పాయింట్ బ్లాంక్‌లో BJP సౌత్ టార్గెట్

By KTV Telugu On 18 June, 2024
image

KTV TELUGU :-

బీజేపీని ఉత్తరాది పార్టీ అంటారు. దక్షిణాదిన కూడా విస్తరించాలని బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో చాలా వరకూ ముందడుగు వేసింది.  వచ్చే ఎన్నికల నాటికి కొన్ని రాష్ట్రాలను కమ్మేసినా ఆశ్చర్యం లేదన్న ఫలితాలు వచ్చాయి. సీట్ల పరంగా  మాత్రమే కాదు.. ఓట్లు పరంగా కూడా. నిలకడగా పెరుగుతున్న బీజేపీ ఓటు బ్యాంక్ దక్షిణాదిలో  ఆ పార్టీ పవర్ ఫుల్ ప్రెజెన్స్ ను చూపిస్తోంది.

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు చూస్తే మొత్తంమీద బిజెపికి యూపీ, మహారాష్ట్రతో పాటు కొన్ని రాష్ట్రాల్లో ఎదురు దెబ్బ తగిలింది.  కేవలం 240 స్థానాలు మాత్రమే తెచ్చుకోగలిగింది. 2014, 2019 ఎన్నికలలో వచ్చిన ఫలితాలను చేరుకోలేకపోయింది. నరేంద్ర మోడీ ఇప్పుడు నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌  సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించాల్సి వచ్చింది.  ఉత్తర ప్రదేశ్‌లో బిజెపి తీవ్రంగా నష్టపోయింది. మహారాష్ట్ర, రాజస్థాన్‌, హర్యానా, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాలలోనూ దెబ్బతిన్నది.  కానీ ఒడిషాలో బిజెపి మున్నెన్నడూ లేని విజయాలు సాధించింది. 21 లోక్‌సభ స్థానాలలో 20 తెచ్చుకోవడమే గాక మొట్టమొదటి సారిగా శాసనసభ లోనూ సంపూర్ణమైన ఆధిక్యత సాధించింది.

దక్షిణ భారత రాష్ట్రాలలో బిజెపి క్రమంగా బలపడుతోంది.   సీట్ల వారీగా చూసినప్పుడు బిజెపి ఈ ప్రాంతంలో పెద్ద పురోగతి సాధించినట్టు కనిపించకపోవచ్చు. ఎందుకంటే అయిదు దక్షిణాది రాష్ట్రాలలో కలిపి దానికి 2019లో 29 సీట్లు వస్తే ఇప్పుడు 2024 లోనూ ఆ సంఖ్య పెరిగింది లేదు. కానీ రాష్ట్రాల వారీ పరిస్థితులు, ఓట్ల వాటా బాగా లోతుగా విశ్లేషిస్తే  ఓట్ల శాతం గణనీయంగా పెంచుకుంటూ వెళ్తోంది.

తెలంగాణలో బిజెపికి 2019లో నాలుగు సీట్లు, 19.45 శాతం ఓట్లు రాగా 2024 ఎన్నికలలో ఆ సంఖ్య రెట్టింపై 8 సీట్లు గెలవగలిగింది. ఓట్ల వాటా కూడా గణనీయంగా 35.19 శాతానికి పెరిగింది. బిఆర్‌ఎస్‌ ఓట్ల వాటా దారుణంగా పడిపోవడం బిజెపికే మేలు చేసింది.

కర్ణాటకలో  బిజెపికి కొంత బలం పోగొట్టుకున్నది. కానీ ఓట్లు కోల్పోలేదు.  2019 ఎన్నికలలో అది 25 సీట్లు 51.38 శాతం ఓట్లు తెచ్చుకుంటే ఇప్పుడు 17 సీట్లకు పరిమితమై 46.09 శాతం ఓట్లు   తెచ్చుకోగలిగింది. అయితే జత కలిసిన జేడీఎస్  5.64 శాతం ఓట్లు తెచ్చుకోవడంతో మొత్తం ఎన్‌డిఎ ఓట్ల శాతం 51.73 అయింది. అంటే బలం నిలబడినట్లే.  కేరళలో బిజెపి త్రిసూర్‌ సీటు గెలిచి మొదటిసారి ఒక లోక్‌సభ స్థానం పొందగలిగింది.   2019లో 12.9 శాతం ఓట్ల శాతం వుంటే ఇప్పుడు 16.67 శాతానికి పెరిగింది. మొత్తం ఎన్‌డిఎ వాటా 19.2 శాతానికి అంటే కేరళలో ఎన్నడూ రానంత అధికంగా పెరిగింది.

తమిళనాడులో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎన్నో గొప్పలు చెప్పుకున్నప్పటికీ బిజెపి ఒక్క సీటు కూడా తెచ్చుకోలేకపోయింది.  2019లో అయిదు సీట్లకు పోటీ చేసిన బిజెపి ఓట్ల శాతం 3.66 శాతం అయితే ఇప్పుడు 11.24 శాతానికి పెరిగింది. పది నియోజక వర్గాలలో బిజెపి రెండవ స్థానంలో వచ్చింది.   అంటే కొన్ని సీట్లలో అది ఎఐడిఎంకె ఓట్లను తెచ్చుకోగలిగిందని అర్థమవుతుంది.  బిజెపి చాలా బలహీనంగా వున్న ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పొత్తు వల్ల లాభపడింది. 2019లో కేవలం 0.96 శాతం ఓట్లు మాత్రమే తెచ్చుకున్న ఆ పార్టీ ఇప్పుడు మూడు పార్లమెంటు సీట్లు గణనీయమైన ఓట్లను సాధించింది.

బీజేపీ కర్ణాటకలో రెండు దశాబ్దాల కిందటే బిజెపి బలమైన పునాది ఏర్పర్చుకుంది. మిగిలిన దక్షిణాది రాష్ట్రాలలో కూడా నెమ్మదిగా అప్పుడప్పుడూ ఆగుతూనైనా బిజెపి ముందుకు సాగుతున్నది.  అందుకే దక్షిణాదిన ఆ పార్టీ విస్తరణ ప్రణాళికాబద్దంగా జరుగుతోందని అనుకోవచ్చు.

బీజేపీ రాజకీయాలు చాలా దూరదృష్టితో ఉంటాయి.  వచ్చే ఎన్నికల నాటికి హిందీ రాష్ట్రాల్లో దెబ్బతిన్నా సౌత్ లో భారీ విజయాలతో నాలుగోసారి గెలవాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్లాన్ చేసుకుటున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి