తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. గులాబీ పార్టీపై కష్టాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తీరు బీఆర్ఎస్కు తలనొప్పిగా మారింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు ఆ పార్టీ తరపునే గుత్తా మండలి ఛైర్మన్ అయ్యారు. కాని ఇటీవలి పరిణామాల కారణంగా మండలి ఛైర్మన్ మీద అవిశ్వాసం పెట్టాలని కారు పార్టీ ఆలోచిస్తోంది. అసలు అవిశ్వాసం సాధ్యమవుతుందా? ఒకవేళ సాధ్యమైనా బీఆర్ఎస్ సభ్యులు మండలి ఛైర్మన్‌ను గద్దె దించగలుగుతారా? అసలు గులాబీ బాస్ వ్యూహం ఏంటి?
తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావంతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పదేళ్ళ తర్వాత అధికారాన్ని కోల్పోయింది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం అయినా..శాసనమండలిలో మాత్రం మెజారిటీ సీట్లు గులాబీ పార్టీకే ఉన్నాయి. గత ఏడాది రెండోసారి ఎమ్మెల్సీ అయిన గుత్తా సుఖేందర్‌రెడ్డికి మరోసారి మండలి చైర్మన్ పదవి ఇచ్చారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో ఇప్పుడు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తీరు గులాబీ పార్టీ నాయకత్వానికి చికాకుగా మారింది. ఒకప్పుడు పార్టీలో చాలా యాక్టివ్‌గా ఉండే గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇప్పుడు అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీనికీ ఓ కారణం ఉంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడు అమిత్‌కి అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాలని కేసీఆర్‌ను గుత్తా సుఖేందర్‌రెడ్డి కోరారు. దీనికి కేసిఆర్ కూడా సుముఖత వ్యక్తం చేశారు. తీరా ఎన్నికలు సమీపించే నాటికి నల్లగొండ జిల్లా బీ ఆర్ ఎస్ నేతలు గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడికి అడ్డుపడ్డారు. దీంతో ఆయనకు టికెట్ రాకుండా పోయింది. ఆ తరవాత గుత్తా కుమారుడు అమిత్‌రెడ్డిని కాంగ్రెస్ నేతలు కలిశారు. ఆ వెంటనే ఆయన రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కుమారుడు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో గుత్తా సుఖేందర్‌రెడ్డి గులాబీ పార్టీలో గతంలో మాదిరిగా పాల్గొనడం మానేశారు. ఆయన చూపులు కూడా పక్క పార్టీపై ఉండటంతో బీ ఆర్ ఎస్ నాయకత్వం తక్షణ కర్తవ్యంపై ఫోకస్ పెట్టింది.
శాసనమండలి ఛైర్మన్ పై అవిశ్వాసం పెట్టి ఆయన్ను గద్దె దించాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నట్లు తెలంగాణ భవన్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మండలిలో పూర్తి స్థాయి మెజరిటీ బీ ఆర్ ఎస్ కు ఉంది. మండలిలో మొత్తం సభ్యులు 40 మంది కాగా..బీ ఆర్ ఎస్ కు 28.. కాంగ్రెస్ పార్టీకి ఆరుగురు మాత్రమే ఉన్నారు. గవర్నర్ కోటా స్థానాలు రెండూ ఖాళీగా ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో మండలి ఛైర్మన్‌పై బీ ఆర్ ఎస్ అవిశ్వాసం పెడుతుందనే వార్తలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్నాయి.
గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ లోనే ఉన్నా ఆయన వల్ల వచ్చిన లాభం ఏమీ లేదని అందుకే అవిశ్వాసం పెడితే ఎలా ఉంటుందనే చర్చ తెలంగాణ భవన్లో జరుగుతోంది. శాసన సభలో కాంగ్రెస్ కు బలం ఉన్నా.. మండలిలో హస్తం పార్టీకి ఉన్న సభ్యులు చాలా తక్కువ. అయితే బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీలు సగం మందికి కాంగ్రెస్ పార్టీ గేలం వేస్తున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఒక వేళ కాంగ్రెస్ ప్రయత్నాలు సక్సెస్ అయితే మండలిలో అధికార పార్టీ బలం భారీగా పెరుగుతుంది. బీఆర్ఎస్ మెజారిటీ నుంచి మైనారిటీకి పడిపోతుంది. ఈ నేపథ్యంలోనే అవిశ్వాసం పై చర్చ జరుగుతోంది.
అవిశ్వాసం పైన చర్చ జరుగుతున్న వేళ బలాబలాలు పరిశీలించుకుంటున్నాయి పార్టీలు. అవిశ్వాసం నెగ్గాలంటే మండలిలో ఉన్న సభ్యుల్లో సగం మంది మద్దతు కావాలి. మెజారిటీ పార్టీల మద్దతు కూడా కావాలి. అందరూ ఒప్పుకొని తమకే ఓటు వేస్తే సరే.. లేదంటే పరిస్థితి ఏంటనేది బీ ఆర్ ఎస్ బేరీజు వేసుకుంటోంది. అధికారం కోల్పోయి..పార్లమెంట్ ఎన్నికల్లో జీరో ఫలితాలతో డీలా పడ్డ గులాబీ పార్టీ మండలిలో తనకున్న మెజారిటీని ఎలా కాపాడుకుంటుంది?గుత్తా సుఖేందర్‌రెడ్డిని దించగలిగితే బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజం వస్తుంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…