కింజరాపు ఫ్యామిలీ జాక్ పాట్ కొట్టింది. అబ్బాయి రామ్మోహన్నాయుడికి కేంద్రమంత్రి పదవి దక్కింది. బాబాయి అచ్చెన్నాయుడికి రాష్ట్ర క్యాబినెట్‌లో బెర్త్ దొరికింది. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అచ్చెన్నాయుడు సీనియారిటీని పరిగణలోకి తీసుకుని కేబినెట్ లో చోటు కల్పించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి అచ్చెన్న ఒక్కరికే మంత్రి పదవి ఇచ్చారు. దీంతో మిగతా ఆశావహులందరికీ నిరాశ తప్పలేదు. ఒకే కుటుంబానికి రెండు పదవులు ఇవ్వడంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ఇదేం న్యాయం అని లోలోన రగిలిపోతున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి మంత్రివర్గంలో అనేక జిల్లాలకు ఇద్దరేసి చొప్పున మంత్రులున్నారు. కాని రాష్ట్రానికి ఉత్తరసరిహద్దులో ఉన్న శ్రీకాకుళం జిల్లాకు మాత్రం ఒక్క మంత్రి పదవే ఇచ్చారు చంద్రబాబు. దీంతో ఈ జిల్లానుంచి పదవులు ఆశించిన సీనియర్ ఎమ్మెల్యేలు నిరాశకు గురయ్యారు. శ్రీకాకుళం ఎంపీగా మూడోసారి గెలిచిన కింజరాపు రామ్మోహన్‌నాయుడికి ప్రధాని మోదీ క్యాబినెట్‌లో మంత్రి పదవి లభించింది. అదేవిధంగా అసెంబ్లీకి వరుసగా ఆరుసార్లు ఎన్నికైన రామ్మోహన్‌నాయుడి బాబాయి అచ్చెన్నాయుడికి చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రి పదవి ఇచ్చారు.
అటు కేంద్రంలోను..ఇటు రాష్ట్రంలోనూ ఒకే కుటుంబానికి మంత్రి పదవులిస్తారా? ఇతర సామాజికవర్గాలను పట్టించుకోరా అనే ప్రశ్న శ్రీకాకుళం జిల్లా టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. జిల్లా నుంచి ప్రధానంగా కూన రవికుమార్, బెందాళం అశోక్, గౌతు శిరీష మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే ఉత్తరాంధ్రలో కీలక వెలమ సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేత అచ్చెన్నాయుడికే అగ్రతాంబూలం ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడంతో సామాజిక సమీకరణాలు పక్కన పెట్టి అచ్చెన్నాయుడికి బెర్త్ కేటాయించారు.
తన అన్న కుమారుడైన ఎంపీ రామ్మోహన్నాయుడికి కేంద్రమంత్రి పదవి ఇవ్వడంతో రాష్ట్రంలో అచ్చెన్నాయుడికి కాకుండా మరొకరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఆశించారు. ఒకే కుటుంబం నుంచి కేంద్రంలోను, రాష్ట్రంలోనూ మంత్రి పదవులివ్వడానికి చంద్రబాబు అంగీకరించరని జిల్లా నేతలు అనుకున్నారు. అయితే పార్టీ కష్టకాలంలో అండగా నిలిచారన్న ఉద్దేశంతో రెండు చోట్లా ఒకే ఫ్యామిలీకి మంత్రి పదవు లిచ్చేశారు.పార్టీ పట్ల విధేయత, సామాజిక వర్గ సమీకరణాల నేపథ్యంలో మంత్రి పదవి వస్తుందని పలువురు సీనియర్లు భావించారు. అయితే కింజరాపు ఫ్యామిలీకే చంద్రబాబు పెద్దపీట వేశారు.
అందువల్లే జిల్లాలో మరో ప్రధాన సామాజిక వర్గమైన కాళింగులకు మొండి చేయి చూపారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, పార్టీకి కష్టకాలంలో ఎదురొడ్డి పనిచేసినందుకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆశలు పెట్టుకున్నారు. గతంలో విప్ గా పని చేసిన అనుభవంతో ఈసారి తనకు కేబినెట్లో బెర్త్ ఉంటుందని భావించారు. కేంద్ర కేబినెట్లో వెలమ సామాజిక వర్గానికి చెందిన రామ్మోహన్నాయుడుకి అవకాశం ఇవ్వడంతో రాష్ట్ర కేబినెట్లో తప్పకుండా కాళింగులకు చోటు దక్కుతుందని, ఆ కోటాలో తనకే మంత్రి పదవి వస్తుందని భావించారు. ఇదే సామాజికవర్గానికి చెందిన బెందాళం అశోక్ కూడా మంత్రి పదవిని ఆశించారు. కాళింగుల్లో తామిద్దిరిలో ఒకరికి తప్పకుండా క్యాబినెట్ బెర్త్ లభిస్తుందని ఆశపడ్డారు.
2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కాళింగ సామాజిక వర్గానికి మూడు చోట్ల ఎమ్మెల్యేగా.. శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించింది. కానీ, ఎన్నికల్లో ఒకరే విజయం సాధించారు. గెలిచిన ఆ ఒక్క ఎమ్మెల్యే తమ్మినేని సీతారాంకు శాసనసభలో అత్యున్నతమైన స్పీకర్ పదవి ఇచ్చి గౌరవించారు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందిన దువ్వాడ శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. ఇచ్ఛాపురంలో ఓడిపోయిన పిరియా సాయిరాజ్ భార్య విజయకు జెడ్పీ చైర్‌పర్సన్ పదవి ఇచ్చింది. టెక్కలి శాసనసభకు పోటీ చేసి ఓటమి పాలైన పేరాడ తిలక్ కు రాష్ట్ర కాళింగ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. జిల్లాలో ప్రధానమైన వెలమ సామాజిక వర్గంతో సమానంగా వైఎస్‌ఆర్‌సీసీ హయాంలో కాళింగులకు పదవుల విషయంలో ప్రాధాన్యం దక్కింది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…