కేటీఆర్ వర్సెస్ హరీష్ – ఏం జరుగుతోంది..?

By KTV Telugu On 20 June, 2024
image

KTV TELUGU :-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ వీకైపోయారా, సైడోపోయారా. అసలు డీలా పడిపోయారా. ఎన్నికల తర్వాత ఆయన సైలెంట్ అయిపోవడానికి కారణం ఏమిటి. కేటీఆర్ ను పదవి  నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతోందా. అటువంటి ప్రయత్నాల్లో హరీష్ రావు పాత్ర ఉందా. అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కేటీఆర్ వైదొలగాల్సి వస్తే ఎవరికి  వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారనే చర్చ కూడా సామాజిక మాధ్యమాల్లో ఊపందుకుంది..ఆ ప్రక్రియలో హరీష్ రావు కీలక బాధ్యత పోషిస్తారని కూడా తెలుస్తోంది…

రాష్ట్రం ఏర్పాటైన తర్వాత  వరుసగా రెండు సార్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్.. తాజాగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిని చవిచూసింది. లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదు. ఒక ఉద్యమ పార్టీకి ఇంతటి దీనస్థితి ఎందుకు వచ్చిందన్న చర్చ కూడా జరుగుతోంది. కేసీఆర్, కేటీఆర్ దిశానిర్దేశంలో ఏదో లోపం ఉందనే అనుమానాలకు కూడా తావిచ్చింది. ఈ క్రమంలో ఆ పార్టీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టిందనే చర్చ ఆ పార్టీ నేతల్లో మొదలైంది. తిరిగి ప్రజలకు దగ్గరయ్యేందుకు, వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పటిష్టం చేసేందుకు ఇప్పటి నుంచే బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టిందనే టాక్. ఒకటి రెండు రోజుల్లోనే కేసీఆర్ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి పార్టీ  పరిస్థితిని సమీక్షిస్తారని చెబుతున్నారు. ఈ లోపు కేటీఆర్ బయట ఎక్కువగా కనిపించకుండా  చూసుకున్నారు. ఇదీ వ్యూహాత్మక మౌనమా, అనివార్య మౌనమా అన్నది కూడా తెలియాల్సి ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కంటే కూడా ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఎక్కువ యాక్టివ్ గా కనిపిస్తున్నారు. రేవంత్ ప్రభుత్వాన్ని ఎండగట్టే విషయంలో పార్టీలోని ఇతర నేతల కంటే ఆయన ముందున్నారనేది ఇప్పుడు బీఆర్ఎస్ లో నడుస్తున్న టాక్…..

కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తీసుకున్నప్పటి నుంచి కాలం కలిసి రాలేదన్న టాక్ కొంతకాలంగా ఉన్నది. ఆయన స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నారట. కేటీఆర్, హరీష్ రావు మార్గదర్శక మండలి తరహాలో వ్యవహరిస్తూ అందరికీ అందుబాటులో ఉండాలన్నది ఒక ఆలోచన.కాకపోతే  ఆ దిశగా హరీష్ రావుకు ఎక్కువ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.

ఉద్యమకారులు, యూత్‌కు పార్టీలో ప్రయారిటీ ఇచ్చి బహుజన సిద్ధాంతాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. పార్టీ అధినేత కేసీఆర్ ఏం చేయాలనుకుంటున్న దానిపై ఇంకా స్పష్టత రాకపోయినా పార్టీలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేటీఆర్‌ను తప్పించి హరీశ్‌రావుకు పార్టీ బాధ్యతలు అప్పజెప్పాలంటూ సోషల్ మీడియా వేదికగా పార్టీ శ్రేణుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఆ క్రమంలో హరీష్ రావుకు వర్కింగ్  ప్రెసిడెంట్  పదవి ఇవ్వకుండా ప్రాధాన్యం పెంచాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా మరో సమాచారం. కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తప్పిస్తే ఆ స్థానంలో ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండే విధంగా చూసుకుంటారని తెలుస్తోంది. దళిత నేత, మాజీ ఐపీఎస్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్  తో పాటు మరో బీసీ నేతకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని అలా జరిగితే పార్టీకి వెనుకబడిన వర్గాల పక్షపాతిగా పేరు వస్తుందని ఎదురుచూస్తున్నారు. కుటుంబ పార్టీ అన్న ముద్ర నుంచి బయట పడేందుకు కూడా ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. పార్టీ పోలిట్ బ్యూరోను పునరుద్ధరించి హరీష్ రావు, కేటీఆర్ కు అందులో అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ హరీష్ రావు నిత్యం వార్తల్లో  ఉంటున్నారు. ఇకపై కూడా అదే ట్రెండ్ ను కొనసాగించాలని ఆయనకు ఆదేశాలు అందాయి. ఉద్యమకాలం నుంచి కూడా హరీష్ రావు బలమైన నాయకుడిగా పేరు పొందారు. ఆయనతో పోల్చుకుంటే కేటీఆర్ లేటుగా ఎంట్రీ ఇచ్చారు.  క్షేత్రస్థాయిలో హరీష్ రావుకు మంచి పలుకుబడి ఉంది.పార్టీ అధికారంలో లేకపోయినా హరీష్ రావు పరపతి ఏ మాత్రం  తగ్గలేదు. అందుకే మళ్లీ ఎన్నికల్లో గెలిచే వరకు ఆయనకు తగిన ప్రాధాన్యంతో పాటు ఫ్రీ  హ్యాండ్ ఇవ్వాలనే గులాబీ దళపతి  నిర్ణయించుకున్నారు. ఆ విషయంలో కేటీఆర్ కాస్త వెనుకబడిపోక తప్పదు…..

పార్టీని పూర్తిగా దెబ్బతినకుండా కాపాడుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. దానికి కొంత చాణక్యం కూడా అవసరం. ఆ మేరకు  వ్యూహాత్మక  ముందడుగు  వేసే పరిస్థితి కేటీఆర్ దగ్గర లేదని తేలిపోయింది. అందుకు కేసీఆర్ ఇప్పుడు బహుముఖ వ్యూహంతో ముందుకు కదులుతున్నారు. కొత్త వర్కింగ్  ప్రెసిడెంట్లను పెట్టుకుని, హరీష్ రావుకు ప్రాధాన్యం పెంచడం  ఇందులో భాగమవుతోంది. ఆ పని జూలైలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల  లోపు పూర్తవుతుందని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి…..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి