పట్టుకుంటే పది కోట్లు…

By KTV Telugu On 22 June, 2024
image

KTV TELUGU :-

అమరావతి దశ మారింది. కూటమి గెలుపుతో మహర్దశ ఖాయమైంది. రైతుల ఉద్యమ స్ఫూర్తితో అమరావతి మళ్లీ పట్టాలెక్కుతోంది.  అంతకు మించి అక్కడ భూములు రేట్లు చుక్కలనంటుతున్నాయి. ఎకరం కోటి అన్న వాళ్లే ఇప్పుడు పది కోట్ల రూపాయలు చెప్పే స్థితికి తమ రేంజ్ పెంచేసుకున్నారు. పైగా రెండు నెలల్లో కొనుక్కుంటే మంచిది..తర్వాతైనా ఎంతైనా  పెరగొచ్చన్న ప్రచారం మొదలైంది. రాజధానికి చుట్టూ యాభై కిలోమీటర్ల రేంజ్ లో ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి.. భూములున్న వారికి ఇదీ సంతోషకరమైన  విషయమే అయినా.. మధ్యతరగతి  వర్గానికి భవిష్యత్తుల్లో ఇబ్బందులు తప్పవన్న చర్చ కూడా జరుగుతోంది…..

కూటమి గెలుస్తుందన్న నమ్మకంతో ఎన్నికల ఫలితాలు రాకముందే ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ బూమ్ మొదలైంది. ఏప్రిల్ 13న పోలింగ్  పూర్తయిన వెంటనే ఓటరు  నాడిని అర్థం చేసుకున్న రియల్టర్లు రేట్లు పెంచేశారు. అలాగే భూములున్న వాళ్లు  కూడా కొత్త కొత్త రేట్లు చెబుతూ ఇప్పుడే విక్రయించబోమని ప్రకటించేశారు.ఎందుకైనా మంచిదని కొందరు  క్రయవిక్రయాలకు దిగారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి  రిజిస్ట్రేషన్ల ద్వారా ఏటా దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు వస్తుంటే.. మే తొలి పక్షంలో అందులో 15 నుంచి 20 శాతం వచ్చేసినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో ఇక ఐదేళ్ల పాటు రియల్ బూమ్ ఖాయమని నిర్థారించుకుని ఇప్పుడే కొనుక్కునే వారి సంఖ్య పెరిగింది. ఇదీ ఒక కోణమైతే అమరావతి కోర్ క్యాపిటల్ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల కూడా రేట్లు పెరిగాయి. జగన్ రెడ్డి మూడు రాజధానులు ప్రకటన  చేసి విశాఖపై దృష్టి పెట్టిన తర్వాత ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా  దెబ్బతిన్నది. పొలాలు కొనేవారు కూడా లేకుండా  పోయారు. చంద్రబాబు గెలిచిన తర్వాత ఇప్పుడు రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలంలో ఎకరం పది కోట్లు వరకు  చెబుతూ ఇప్పుడే అమ్మబోమంటూ రైడర్ వదులుతున్నారు. అక్కడ అర ఎకరం పొలం ఉన్న వారికి  కూడా ఇక ఆర్థికంగా తిరుగుండదని చెబుతున్నారు. ఇక  15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే చోట్ల కూడా 3 నుంచి 5 కోట్లు పలుకుతుంది. అమరలింగేశ్వరస్వామి ఆలయం వెలిసిన గుడి అమరావతి ప్రాంతంలో ఎకరం ఇప్పుడు కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకు వెళ్లిపోయింది. గతేడాది వరకు అక్కడ పొలం కొనేవాళ్లు లేరని  చెబుతున్నారు….అటు విజయవాడ సిటీలో కొనడానికి  చోటే లేదంటున్నారు. ఒకటి రెండు సంవత్సరాల్లో అభివృద్ధి గన్నవరం  దాటి పోతుందని రియల్టర్లు లెక్కలేస్తున్నారు. పల్నాడులో చిలకలూరిపేట, పిడుగురాళ్ల వరకు రేట్లు అమాంతం  పెరిగిపోయే అవకాశాలే ఉన్నాయి.

సీఎం చంద్రబాబు నిర్ణయాలు ఎలా ఉంటాయోనని రాజధాని రైతులు  ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అమరావతి నిర్మాణాన్ని ప్రభుత్వం స్పీడ్ పెంచితే తమకు ప్రయోజనం ఉంటుందని వారు అంటున్నారు. జగన్ రెడ్డి ఓడిపోయినందుకు సంతోష పడటం ఒక వంతయితే, అమరావతి ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందన్న అనుమానం మరో వంతు అని చెప్పాలి….

గత ఐదేళ్లుగా అమరావతి రైతులు నీరసంగా, డీలాగా  పడి ఉన్నారు. తమ భవిష్యత్తు అంధకారంలోకి  దిగిపోయిందని ఆవేదనలో మగ్గిపోయారు.ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత  వారిలో ఆశలు చిగురించాయి. 29 వేల ఎకరాల భూములను ధారాదత్తం  చేసిన రైతులకు జగన్ రెడ్డి ఎగవేసిన  కౌలు, నేడో రేపో జమకానుంది. అమరావతిని  డెవలప్ చేసి రైతులకు త్వరగా రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తే.. వారు కోటీశ్వరులవుతారు. రైతులు అప్పగించిన ప్రతీ ఎకరాకు వెయ్యి గజాలు ఇస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు గజానికి యాభై వేలు లెక్క వేసుకున్నా…ప్రతీ ఒక్కరికి కనిష్టంగా ఐదు కోట్ల రూపాయల ప్రయోజనం  కలుగుతుంది. అందుకే అమరావతి పనులు త్వరగా పూర్తి కావాలని వాళ్లు ఆకాంక్షిస్తున్నారు. రిటర్నబల్ ప్లాట్లలో రియల్ ఎస్టేట్ డెవలప్ అయితే అమరావతి రూపు రేఖలు కూడా మారిపోయారు. టోక్యో, బీజింగ్ స్ఠాయిలో అత్యాధునిక నగరం అక్కడ దర్శనమిస్తుంది. బహుళ అంతస్తుల భవనాలతో సర్వాంగ సుందరంగా కనిపిస్తుంది…

నవ్యాంధ్రప్రదేశ్ సరికొత్త రాష్ట్రంగా మారే  సమయం వచ్చేసింది. అమరావతే ఏకైక రాజధాని అని నిర్ధారణ అయిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెట్టబోతోంది. ఈ క్రమంలో భూములున్న వారికి కాసుల పంట ఖాయమే అయినా కొనుక్కునే వారు ముందు వెనుక ఆలోచించి నిర్ణయించుకుంటే మంచిదని చెప్పక తప్పదు. నిదానమే ప్రధానం అంటే అదే మరి…..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి