జగన్ రెడ్డి నేలకు దిగారు. ఆయన పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా ఆ పార్టీకి రాలేదు. ఐనా జగన్ తీరులో మార్పు రాలేదు. పాత పోకడలను వదులుకోలేదు. నేను చెబుతా మీరు వినండి అన్న ధోరణిలోనే ఆయన రాజకీయాలు చేస్తున్నారు. జగన్ ముందు మాట్లాడేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇప్పటికీ సీన్ లేకుండా పోయింది. తిన్నామన్నా.. పడుకున్నామా అన్నట్లుగా విన్నామా పోయామా అని వారి పరిస్థితి తయారైంది. పైగా తమ ఓటిమికి టీడీపీని బాధ్యులను చేస్తున్న జగన్ తీరు కూడా వైసీపీ నేతలకు నచ్చడం లేదు.. ఆయన ఏం చెబుతున్నారు, ఎందుకు చెబుతున్నారో వారికి అర్థం కావడం లేదు..
ఓడిపోయిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో వైసీపీ అధినేత జగన్ నిర్వహించిన సమావేశం వన్ సైడ్ గానే జరిగింది. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదనేందుకు నిదర్శనంగా అక్కడ ఎవరికీ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. జగన్ ఒకరే మాట్లాడి, చెప్పాలనుకున్నది చెప్పి.. మీటింగు ముగించేశారు. పైగా తనకు ఓట్లు ఎందుకు పడలేదో అర్థం కావడం లేదని పాత పాటే పాడారు. అసలు వైసీపీ నేతలు ఏమనుకుంటున్నారు, ఓటమిపై వారి విశ్లేషణ ఏమిటో తెలుసుకునేందుకు ఆయన ప్రయత్నించలేదు. అంతా నేనే, అంతా నా ఇష్టం అన్నట్లుగా ఆయన ప్రవర్తించారు. ఓడిపోయిన అభ్యర్థులను మాట్లాడనిస్తే అదీ ఫీడ్ బ్యాక్ అన్నట్లుగా ఉంటుందని కూడా అర్థం చేసుకోకుండా చెప్పాలనుకున్నది చెప్పి ముగించేశారు. ఎన్నికల ముందు వైనాట్ 175 అని డాంబికాలు పలికినట్లుగానే ఇప్పుడు కూడా మనకు తిరుగులేదన్నట్లుగానే జగన్ ప్రవర్తించారు. గత ఐదేళ్లుగా ఎలాగైతే మీటింగులు పెట్టి చెప్పాలనుకున్నది చెప్పి ముగించేశారో..ఇప్పుడు కూడా అదే పద్ధతిలో మమ అనిపించారు….
వైసీపీలో జగన్ తప్ప ఇతర నాయకుల పరిస్థితేమిటి. అసలు జగన్ ఏమంటున్నారు. నేతలకు ఆయన ఫ్రీ హ్యాండ్ ఎందుకు ఇవ్వడం లేదు. జగన్ ఏమన్నారు. దానిపై విమర్శలు ఎందుకు వస్తున్నాయి….
జగన్ తీరు పట్ల పార్టీ నేతలకు అసంతృప్తి ఉండటం సహజమే. తమను తిరస్కరించి జనం కేవలం 11 సీట్లు చేతులో పెట్టారన్న సంగతి వారికి తెలుసు. ఆ సంగతి జగన్ గుర్తించలేకపోతున్నారన్నది వారి ఆవేదన. పైగా కనీసం రెండు మూడు సంవత్సరాలైనా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించకుండా జగన్ అప్పుడే 2029 ఎన్నికల గురించి మాట్లాడుతున్నారంటే ఆయన మైండ్ సెట్ మారలేదని మాజీ ఎమ్మెల్యేలు అంచనా వేసుకుంటున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయలేరని, 2029లో మళ్లీ తామే గెలుస్తామని గురువారం జరిగిన పార్టీ సమావేశంలో ఆయన ప్రకటించారు. అప్పుడే అదేమి ఆలోచన అన్నదే మాజీలు వేసుకుంటున్న ప్రశ్న. పోనీ మీరెందుకు ఓడారు, క్షేత్రస్థాయిలో విశ్లేషణ చేసుకున్నారా అని మాజీలను అడిగేందుకు జగన్ ఇష్టపడలేదు.పైగా జగన్ మాటతీరు కూడా మారలేదని మాజీలకు అర్థమైపోయింది. ఏమైనా అడ్డుతగిలి నాలుగు మంచి మాటలు చెబుదామంటే జగన్ వాటిని సహించలేరు. తన పరివారంతో వారిపై కక్షసాధింపుకు దిగుతారు. అసలు ఏ ఏ వర్గాలు తమకు ఓట్లు వేయలేదు. వారిని మళ్లీ తమవైపుకు ఎలా తిప్పుకోవాలో జగన్ అసలు ఆలోచించడం లేదు. ఉద్యోగులను దూరం చేసుకుంటే కలిగే నష్టం ఇప్పటికైనా అర్థం చేసుకుని ప్రవర్తించాలని వారు కోరుకుంటున్నారు…
జగన్ మారకపోతే ఆయనకే నష్టం.విశాల జనహితం కోసం చేయాల్సిందేమిటో జగన్ అర్థం చేసుకోవాలి.ఇంతకాలం పరదాల మాటున తిరుగుతూ ఆయన జనానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు కూడా అదే పద్ధతి పాటిస్తూ అందరినీ దూరం పెడితే కష్టమే. అదే ధోరణి కొనసాగితే వన్ టైమ్ సీఎంగా మిగిలిపోవడం తప్పితే చేయగలిగిందేమీ లేదు….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…