మాయా రుణమాఫీ

By KTV Telugu On 23 June, 2024
image

KTV TELUGU :-

రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నట్లుగా  తెలంగాణ సర్కార్ ప్రకటించింది. విధివిధానాలు ప్రకటించలేదు. తినబోతూ రుచి ఎందుకని కామెంట్ చేసి రేవంత్ రెడ్డి తప్పించుకున్నారు. కానీ ఇక్కడే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు రుణమాఫీ ఎలా చేయబోతున్నారు.. ఎవరికి చేయబోతున్నారు.. నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి .. ఒకే సారి చేస్తారా.. విడతల వారీగా చేసి… రైతు భరోసాలాగా పడినప్పుడు తీసుకోండి.. లేకపోతే లేదు అనుకునేలా చేస్తారా అన్నదానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఏమీ చెప్పకుండా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించడంతో రైతుల్లోనూ నమ్మకం కలగడం లేదు.

రైతులు తీసుకున్న  2 లక్షల వరకు వ్యవసాయ రుణాలను కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల హామీ మేరకు 2024 ఆగస్టు 15లోగా ఒకే విడతలో మాఫీ చేయాలని తెలంగాణ మంత్రివర్గం శుక్రవారం నిర్ణయించింది. 2018 డిసెంబర్‌ 12 నుంచి 2023 డిసెంబర్‌ 9 మధ్య కాలవ్యవధిలో తీసుకున్న వ్యవసాయ రుణాలకు మాత్రమే రుణమాఫీ వర్తించనుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో ఆర్థిక శాఖ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. రుణమాఫీ అమలుకు  .31 వేల కోట్ల అవసరమవుతాయని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది.

మీడియా సమవేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి రుణమాఫీకి అర్హత కలిగిన రైతుల జాబితాలు బ్యాంకుల నుంచి సేకరించాల్సి ఉందని  చెప్పుకొచ్చారు. అయినా   31 వేల కోట్లు అవసరమవుతుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు చెప్పారు. గత పదేళ్లలో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం విడతలు విడతలుగా  28 వేల కోట్ల వ్యవసాయ రుణాలను మాత్రమే మాఫీ చేసిందని తాము ఒకే విడతలో 31వేల కోట్లు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. కానీ విధి విధానాలు, నిధుల లభ్యత గురించి ప్రకటించకపోవడంతో అనేక అనుమానాలు ప్రారంభణయ్యాయి.

కోతల కోసం చాలా కసరత్తు చేస్తున్నారని అనేక నిబంధనలు రెడీ చేశారని విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి.  ప్రస్తుతం తెలంగాణలో 66 లక్షలమందికి రైతుబంధు అందుతోంది. వాస్తవానికి వారంతా రుణమాఫీకి కూడా అర్హులు కావాల్సి ఉంది. వీరిలో 6 లక్షలమందికి పట్టాదారు పాస్ పుస్తకాలు లేవు, అంటే వారికి రుణమాఫీ లేదు. రేషన్ కార్డ్ ప్రాతిపదికగా తీసుకుంటే మరో 18 లక్షలమందికి రుణమాఫీ వర్తించదు. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపన్ను చెల్లించేవారిని కూడా పరిగణలోకి తీసుకుంటే మరో 2 లక్షల మందిని తీసేసినట్టే. చివరిగా 40లక్షలమందికే రుణమాఫీ వర్తిస్తుంది.  2లక్షలు ఒకేసారి మాఫీ చేస్తారా అనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. రైతులు మాత్రం ఒకేసారి మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం బంగారు తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను మాఫీ చేయలేదు. అంతకుముందు వైఎస్ హయాంలోని ప్రభుత్వం మాత్రం కొన్ని పరిమితులతో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను మాఫీ చేసింది. ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలకు రుణమాఫీని వర్తింపజేస్తుదా..? లేదా అని చర్చ జరుగుతోంది.  వైఎస్ హయాంలో చేసినట్లుగానే బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను సైతం మాఫీ చేయాలని రేవంత్ భావిస్తున్నారు. రుణమాఫీ కోసం పెద్ద ఎత్తున నిధుల అవసరం ఏర్పడటంతో కార్పోరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఈ రుణమాఫీ ప్రక్రియను కంప్లీట్ చేయాలని అనుకుంటోందని తెలుస్తోంది.

చివరిగా ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేస్తుంది, ఎంతమందికి అవకాశం ఇస్తుందనే దాన్నే  బట్టే రైతులకు మేలు జరుగుతుందా లేదా అన్నది తేలే అవకాశం ఉంది.   రుణమాఫీ కోసం 30అంశాలతో ప్రొఫార్మా రెడీ చేసిన ప్రభుత్వం జూలైలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఈ అంశంపై అధికారిక ప్రకటన చేసి పెద్దఎత్తున ప్రచారం చేసుకోనున్నట్లుగా తెలుస్తోంది.   రైతులకు లభించే ప్రయోజనం కన్నా ప్రచారం ఎక్కువైతే మొదటికే మోసం వస్తుంది. ఈపేరు చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో లాభం చూసుకుంటే… అసలుకే నష్టపోతారు.

రుణమాఫీ ఆషామాషీ కాదు. 31 వేలకోట్లు రైతులఖాతాల్లో జమ చేయడం చిన్న విషయం కాదు.  రేవంత్ ఓ రకంగా నిప్పుతో చెలగాటమాడుతున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి