జమిలీ ఎన్నికలు అనేది బీజేపీ లక్ష్యం. ‘ఒక దేశం – ఒకే ఎన్నికలు’ అమల్లోకి తేవాలని అుకుంటోంది. మూడో సారి నాలుగు వందల సీట్లు రాగానే వంద రోజుల్లో దీనిపై చట్టం చేసేయాలనుకున్నారు. కానీ మిత్రపక్షాల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రభుత్వానికి ఇబ్బంది. జమిలీ ఎన్నికలు పెట్టాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. ఉభయసభల్లోనూ మూడింట రెండు వంతుల మెజార్టీ రావాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలపై ముందడుగు వేయడం అసాధ్యం.
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ముందు జమిలీ ఎన్నికలపై బీజేపీ అగ్రనేతలు హడావుడిచేశారు. కేంద్రం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృతవంలో ఉన్నత స్థాయి కమిటీని కూడా వేశారు. వెంటనే కమిటీ పని కూడా ప్రారంభిచింది. కమిటీ ప్రాథమిక నివేదికను మార్చి 15న నివేదికను సమర్పించింది. కానీ ఇంకా నిర్ణయంతీసుకోలేదు. మూడో సారి అధికారం చేపట్టగానే ప్రధాని మోదీ నూతన ప్రభుత్వానికి నిర్దేశించిన తొలి 100 రోజుల ఎజెండాలో ఇది కూడా భాగమే. తాజాగా కోవింద్ కమిటీ పూర్తి స్థాయి నివేదికను రాష్ట్రపతికి సమర్పించారు. కోవింద్ కమిటీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించిన నివేదికలో అనేక సిఫారసులు చేసింది. ముందుగా లోక్‌సభ, రాష్ర్టాల శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, అవి పూర్తయిన 100 రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని తెలిపింది.
మరోవైపు జమిలి ఎన్నికలపై లా కమిషన్ కూడా తన నివేదికను త్వరలోనే ఇవ్వనుంది. లా కమిషన్ నివేదికలో ఏముంటుందో కూడా ఇప్పటికే స్పష్టత ఉంది. రాజ్యాంగంలో ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ అనే అంశంపై కొత్త అధ్యాయాన్ని జోడించి, 2029 నాటికి దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించాలని లా కమిషన్ సిఫారసు చేయనుంది. జస్టిస్ రీతు రాజ్ అవస్తీ ఆధ్వర్యంలోని కమిషన్, ఏకకాల ఎన్నికలపై “కొత్త అధ్యాయం, భాగాన్ని” జోడించడానికి రాజ్యాంగంలో సవరణను సిఫారసు చేస్తుందని తెలిపాయి. 19వ లోక్‌సభకు ఎన్నికలు జరగనున్న 2029 మే-జూన్‌లో మొదటి ఏకకాల ఎన్నికలను నిర్వహించేందుకు వీలుగా వచ్చే ఐదేండ్లలో శాసన సభలను మూడు దశల్లో మార్చాలని సిఫారసు చేసినట్లుగా ఇప్పటికే లీకైంది.
రాజ్యాంగంలోని కొత్త అధ్యాయంలో లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలు, పంచాయతీలు, మునిసిపాలిటీలకు ఏకకాల ఎన్నికలు , ఏకకాల ఎన్నికల సుస్థిరత , కామన్ ఎలక్టోరల్ రోల్ కు సంబంధించిన అంశాలు ఉంటాయి. మూడు దశల్లో అసెంబ్లీలను జమిలీకి తీసుకు వస్తారు. అసెంబ్లీల కాల పరిమితి మూడు లేదా ఆరు నెలల కాలవ్యవధిని కుదించాల్సిన రాష్ట్రాల అసెంబ్లీలతో మొదటి దశ ఉంటుంది. అవిశ్వాసం కారణంగా ప్రభుత్వం పతనమైతే లేదా హంగ్ ఏర్పడితే, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కూడిన ఐక్య ప్రభుత్వాన్ని రాజ్యాంగాన్ని కమిషన్ సిఫారసు చేస్తుంది. ఐక్య ప్రభుత్వ ఫార్ములా పని చేయని పక్షంలో, మిగిలిన సభ వ్యవధిలో తాజా ఎన్నికలు నిర్వహించాలని లా ప్యానెల్ సిఫారసు చేస్తుంది. అలాగే పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా జమిలీ ఎన్నికలు నిర్వహించాలని సిఫార్సు చేసింది.
అయితే జమిలీ ఎన్నికలను ప్రాంతీయపార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే.. జమిలీ ఎన్నికలు ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయడానికే పెడుతున్నారనేది ఆయా పార్టీల వాదన. దేశంలో ఇప్పటి వరకూ జరిగిన జమిలీ ఎన్నికల్లో కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ.. ఒకే పార్టీ గెలిచిన సందర్భాలు 77 శాతం ఉన్నాయి. జమిలీ ఎన్నికలు జరిగితే.. రెండు ఓట్లు ఒకే పార్టీకి వేసే సంప్రదాయం భారత ఓటర్లలో ఉందని.. దాన్ని క్యాష్ చేసుకోవడానికే బీజేపీ.. జమిలీ ఎన్నికలకు వెళ్తోందనేది.. ఆయా పార్టీల అభిప్రాయం. అందుకే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.అంతే కాదు గతంలో ఉన్న బలం ఇప్పుడు బీజేపీకి లేదు. సంకీర్ణాన్ని నడుపుతున్నారు. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రభుత్వానికి ఇబ్బంది. జమిలీ ఎన్నికలు పెట్టాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. ఉభయసభల్లోనూ మూడింట రెండు వంతుల మెజార్టీ రావాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలపై ముందడుగు వేయడం అసాధ్యమేనని జాతీయ రాజకీయాలను నిశితంగా పరిశీలించేవారు అంచనా వేస్తున్నారు.
నాలుగు వందల సీట్లు ఎన్డీఏకు వస్తే చాలా చేయాలని బీజేపీ అనుకుంది. కానీ ఓటర్లు మాత్రం.. అంత దూకుడు వద్దని కట్టడి చేశారు. ఇప్పుడు జమిలీ ఎన్నికలు దాదాపు అసాధ్యమని అనుకోవచ్చు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…