ఉమ్మడి నిజామాబాద్ రాజకీయ రూపురేఖలు మారిపోతున్నాయి. బాన్సువాడ ఎమ్మెల్యే అయిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరికతో కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్ లోకి వెళ్లిపోయింది. బీఆర్ఎస్ పూర్తిగా డీలా పడిపోయింది.బీజేపీకి కూడా రేవంత్ రెడ్డి షాకిచ్చినట్లే అవుతోంది. అలాగని కాంగ్రెస్ పార్టీలో అంతా బంగారమే అన్నట్లుగా భావించకూడదు. అక్కడ కూడా లుకలుకలున్నాయి. బాన్సువాడతో పాటు ఉమ్మడి జిల్లాలో పార్టీ అంతర్గత విభేదాలు తారా స్థాయికి చేరే ప్రమాదముంది. కాంగ్రెస్ నేతలపై ఆగ్రహంతోనే పోచారం ఆ పార్టీలో చేరారని చెబితే విడ్డూరంగా ఉండొచ్చు, కాకపోతే అది పదహారణాల నిజం. అంతర్గత సమస్యలను రేవంత్ రెడ్డి ఎలా సరిదిద్దుతారనేది ఇప్పుడు పెద్ద సమస్య. ఎందుకంటే పోచారం రాక చాలా మందికి ఇష్టం లేదు…
చాపకింద నీరుగా కదిలిన నిజామాబాద్ రాజకీయం శుక్రవారం ఒక్కసారిగా బయటపడింది. కొన్ని గంటల వ్యవధిలోనే వేగం పుంజుకుని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆ సందర్భంగా శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరి చేరిక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పొలిటికల్ ప్రకంపనలు సృష్టిస్తోంది.ఎందుకంటే పోచారం చేరిక సాధారణ అంశం కాదని అర్థం చేసుకోవాలి. అందులో అనేక కోణాలు ఆవిష్కృతమై ఉన్నాయని చెబుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో పోచారం అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు. రాజధాని హైదరాబాద్ వరకు ఆయన ప్రాబల్యం కనిపిస్తోంది. పైగా పోచారం టీడీపీలో మంత్రిగా ఉండి తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ఐనా ఆయన అనుచరుల్లో చాలా మంది ఇప్పటికీ టీడీపీలో ఉన్నారు. ఆ సంగతి తెలిసే రేవంత్ రెడ్డి ఆయన్ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికల ముందే రేవంత్ ఒక ప్రొపోజల్ పెట్టినట్లుగా వార్తలు వచ్చాయి. బాన్సువాడ టికెట్ శ్రీనివాస్ రెడ్డి కుమారుడి భాస్కర్ రెడ్డికి ఇచ్చే విధంగా రేవంత్ రాయబారం నడిపారు. ఐతే బీఆర్ఎస్ గెలుస్తుందన్న నమ్మకంతో అప్పట్లో పోచారం కుటుంబం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లలేదు. ఇప్పుడు ఇక బీఆర్ఎస్ లో ఉండి లాభం లేదని నిర్ణయించుకుని ఆయన కాంగ్రెస్లో చేరిపోయారు. త్వరలో చాలా మంది టీడీపీ సానుభూతిపరులు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నుంచి కూడా గుంపులు ఎలాగూ రాబోతున్నాయి….
