ఏపీ మంత్రివర్గంలో ఉభయ గోదావరి జిల్లాల్లోని ఎస్సీ నియోజకవర్గాలకు అన్యాయం జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతవరకు అన్ని ప్రభుత్వాలు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో సామాజికవర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చాయి. కొత్తగా ఏర్పడిన చంద్రబాబు క్యాబినెట్లోనే ఈ రెండు జిల్లాల పరిధిలో ఒక్క ఎస్సీ ఎమ్మెల్యేకు కూడా మంత్రి పదవి దక్కలేదు. రెండు జిల్లాల్లోని మొత్తం ఏడు అసెంబ్లీ సీట్లు కూటమి దక్కించుకుంది. కాని ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. ఇప్పుడిదే ఈ జిల్లాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
గోదావరి జిల్లాల్లో పార్టీ ఏదైనా కులాల ప్రాదిపదికనే ఎన్నికల్లో అభ్యర్ధులకు సీట్లు కేటాయింపు…సామాజిక వర్గాల వారీగానే గెలిచిన అభ్యర్ధులకు క్యాబినెట్ లో ప్రాధాన్యత కల్పించడం దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. ఇదే పద్దతిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక కాపు, ఒక బీసీ, ఒక ఎస్సీ ఎమ్మెల్యేకు క్యాబినెట్ లో స్థానం కల్పిస్తూ వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, విభజన తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం, ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వంలో కూడా ఇలాగే మంత్రివర్గంలో బెర్త్‌లు దక్కాయి.
అయితే ఈసారి పరిస్ధితిలో పూర్తిగా మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. కూటమి అభ్యర్థులే అన్ని నియోజకవర్గాల్లోనూ విజయం సాధించినా ఏ ఒక్కరినీ పరిగణలోకి తీసుకోకపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఉన్న మొత్తం ఏడు రిజర్వ్ నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్ధులే విజయం సాధించారు. అయితే వీరిలో ఏ ఒక్కరికీ చంద్రబాబు క్యాబినెట్ లో స్థానం దక్కకపోవడంతో ఎస్సీ వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి.
2014లో విభజిత ఆంధ్ర ప్రదేశ్ లో పాలన సాగించిన టీడీపీ క్యాబినెట్ లో ఎస్సీలకు స్థానం దక్కింది, పశ్చిమ గోదావరిజిల్లా కు చెందిన పీతల సుజాత, తరువాత జవహర్ చంద్రబాబు క్యాబినెట్ లో పనిచేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ కోనసీమ నుంచి విశ్వరూప్ కు మంత్రిపదవి కేటాయించడంతోపాటు మహిళలకు పెద్దపీట వేస్తూ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నుండి విజయం సాధించిన తానేటి వనితకు క్యాబినెట్ లో హోంమంత్రిత్వ శాఖ కేటాయించారు.
మంత్రి వర్గ విస్తరణలో మిగిలిన మంత్రులను రెండున్నరేళ్లకు మార్చినా, ఎస్సీ మంత్రులను మాత్రం ఐదేళ్లపాటు క్యాబినెట్ లో కొనసాగించారు వైఎస్ జగన్. కూటమి ఆధ్వర్యంలో ఏర్పడిన చంద్రబాబు క్యాబినెట్ లో తొలిసారిగా ఉభయ గోదావరి జిల్లాల్లోని ఎస్సీ ఎమ్మెల్యేలకు ఏమాత్రం ప్రాధాన్యత లభించలేదు. పిఠాపురంలో విజయం సాధించిన పవన్ కళ్యాణ్, తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నుంచి గెలిచిన జనసేన అభ్యర్ధి కందుల దుర్గేష్ లకు మాత్రం కాపు కోటాలో క్యాబినెట్ లో స్థానం కల్పించారు. కోనసీమలో బీసీ క్యాటగిరీలో రామచంద్రాపురం నుంచి గెలిచిన వాసంశెట్టి సుభాష్ కు మాత్రమే క్యాబినెట్ బెర్త్ ఇచ్చారు.
అన్ని సామాజికవర్గాలను సమతౌల్యం చేస్తూ ఎస్సీలకు కూడా క్యాబినెట్ లో సమాన ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉన్నా, పట్టించుకోకపోవడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. రిజర్వ్ నియోజకవర్గాలనుంచి గెలిచిన వారిలో నలుగురు టీడీపీ, మూడు స్థానాల్లో జనసేన అభ్యర్ధులున్నారు. వీరంతా తమరిలో ఒక్కరికైనా క్యాబినెట్ బెర్త్ దక్కుతుందని భావించారు. అయితే అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ, ఒక్కరిని కూడా చంద్రబాబు గుర్తించకపోవడం వీరిని తీవ్ర నిరాశకు గురిచేస్తోందని సమాచారం.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…