తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వం పై పట్టు లేకుండా పోయింది. వివిధ మంత్రిత్వ శాఖలో జరుగుతున్నదేమిటో ఆయనకు తెలియడం లేదు. వివాదాలు వచ్చిన తర్వాత సర్దుకోవడం… ఆ నిందను రేవంత్ భరించడం కామన్ గా మారిపోయింది. ముఖ్యంగా ఎక్సైజ్ శాఖలో జరుగుతున్న వ్యవహారంలో రేవంత్ పైనే మరక పడుతోంది. కొత్త బ్రాండ్ల విషయంలో ప్రభుత్వ వ్యవహారం మొత్తం గందరగోళంగా మారింది. చివరికి పాఠ్యపుస్తకాల్లో సీఎం కేసీఆర్ అని ముద్రిస్తే విద్యా శాఖ నిద్రపోయింది. కాళేశ్వరం విచారణ ఎపిసోడ్లో మంత్రి ఉత్తమ్ ఎన్ని పిల్లి మొగ్గలేశారో చెప్పాల్సిన పని లేదు. ఎందుకిలా జరుగుతోంది. ప్రభుత్వంపై రేవంత్ పట్టు సాధించలేకపోవడానికి కారణం ఏమిటి ?
ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వాన్ని ఒంటి చేత్లో నడిపించగలగాలి. తన కనుసన్నల్లో పాలన చేయగలగాలి. లేకపోతే ప్రతి ఒక్కరూ ఓ సీఎంలా వ్యవహరిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే జరుగుతోంది. మంత్రిత్వశాఖల్లో ఏం జరుగుతుందో సీఎంకు తెలియడం లేదు.కానీ నింద మాత్రం ఆయనపై పడిపోతోంది. ముఖ్యంగా ఎక్సైజ్ శాఖలో కొత్తగా ఎలాంటి లిక్కర్ షాపులకు అనుమతులివ్వ లేదని ఆబ్కారీ శాఖ మంత్రి గత నెలలో ప్రకటించారు. మంత్రి ప్రకటించిన వారం రోజులకే ఇతర రాష్ట్రాల బీర్ల కంపెనీలకు సరఫరాకు అబ్కారీ శాఖ గ్రీన్‌సిగల్ ఇచ్చింది. ప్రతి పక్షాలతోపాటు స్వపక్షంలోనూ తీవ్ర వ్యతిరేకత రావడంతో వాటి అనుమతులను తాత్కాలికంగా హౌల్డ్‌లో పెట్టారు
అనుమతులు పొందిన సదరు కంపెనీలపై దేశ వ్యాప్తంగా అనేక ఆరోపణలున్నాయనీ, రాష్ట్రాల ఖజానాలకు గండికొడుతూ, ప్రభుత్వ సంస్థల వద్ద రుణాలను తీసుకొని ఎగ్గొడుతూ, కల్తీ మద్యం వ్యాపారం చేశాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సదరు కంపెనీలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమైంది. నిబంధనల మేరకే సోమ్ డిస్టిలరీ కంపెనీకి మద్యం సరఫరా చేసేందుకు అనుమతిచ్చామని ఎక్సైజ్ శాఖ మంత్రి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. డిమాండ్, సప్లరును బట్టి కొత్త కంపెనీలకు బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ అనుమతులను మంజూరు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. అప్పటికే జరగరాని నష్టం జరిగి పోయింది. మద్యం విషయంలో గత సర్కార్ దారిలోనే కాంగ్రెస్ నడుస్తున్నదనే వాదన ప్రజల్లోకి బలంగా వెళ్లింది. . తెలంగాణ కంపెనీలను కాదని కమీషన్ల కోసం ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం డిస్టలరీలకు అనుమతులిస్తున్నారని దుమారం చేలరేగడంతో మఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ శాఖ మంత్రికే తెలియకుండా విధాన పరమైన నిర్ణయాలు జరిగిపోతున్నాయని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఇది చేతకాని తనమే ప్రభుత్వానికి తెలియకుండా నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు?
ఇది మాత్రమే కాదు ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలకుపైగా అవుతోంది. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో బుధవారం పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు అధికారులు పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్‌లు పంపిణీ చేశారు. అయితే, విద్యాశాఖ వీటిలో ముందుమాట మార్చకుండానే కొత్త బుక్స్ ముద్రించింది. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందిస్తున్నామన్న ఉత్సాహంతో గత బీఆఎస్ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి పేర్లతో పాఠ్య పుస్తకాల్లో ముద్రించి పంపిణీ చేశారు. పాఠ్యపుస్తకాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, సంచాలకులు జగదీశ్వర్ పేర్లు ఉన్నాయి. ఈ విషయం సోషల్‌మీడియాలో రావడంతో ఏదో తప్ప జరిగిందన్నట్టుగా పాఠశాల విద్యాశాఖ ఆగమేఘాల మీద ఆయా పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. అన్ని పాఠ్యపుస్తకాలను వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. దీని పర్యవసానాలు ఎలా ఉన్నా.. అసలు ప్రభుత్వం ఏం చేస్తోందన్నది కూడా అర్థం కాని విషయం.
వివిధ మంత్రిత్వ శాఖల్లో జరుగుతున్న వ్యవహారాలతో రేవంత్ సర్కార్ పనితీరు మసకబారుతోంది. రేవంత్ సీఎం అయినప్పటికీ పలు శాఖల్ని సీనియర్లు నిర్వహిస్తున్నారు. వారికి రేవంత్ సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశం లేదు. వారి శాఖల్లోనే వివాదాలు ఉన్నాయి. ముఖ్యమంత్రిగా రేవంత్ అన్నింటికీ బాధ్యుడు. కానీ ఆయన ప్రభుత్వంపై పట్టు పెంచుకోవడానికి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఫలితంగా లిక్కర్ బ్రాండ్ల వంటి వివాదాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికైనా మొహమాటాలు వాదిలి ప్రభుత్వాన్ని గుప్పిట్లోకి తెచ్చుకోకపోతే రేవంత్ సమర్థతపై ప్రజల్లో సందేహాలు ఏర్పడతాయి.
ప్రభుత్వం నడపడం ఆషామాషీ కాదు. కానీ కనుసన్నలతో ప్రభుత్వాన్ని నడిపేవారు ఉంటారు. అతి కష్టం మీద నడిపేవారు ఉంటారు. ఏదో నడిచిపోతుందని అలా వదిలేసేవారు ఉంటారు. కానీ తమదైన ముద్ర వేయకపోతే.. ప్రజలు కూడా పవర్ ఫుల్‌గా గుర్తించరు. రేవంత్ అలాంటి పరిస్థితి తెచ్చుకోరని ఆశిద్దాం
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…