రేవంత్ రెడ్డిపై అన్ని రకాల ఒత్తిడి…

By KTV Telugu On 21 June, 2024
image

KTV TELUGU :-

తెలంగాణ కేబినెట్లో  ఎవరికి వారే యమునా తీరే అన్న పరిస్థితి కనిపిస్తోంది. సీఎం రేవంత్  రెడ్డిని లెక్క చేయకుండా మంత్రులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఆర్థిక అంశాలను లెక్క చూసుకోకుండా ఇష్టానుసారం ప్రకటనలు చేసే మంత్రులను ఎలా కట్టడి చేయాలో అర్థం  కాక సీఎం తలపట్టుకుంటున్నట్లు చెబుతున్నారు.  మరో పక్క సీఎంఓకు తెలియకుండానే  క్షేత్రస్థాయిలో పనులు జరిగిపోవడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అసలు సీఎం మంత్రుల మధ్య  సమన్వయం ఉందా లేదా అన్న అనుమానాలు వస్తున్నాయి. మంత్రులు రేవంత్ ను లెక్క చేయడం లేదన్నది మరో టాక్….

ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీల అమలుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇప్పటికే రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి కసరత్తు చేస్తున్నారు. అర్హులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మరోవైపు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ప్రతినెలా 2,500 రూపాయలు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ అంశంపై మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. అర్హులైన మహిళల ఖాతాల్లో ప్రతినెలా 2,500 చొప్పున త్వరలో జమ చేస్తామని ప్రకటించారు. ఇల్లు లేని పేదలకు సొంత ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు చెల్లిస్తామని తెలిపారు. ఇలాంటి ప్రకటనల్లో తప్పేం లేదు. ఎన్నికలప్పుడు ఇచ్చే హామీలను  అమలు  చేసే దిశగా ప్రకటనలు ఇవ్వడం సర్వసాధారణమైన విషయమని మరిచిపోకూడదు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఆగస్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. దాదాపు 30 వేల కోట్లు సమీకరించడం ఎలాగో తెలియక ఆయనతో పాటు ఆర్థిక శాఖ అధికారులు తలపట్టుకు కూర్చున్నారు. ఈ పరిస్థితుల్లో మిగతా హామీలను గుర్తు చేసి జనానికి ముఖ్యంగా మహిళలకు ఆశ పెట్టడం కరెక్టు కాదన్నది సీఎం భావన. ఆ సంగతిని  అర్థం చేసుకోకుండా సీతక్క లాంటి మంత్రులు తమ ఇష్టానుసారం ప్రకటనలు ఇస్తున్నారు. ప్రతీ మహిళ ఖాతాలో నెలకు రెండున్నర వేలు వేయడం మామూలు విషయం కాదని  మంత్రులకు తెలుసు.ఐనా సరే వ్యక్తిగత పరపతి  కోసం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు….

కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు అసలు, వడ్డీ కట్టలేక సీఎం రేవంత్ కష్టాల  పాలవుతున్నారు.హాయిగా నిద్రపోలేని పరిస్తితిని ఎదుర్కొంటున్నారు. ఆ సంగతి అర్థం చేసుకుని సహకరించాల్సిన మంత్రులు క్షేత్రస్థాయిలో కొత్త ఇబ్బందులను తెచ్చిపెడుతున్నారు.అనవసరమైన అంశాల జోలికిపోతూ వివాదాలు సృష్టిస్తున్నారు…

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే నాటికే రాష్ట్ర అప్పులు భారీగా పేరుకుపోయాయి. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వివరించింది.  బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అప్పుల తాలూకు అసలు, వడ్డీలను చెల్లించడానికి కాంగ్రెస్‌ సర్కారు ఆపసోపాలు పడుతోంది. ఆ రుణాలకు అసలు, వడ్డీ కింద రోజుకు 191 కోట్లు చెల్లించాల్సి వస్తోంది.బడ్జెట్‌ అప్పులు, వివిధ కార్పొరేషన్లకు గ్యారెంటీల పేర తీసుకున్న అప్పులు కలిపి మొత్తం 6,71,757 కోట్లు పేరుకుపోయాయి. వాటికి తోడు రేవంత్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత మరో పాతికవేల కోట్లు అప్పులు చేసింది. వాటిని తిరిగి చెల్లిస్తూ, రోజు వారీ ఖర్చు, నెల జీతాలు పెన్షన్లు చెల్లించేందుకు  రేవంత్ ప్రభుత్వం ఆపసోపాలు పడుతుంటే… మంత్రులు ఇష్టానుసారం వ్యవహరిస్తూ కొత్త తగవులకు పోతున్నారు. ఇటీవల జరిగిన ఒక ఘటన.. కొన్ని వర్గాల్లో ప్రభుత్వం పట్ల అనుమానాలకు తావిచ్చింది. ఏపీ మాజీ సీఎం జగన్ .. లోటస్ పాండ్ నివాసం దగ్గర అక్రమ  కట్టడమంటూ రెండు గదులను కూల్చివేయడం అనేక ప్రశ్నలను లేవనెత్తింది. సీఎంకు మాటమాత్రమైనా చెప్పకుండా ఆక్రమణ తొలగించడం వెనుక ఒక మంత్రి ఉన్నారన్న చర్చ మొదలైంది. అంతలోనే సొంత పెత్తనం చేసి ఆక్రమణలను  కూలగొట్టారంటూ ఒక ఐఎఎస్ అధికారిని బదిలీ చేశారు. ఆ అంశంలో మరో మంత్రి హస్తం ఉన్నట్లు సీఎంఓ గుర్తించింది. ఇంత జరుగుతున్నా సీఎం మాత్రం నోరు మెదపలేకపోతున్నారు.

రేవంత్ పరిస్థితి కత్తిమీద సాములా తయారైంది. ఎవరిని నొప్పించకుండా, తాను ఇబ్బంది పడకుండా నడుచుకోవాల్సిన అనివార్యతలో ఆయన ఉన్నారు. అధిష్టానం వద్దకు ఫిర్యాదులు వెళ్లకుండా చూసుకంటూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఐనా అర్థం చేసుకోకుండా మంత్రులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు…. ఏం చేయాలి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి