తమిళిసై సౌందర్ రాజన్ రాజీనామా తర్వాత తెలంగాణ గవర్నర్ పదవి ఖాళీగా ఉంది. తెలంగాణ యాక్టింగ్ గవర్నర్ గా జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. త్వరలోనే ఫుల్ టైమ్ గవర్నర్ నియామకం జరుగుతుందన్న వార్తల నడుమ ఒక పేరు బలంగా వినిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ పదవి ఇస్తారని బీజేపీలోని ఒక వర్గం ప్రచారం చేస్తోంది..
తెలంగాణ గవర్నర్ గా పనిచేసిన తమిళిసై సౌందరరాజన్ కాస్త ఓవరాక్షన్ చేశారని బీజేపీ వర్గాల్లోనే చర్చ జరిగింది. హాయిగా గవర్నర్ పదవిలో ఉండకుండా రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి ఆమె నష్టపోయారు.చెన్నైలోని ఒక లోక్ సభా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.పైగా తమిళ బీజేపీలో అసమ్మతి రాజకీయాలు చేస్తున్నారంటూ మీడియా సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేత చీవాట్లు తిన్నారు. అదీ ఒక కోణం.. తమిళిసై ఖాళీ చేసిన తెలంగాణ గవర్నర్ పదవి ఎవరికిస్తారనేది మరో కోణం. లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఆ పదవి దక్కే ఛాన్సుందని బీజేపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి….
కిరణ్ కుమార్ రెడ్డి ఒక ఫైర్ బ్రాండ్. ఎవరికీ భయపడరు. ఏం చేసుకుంటావో చేసుకోపో అనే రీతిలో మాట్లాడతారు. అనుకున్నది చేస్తారు. బీజేపీ అధిష్టానం ఆదేశాలను పాటిస్తారన్న నమ్మకమూ కలుగుతోంది. అందుకే గవర్నర్ పదవి ఇద్దామన్న ఆలోచన వచ్చినట్లుగా చెబుతున్నారు…
ఆయన తొలుత కాంగ్రెస్ లో ఉండేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ బీజేపీకి సంబంధించిన పలు కీలక సమావేశాలకు సైతం ఆయన హాజరవుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల బీజేపీ నుంచి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు బీజేపీ హై కమాండ్ కీలక పదవి కట్టబెట్టొచ్చనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా నడుస్తోంది.ఆయనను తెలంగాణ గవర్నర్‌గా నియమించవచ్చని తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాలపై పూర్తి అవగాహన ఉన్న ఆయనను గవర్నర్‌గా నియమిస్తే తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న గవర్నర్ ఇన్‌ఛార్జి మాత్రమే కావడంతో కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తారానే ప్రచారం ఊపందుకుంది. తెలంగాణలో బీజేపీకి ఎనిమిది లోక్ సభ, ఎనిమిది అసెంబ్లీ స్థానాలున్నాయి. వచ్చే ఐదేళ్లలో పార్టీని బలోపేతం చేసుకోవాలని హైకమాండ్ భావిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ను ఓడించాలంటే ఆ పార్టీని బలహీన పరచాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని దెబ్బకొట్టాల్సిన అనివార్యత కూడా ఉంటుంది. ఆ దిశగా రాజ్ భవన్ వైపు నుంచి కూడా నరుక్కు రావాల్సి ఉంటుంది. మునుపటి కేసీఆర్ ప్రభుత్వం పట్ల తమిళిసై ప్రవర్తించినట్లుగా, రేవంత్ సర్కారుపై కొత్త గవర్నర్ సరికొత్త పాచికలు వేయాల్సి ఉంటుంది. ఆ పని కిరణ్ కుమార్ రెడ్డి వల్లే సాధ్యమని భావిస్తున్నారు…
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని రాష్ట్రానికి గవర్నర్‌గా నియమిస్తే పొలిటికల్ పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అయితే కిరణ్ పట్ల తెలంగాణ ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని బీజేపీ అంచనా వేసుకుంటోంది. పైగా తెలంగాణ తెచ్చామని చెప్పుకునే బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోవడం ప్రజల నాడికి నిదర్శనమని కొందరు బీజేపీ నేతలు అంటున్నారు. అందుకే కొత్త గవర్నర్ నియామకంలో అన్ని కోణాలు పరిశీలిస్తున్నారు….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…