టీడీపీ అంటే ఆంధ్రా పార్టీ.. చంద్రబాబు పెత్తనం తెలంగాణకు అవసరమా అని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. చివరికి టీడీపీ అంటే ఆంధ్రా పార్టీ అనే ముద్ర వేయడం వల్లనే తాము పార్టీని వీడాల్సి వచ్చిందని చాలా మంది నేతలు కూడా పలు ఇంటర్యూల్లో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. అంత నెగెటివ్ కోణంలో టీడీపీని టార్గెట్ చేసి బలపడిన బీఆర్ఎస్ కు.. ఇప్పుడు తమ పార్టీ సర్వైవ్ కావాలంటే.. మళ్లీ టీడీపీనే అవసరం పడింది. ఈ సారి పాజిటివ్ కోణంలో టీడీపీ జపం చేస్తున్నారు. ఇది మంచి వ్యూహమేనా ?
తెలుగుదేశం పార్టీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేసిందని కేటీఆర్ మీడియా ముందు ప్రశంసించారు. నిజానికి ఈ విషయాన్ని టీడీపీ కూడా చెప్పుకోవడం లేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేశామని కేంద్రం అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. కానీ కొత్తగా బాధ్యతలు చేపట్టిన గనుల మంత్రి కిషన్ రెడ్డి మాత్రం.. ఇప్పట్లో ప్రైవేటీకరణ ఉండబోదని ప్రకటన చేశారు. దీన్నే ప్రైవేటీకరణ నిలిపివేత ప్రకటనగా కేటీఆర్ భావించారు. ఇప్పుడు కేంద్రంలో టీడీపీ కూడా కీలకమైన భాగస్వామి కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అంగీకరించదు. ఈ విషయం తెలుసు కాబట్టి కేంద్రం వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గుతుంది. అందులో పెద్ద రాజకీయం లేదు. .అయినా కేటీఆర్ టీడీపీని పదే పదే పొగడటానికి దీన్నో కారణంగా తీసుకున్నారు. ఆయనే కాదు.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో కీలక నేత హరీష్ రావు కూడా టీడీపీ అధినేత చంద్రబాబును పొగుడుతున్నారు.
తెలుగుదేశం పార్టీ అంటే బీఆర్ఎస్ అగ్రనేతలకు అంత అభిమానం లేదు. మొదటి నుంచి టీడీపీకి వ్యతిరేకంగానే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించి సమైక్యాంద్రకు మద్దతు తెలిపినప్పటికీ రాష్ట్ర విభజన అనంతర రాజకీయాల కారణంగా వైసీపీ అధినేత జగన్‌తోనే సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవలి ఎన్నికల్లో చాలా మీడియా ఇంటర్యూల్లో ఏపీలో టీడీపీ ఓడిపోతుందని.. జగన్ రెండో సారి అధికారంలోకి వస్తారని తమకు సమాచారం ఉందని చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు పూర్తిగా వారి అభిప్రాయాలను మార్చుకున్నారు. టీడీపీ గురించి పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు.
తెలంగాణకు ప్రాంతీయ పార్టీలే శ్రీరామరక్ష అని చెప్పాలనేది కేటీఆర్ వ్యూహం. ఎంత శ్రీరామరక్ష అనేది తెలంగాణ ప్రజలకు చెప్పాలంటే.. వారికి ఎదురుగా టీడీపీనే కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీని అక్కడి ప్రజుల గెలిపించడం వల్ల ఆ రాష్ట్రం ఎన్నో ప్రయోజనాలు పొందుతుందని చెప్పాలని కేటీఆర్ అనుకుంటున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నందున పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందబోతోందని ఇటీవల ట్వీట్ చేశారు. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ టీడీపీ ఆపేసిందని క్రెడిట్ ఇచ్చేశారు. కేటీఆర్ టీడీపీపై అభిమానంతో కాకుండా.. తన పార్టీని రివైవ్ చేసుకోవడానికి ..తన పార్టీ వైపు ఓటర్లు మళ్లడానికి.. టీడీపీని ఓ ఆయుధంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారని సులువుగా అర్థం చేసుకోవచ్చు.
మరో వైపు హరీష్ రావు కూడా చంద్రబాబును, టీడీపీ ప్రభుత్వాన్ని పొగుడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలు అమలు చేస్తున్నారని అంటున్నారు. దీనికి కారణం రేవంత్ అమలు చేయలేకపోతున్నారని ఆయనకు చేత కావడం లేదని విమర్శలు చేయడానికే. రేవంత్ రెడ్డి పనితీరును తక్కువ చేయడానికి చంద్రబాబును హరీష్ రావు ఉపయోగించుకుంటున్నారు. గతంలో కూడా బీఆర్ఎస్ నేతలు టీడీపీ పేరును తరచూ ఉపయోగించేవారు.కానీ అది నెగెటివ్ కోణంలోనే. ఆ పార్టీ తెలంగాణకు ప్రమాదమని చెప్పేందుకు ఉపయోగించేవారు. తెలంగాణ వ్యతిరేక పార్టీ..ఆంధ్రా పార్టీగా ముద్ర వేసి.. మన దగ్గర ఉనికి ఉండకూడదని ఓటర్లకు చెప్పేవారు. కానీ ఇరప్పుడు రివర్స్ లో టీడీపీ ఏపీలో గొప్పగా చేస్తోందని.. ఇక్కడ కూడా .. ఏపీ ప్రజలు టీడీపీని ఆదరించినట్లుగా.. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను ఆదరించాలని కోరుకుంటున్నారు. రాజకీయాల్లో మార్పులు ఇలా విచిత్రంగా ఉంటాయి.
తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోనూ కింగ్ మేకర్ అయింది. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో పాత పగలు ఏమీ చంద్రబాబు దృష్టిలో ఉంచుకోకుండా బీఆర్ఎస్ అగ్రనేతలు మరో ప్రయత్నం చేస్తున్నారని అనుకోవచ్చు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…