నిజామాబాద్ జిల్లా ముఖ్యంగా బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఓవరాక్షన్ చేస్తున్నారు. వారిని కట్టడి చేయడంతో పాటు బీజేపీ దూకుడును ఆపాలని రేవంత్ డిసైడయ్యారు. అయితే కాంగ్రెస్ కోసం దీక్షగా పనిచేసే వారికి మాత్రం అన్యాయం జరగదని ఆయన హామీ ఇస్తున్నారు…
పోచారం కారు దిగి చేయి అందుకోవడం వెనుక కాస్త కథ జరిగిన మాట వాస్తవం. బాన్సువాడ నియోజకవర్గంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, సీనియర్ నాయకుడు కాసుల బాల్‌రాజ్ కీలక నేతలుగా కొనసాగుతున్నారు. బాల్‌రాజ్‌కు కాంగ్రెస్ అధిష్ఠానం ఇటీవల నియామక పదవిని ఇచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూ రవీందర్‌రెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగారు. తాజాగా పోచారం కుటుంబ సభ్యులు పార్టీలో చేరడాన్ని రవీందర్‌రెడ్డి, కాసుల బాల్‌రాజ్ వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకించారు. లోక్‌సభ ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ మెజారిటీ సాధించింది.దాన్ని వాళ్లు ఒక లెక్కగా కూడా చూపించారు. నిజానికి పోచారం ఫ్యామిలీకి, ఏనుగు కుటుంబానికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఏనుగు రవీందర్ రెడ్డి కూడా గతంలో బీఆర్ఎస్లో పనిచేశారు. తర్వాత కాంగ్రెస్లో చేరి పోచారంపై పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో గత ఆరు నెలలుగా ఆయనే ఎమ్మెల్యే స్థాయిలో కలరింగ్ ఇస్తున్నారు. అధికారులను బెదిరించే మేనేజ్ చేస్తున్నారు. ఏదైనా పని జరగాలంటే ఎమ్మెల్యే పోచారం దగ్గరకు కాకుండా ఏనుగు రవీందర్ రెడ్డి దగ్గరకు వెళ్లాలని జనం చెప్పుకునే స్థాయికి ఆయన డామినేట్ చేస్తున్నారు. దానితో తన పరపతి పడిపోతోందని పోచారం భయపడిపోయి కాంగ్రెస్ లో చేరే ప్రక్రియను వేగవంతం చేశారని చెబుతున్నారు. ఇకపై ఏనుగు రవీందర్ రెడ్డిని కట్టడి చేసే ప్రక్రియను కూడా పోచారం ప్రారంభించాల్సి ఉంటుంది. మరో పక్క పోచారం చేరికతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ నొచ్చుకునే అవకాశం ఉందని కొన్ని వర్గాల్లో వినిపిస్తున్నప్పటికీ అలాంటిదేమీ లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇంతవరకు కామారెడ్డి స్ట్రాంగ్ మేన్ గా ఉన్న షబ్బీర్ అలీ..ఇప్పుడు నిజామాబాద్ నగరాన్ని తన కార్యక్షేత్రంగా మార్చుకున్నారు. అక్కడే పెద్ద స్థలం కొని ఇల్లు కట్టుకుని సెటిలైపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ఇక జిల్లాలో కాంగ్రెస్ ప్రత్యర్థులంటే నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేరు గుర్తుకు వస్తుంది. ఫైర్ బ్రాండ్ అయిన అర్వింద్ కు చెక్ పెట్టేందుకు కూడా పోచారం ఫ్యామిలీ సేవలు ఉపయోగపడతాయని రేవంత్ రెడ్డి అంచనా వేసుకున్నారు…
బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేతగా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నమ్మిన వ్యక్తిగా పేరొందిన పోచారం పార్టీ మారడం నిజామాబాద్ ఉమ్మడిజిల్లాలో సంచలనంగా మారింది. ఇటీవల కామారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో రెండుపడక గదుల ఇళ్ల బిల్లులు చెల్లించకపోతే లబ్ధిదారులతో కలిసి ఆందోళన చేస్తానని పోచారం ప్రభుత్వాన్ని హెచ్చరించారు.అయితే జిల్లా మంచి కోసమే ఆయన కాంగ్రెస్ లో చేరారని అనుచరులంటున్నారు. సిద్దాపూర్, జాకోరా, చండూర్ ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. ప్రభుత్వ మద్దతు లేకుంటే ఇవి పూర్తయ్యే పరిస్థితి లేదు. అలాంటి పనుల కోసమే ఆయన చేరారన్నది వారి వాదన. లాంగ్ రన్ లో ఏం జరుగుతుందో చూడాలి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…