నాలుగో సారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు తన శైలికి భిన్నంగా మంత్రి వర్గాన్ని రూపొందించారు. అనుభవానికి ఏ మాత్రం చోటు కల్పించలేదు. ఒకళ్లిద్దరికి మాత్రమే పదవులు కట్టబెట్టిన చంద్రబాబు నాయుడు… చాలా మంది సీనియర్లను పక్కన పెట్టేశారు. అతి త్వరలో లోకేష్ ను ముఖ్యమంత్రి పీఠం ఎక్కించడానికి చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నారని .. అందుకే సీనియర్ల విషయంలో మొదట్లోనే కఠిన నిర్ణయం తీసుకున్నారని రాజకీయ పండితులు భావిస్తున్నారు.
ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కూడా ఊహించని విధంగా కూటమి ఏకపక్ష విజయాలు సాధించింది. ప్రతిపక్షం అన్నదే లేకుండా వైసీపీని 11 స్థానాలకు పరిమితం చేయగలిగారు. కూటమిలో భాగస్వామ్య పక్షాల మద్దతు అవసరం లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగేలా తిరుగులేని మెజారిటీ సాధించింది టిడిపి. దీంతో చంద్రబాబు నాయుడిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. తనని ఎవరూ శాసించలేరని..బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితీ ఉండదని క్లారిటీ రావడంతోనే మంత్రి వర్గ కూర్పుపై కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.
ఈ ఎన్నికల్లో 144 చోట్ల పోటీ చేసిన టిడిపి 135 స్థానాలు దక్కించుకుంది. అంటే టిడిపి టికెట్ అందుకున్న వారిలో ఇంచుమించు అందరూ గెలిచినట్లే. కేవలం 9 మంది మాత్రమే ఓటమి చెందారు. వారు కూడా టిడిపి బలహీనంగా ఉన్న నియోజక వర్గాల్లో పోటీ చేసిన వారే. ఇంచుమించు సీనియర్లు అందరూ విజయం సాధించారు. గతంలో చంద్రబాబు నాయుడి కేబినెట్ లో పదవులు అనుభవించిన అందరూ గెలిచారు. ఈ సారి కూడా తమకు మంత్రి పదవులు ఖాయమని చాలా మంది కలలు కన్నారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం అందరికీ షాక్ ఇచ్చారు.సీనియర్లలో అచ్చెంనాయుడికి మాత్రమే పదవి ఇచ్చారు.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చింతకాయల అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణ మూర్తి, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, పత్తి పాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు లలో ఒక్కరికి కూడా మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. పార్టీకి ఎన్నికల వరకు అధ్యక్షుడిగా ఉన్న అచ్చెంనాయుడికి మాత్రం పదవి ఇచ్చారు. ఆయన్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఆ పదవిని పల్లా శ్రీనివాస యాదవ్ కు కట్టబెట్టడం కోసమే పదవి ఇచ్చారని భావిసతున్నారు. తమలో ఏ ఒక్కరికీ మంత్రి పదవి దక్కకపోవడంపై సీనియర్లు నోరు మెదపడం లేదు. అయ్యన్న పాత్రుడు అయితే తనకు మంత్రి పదవి లేకపోయినా ఫర్వాలేదని పైకి అన్నారే కానీ లోపల మాత్రం మండిపోతున్నారని భోగట్టా.
కేబినెట్ లో మొదటి సారి మంత్రులు అయిన వారు 17 మంది ఉన్నారంటేనే కొత్త మొహాలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అర్ధం చేసుకోవచ్చు. ఆ 17 మందిలోనూ 10 మంది ఈ ఎన్నికల్లోనే మొదటి సారి గెలిచి ఎమ్మెల్యేలు అయిన వారు కావడం మరో విశేషం. అంటే కేబినెట్ పై యువ ముద్ర ఉండేలా చంద్రబాబు జాగ్రత్త పడ్డారు.పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే కొత్త తరం మంత్రులను తయారు చేయడం ద్వారా నాయకత్వంలో యువరక్తం ఉరకలు వేసేలా చేయాలన్నది చంద్రబాబు ఆలోచన కావచ్చునని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
అయితే కొత్త నేతలకు మంత్రి పదవులు కట్టబెట్టడం వెనుక చంద్రబాబు చాణక్యం ఉందని మరో వాదన వినపడుతోంది. తన రాజకీయ వారసుడు నారా లోకేష్ ను త్వరాలోనే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారని పార్టీ వర్గాల భావన. యువకుడైన లోకేష్ సిఎం అయితే పార్టీలో సీనియర్లు సహకరిస్తారా లేదా అన్న అనుమానాలు ఉన్నాయంటున్నారు. అందుకే సీనియర్లకు కేబినెట్ లో లేకుండా ముందుగానే చంద్రబాబు జాగ్రత్త పడ్డారని అంటున్నారు. మంత్రి పదవులు అందుకున్న వారిలో మెజారిటీ నేతలు లోకేష్ కు సన్నిహితులే. చాలా మందికి టికెట్ల రావడానికి కారణం కూడా లోకేషే. కుమారుడి పట్టాభిషేకాన్ని దృష్టిలో ఉంచుకున్న చంద్రబాబు నాయుడు చాణక్యం ప్రదర్శించారని రాజకీయ పండితులు భావిస్తున్నారు. అయితే ఈ పరిణామం సీనియర్లను ఎటు నడిపిస్తుందో చూడాలి.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…