లో మాత్రం 8 స్థానాలకే పరిమితమయ్యింది కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకున్న బీజేపీ కూడా లోక్‌సభ ఎలక్షన్స్‌లో సత్తా చాటింది. కాంగ్రెస్‌తో సమానంగా 8 ఎంపీలను గెలుచుకుంది.
కాంగ్రెస్ గెలుస్తామని గట్టిగా నమ్మకం పెట్టుకున్న ఆదిలాబాద్, నిజామాబాద్, చేవెళ్ల, మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానాల్లోనూ బీజేపీ జెండా ఎగురవేసింది. ఫలితంగా 12 అనుకున్న ఎంపీ సీట్లు కాస్త.. 8 దగ్గరే ఆగిపోయాయి. అయితే.. తెలంగాణలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడానికి బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఓప్పందమే కారణమంటున్నారు హస్తం నేతలు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లాంటి నేతలైతే.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటూ ప్రచారం చేస్తున్నారు. అటు.. ఏఐసీసీకి ఇచ్చిన రిపోర్ట్లోను ఇదే అంశాన్ని చెప్పారట ఇంఛార్జి దీపాదాస్ మున్షీ.
బీజేపీ గెలిచిన 8 స్థానాల్లో మెదక్ మినహా మిగతా అన్ని చోట్ల బీఆర్ఎస్ పూర్తిగా బీజేపీకి సహాకరించిందని అధిష్టానానికి వివరించారట. అందుకే తాము అనుకున్న ఫలితాలు రాలేదని రిపోర్ట్‌లో పేర్కొన్నారట. రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని సోనియా గాంధీ, ఖర్గేను కలసినప్పుడు చెప్పినట్లు సమాచారం.తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇచ్చిన రిపోర్ట్‌పై ఏఐసీసీ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ను ఎదుర్కొన్న కాంగ్రెస్.. లోక్‌సభ ఎన్నికల్లో ఎందుకు ఎదుర్కోలేకపోయిందని ప్రశ్నించినట్లు సమాచారం.
బీఆర్ఎస్, బీజేపీ కలసి వచ్చినా.. కాంగ్రెస్ అధికారం ఉండడంతో పాటు పార్టీ సంస్థాగతంగానూ బలంగా ఉన్న విషయాన్ని మరచిపోయారా అని నిలదీశారట ఖర్గే. బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం ఉంటే కాంగ్రెస్ గెలిచిన 8 స్థానాల్లోనూ బీజేపీనే గెలవాలికదా అని అనుమానం వ్యక్తం చేశారట ఏఐసీసీ నేతలు. కనీసం.. ఇప్పటికైనా పనితీరు మెరుగుపర్చుకోవాలని తెలంగాణ నేతలకు సూచించారట అధిష్టానం పెద్దలు. లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం కలుగుతుందని హెచ్చరించారట.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…