కేసీఆర్ ఇంకా తనను సీఎంగానే ఊహించుకుంటుంటారు. గడీల్లో దొరలా ఫీలవుతుంటారు. ఎవరిని ఎలా డీల్ చేయాలో విచక్షణ కోల్పోయినట్లుగా ఆయన ఉంటారు. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండటం మానేసిన కేసీఆర్, ఇప్పుడు ఇష్టానుసారం ప్రకటనలు ఇస్తున్నారు. ఏకంగా ఒక న్యాయమూర్తిపైనే ఆయన చేసిన ఆరోపణలతో… కేసీఆర్ పరిణితిలేని రాజకీయ నాయకుడా అన్న అనుమానాలకు తావిస్తోంది. విద్యుత్తు ఒప్పందాలపై విచారణ చేస్తున్న కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డిని వైదొలగమని కేసీఆర్ డిమాండ్ చేసిన తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాకుండా, సామాన్య జనంలో కూడా చర్చనీయాంశమైంది….
యాదాద్రి విద్యుత్ కేంద్ర నిర్మాణం, ఛత్తీస్ గఢ్ కరెంట్ కొనుగోలుకు గత ప్రభుత్వం అనుసరించిన విధానంపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ నర్సింహారెడ్డి జ్యుడిషియల్ కమిషన్ విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ సహా 25 మందికి నోటీసులు ఇచ్చింది. అప్పటి ప్రభుత్వ నిర్ణయాలపై జూన్ 15 లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కేసీఆర్ ఎక్కువ టైమ్ అడిగితే అందుకు నిరాకరించిన కమిషన్ కొంత గడువు ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే ప్రస్తుతం జనంలో కనిపించడం మానుకున్న కేసీఆర్… జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ పై అంతెత్తున ఎగిరిపడుతూ 12 పేజీల లేఖ రాశారు. ఆ లేఖలో ప్రస్తావించిన అంశాలు,ఒక మాజీ ప్రధాన న్యాయమూర్తి పట్ల ఆయన ప్రవర్తించిన తీరు ఆక్షేపణీయంగా ఉన్నాయనడంలో సందేహించాల్సిన అవసరం లేదు. అసలు కమిషన్ ఏర్పాటు చేయడమే చట్ట విరుద్ధమన్నట్లుగా కేసీఆర్ మాట్లాడారు. జస్టిస్ నర్సింహారెడ్డి బాధ్యతలు స్వీకరించడమే తప్పు అని ఆరోపించారు. అన్ని విషయాలు పరిశీలించకుండా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారన్నది కూడా కేసీఆర్ ప్రధాన ఆరోపణగా ఉంది. పైగా కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చినా ప్రయోజనం ఉండదని, అందుకే రావడం లేదని ఆయన చెప్పుకున్నారు. అదేదో చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లుగా ఉంటుందీ అన్న సామెతను కేసీఆర్ పరోక్షంగా గుర్తు చేశారు. పైగా జస్టిస్ కు కనీస అవగాహన లేదని ఆరోపించడం కూడా సమంజసంగా అనిపించడం లేదు. మొత్తం వ్యవహారంపై సమగ్ర అధ్యయనం చేయకుండా మాజీ న్యాయమూర్తి స్థాయి వ్యక్తి నోటీసులు ఇస్తారని ఎవరూ అనుకోరు. ఆ విషయంలో ఆయన తీరు ఆమోదయోగ్యం కాదు.. న్యాయ ప్రాధికార సంస్థలైన ఉభయ రాష్ట్రాల ఈఆర్సీలు అన్ని రకాల పరిశీలనలు జరిపి ఇచ్చిన ఆమోదాలపై తిరిగి విచారణ జరపాలన్న ఆలోచనే దురదృష్టకరమని, న్యాయ నిపుణులైన మీరు చట్టాల్లో పొందుపరిచిన అంశాలను పరిగణనలోకి తీసుకోకుండానే న్యాయ ప్రాధికార సంస్థలపై వ్యాఖ్యలు చేయడం విచారకరమని అంటూ అసలు జస్టిస్ నర్సింహారెడ్డికి విచారణార్హత లేదని అనడంతో అన్ని వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది…
అసలు కేసీఆర్ బాధమిటి. ఆయన ఎందుకలా మాట్లాడుతున్నారు. ఆయన ఎవరి భుజం మీద గన్ పెట్టి ఎవర్ని కాల్చాలని అనుకుంటున్నారు. ఆయన ఏదో చేయబోయి కొత్త సమస్యల్లో ఇరుక్కోవడం నిజం కాదా. విచారణ పవిత్ర బాధ్యత అంటూ సుద్దులు కూడా చెప్పేయ్యాల్సినంత అవసరం ఉందా..ఇప్పుడు కమిషన్ సీరియస్ గా రియాక్ట్ అయితే కేసీఆర్ పరిస్థితి ఏమిటి….
తెలంగాణ ఉద్యమకాలం నాటి దూకుడును కేసీఆర్ వదులుకో లేకపోతున్నారన్నది ఒక వాదన. ఆ దూకుడు సహేతుకంగా ఉంటే తప్పు లేదు. నిష్పక్షపాత విచారణ చేసే న్యాయమూర్తిపై తన ఫ్రస్ట్రేషన్ ను ప్రదర్శించడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. పైగా కమిషన్ ఏమి చేయాలి, నివేదిక ఎలా రాయాలో కూడా కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందనే భావించాలి. తాము అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, 24 గంటలూ కరెంట్ ఇచ్చామని కేసీఆర్ చెప్పుకోవడం తప్పులేదు. దానికి ఎవరూ అభ్యంతరం చెప్పరు,కాకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ విచారణను అడ్డుకోవాలని చూడడం మాత్రం దురదృష్టకరం. పైగా కనీస పరిజ్ఞానం ఉన్నవారు కమిషన్ వ్యాఖ్యలను సమర్థించరంటూ ఒక మాట అనడం…నిజంగా జస్టిస్ ను అవమానపరచడమే అవుతుందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. బీహెచ్ఈఎల్ కు నామినేషన్ పద్దతిలో ఇవ్వడం ఆమోదయోగ్యమేనని చెప్పుకోవడంలో కూడా తప్పులేదు. కాకపోతే ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయడమే తప్పన్నట్లుగా జస్టిస్ నర్సింహారెడ్డి మాట్లాడారన్నది కేసీఆర్ ఆరోపణ. నిజానికి జస్టిస్ ఎక్కడా అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తనపై కమిషన్ వేశారన్న అక్కసు కేసీఆర్ సార్ కు ఉంది. ఆ కసి మొత్తం జస్టిస్ నర్సింహారెడ్డిపై తీర్చుకునేందుకు ఆయన ప్రయత్నించారన్న వాదన వినిపిస్తోంది. రేవంత్ రెడ్డిని డైరెక్టుగా తిట్టకుండా నర్సింహారెడ్డిపై ఆయన ఆరోపణలు చేస్తున్నారు..
కేసీఆర్ తీరు మారలేదనేందుకు తాజా లేఖనే నిదర్శనంగా తీసుకోవచ్చు. తనకు ఇష్టం ఉన్నా లేకున్నా ఒక మాజీ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కమిషన్ పై ఆరోపణలు చేయడం తగదు.సీఎంగా పదేళ్లు పని చేసిన నేతకు ఆ మాత్రం తెలియదనుకోము. ఆయన డైవర్షన్ కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారనుకోవాలి. పైగా జస్టిస్ నర్సింహారెడ్డి ముందే ఒక నిర్ణయానికి వచ్చి నోటీసులు ఇచ్చారని కేసీఆర్ ఆరోపించడం కూడా ఎందుకో రుచించడం లేదు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…