దక్షిణాది కష్టం – ఉత్తరాదికి సమర్పయామి !

By KTV Telugu On 25 June, 2024
image

KTV TELUGU :-

కేంద్రంలో ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, చీఫ్ జస్టిస్, కేంద్ర ప్రభుత్వంలోని ప్రధాన శాఖలు .. ఇలా దేశాన్ని పాలించే దేన్ని తీసుకున్నా దక్షిణాది వాసుల  ప్రాధన్యం చాలా తక్కువగా ఉంటుంది.  అంతే కాదు దక్షిణాది నుంచి వసూలు చేసే పన్నుల్లో తిరిగి ఇచ్చే వాటా కూడా చాలా తక్కువ. అంటే వసూలు చేసే పన్నుల కన్నా ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారు. దక్షిణాదికి అన్యాయం జరుగుతూ వస్తోంది.

దక్షిణాది ఓ ప్రత్యేక దేశం అయితే ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా ఉంటుంది.  చాలా అడ్వాన్స్‌డ్‌ కంట్రీ అవుతుంది. యూరోపియన్ కంట్రీస్‌తో పోటీ పడేలా ఉంటుందన్న విశ్లేషణలు చాలా కాలం నుంచి ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో పరిస్థితి వేరుగా ఉంటుంది. అక్కడ  ఎన్ని నిధులు కేటాయించినా పేదరికంలో మార్పు రాదు.  పేదరికం ఎక్కువగా ఉంటుంది.  దక్షిణాదికి ఆ సమస్య లేదు. అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల దక్షిణాది నుంచి వచ్చే సొమ్మును ఉత్తరాదికి పెడుతున్నారు.  ఆ వివక్ష రాను రాను పెరిగిపోతోంది. కేంద్రం జీఎస్టీ, పెట్రో ట్యాక్స్ లు సహా పలు  పన్నులు వసూలు చేస్తుంది.  కేంద్రం వసూలు చేసిన పన్నుల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ వాటా ఖరారు చేసే విధానం వల్ల దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువగా నష్టపోతున్నాయి.

కర్ణాటక నుంచి కేంద్రానికి వెళ్లి ప్రతి రూపాయి పన్నుల్లో  కేవలం 15 పైసలు మాత్రమే రిటర్న్ వస్తున్నాయి. తమిళనాడుకు 28 పైసలు, ఏపీకి 42 పైసలు, తెలంగాణకు 47 పైసలు, కేరళకు 62 పైసలు మాత్రమే రిటర్న్ వస్తున్నాయి. కానీ విచిత్రంగా మరికొన్ని రాష్ట్రాలకు మాత్రం భారీ కేటాయింపులు ఉన్నాయి. ఇందులో టాప్‌ ప్లేస్‌లో ఉన్నవి ఈశాన్య రాష్ట్రాలు.   అక్కడి భౌగోళిక పరిస్థితులు, సరిహద్దు సమస్యల దృష్ట్యా ఈ కేటాయింపులు చేస్తున్నారు. దీన్ని అస్సలు తప్పే పరిస్థితి లేదు. కానీ కొన్ని ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రం భారీ అంటే భారీ కేటాయింపులు చేస్తుంది కేంద్రం.  రాజస్థాన్‌కు సేకరించే ప్రతి రూపాయికి.. ఒక రూపాయి 20 పైసలు కేటాయిస్తుంది. ఒడిశాకు ఒక రూపాయి 25 పైసలు. మధ్యప్రదేశ్‌కు అయితే తీసుకునే ప్రతి రూపాయికి బదులుగా రెండు రూపాయల 9 పైసలు, యూపీ నుంచి కేంద్రానికి రూపాయి వస్తే రెండున్నర రూపాయలు కేటాయిస్తోంది.  అయితే ఈ లిస్ట్‌లో టాప్‌ ప్లేస్‌లో ఉన్న రాష్ట్రం బీహార్. ఈ రాష్ట్రం నుంచి కేంద్రం వసూలు చేసే ప్రతి రూపాయికి ఏకంగా 7 రూపాయల 26 పైసలు కేటాయిస్తుంది కేంద్రం.

2021 నుంచి 2026 మధ్య కేటాయింపులు ఎలా చేయాలన్నదానిపై 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఉన్నాయి. ఈ సిఫార్సుల ఆధారంగా 42 శాతం నిధులను రాష్ట్రాలకు కేటాయించాలి. రాష్ట్రాల విస్తీర్ణం, రాష్ట్రాల జనాభా, అత్యల్ప తలసరి ఆదాయం, అటవీ, పర్యావరణం, పన్నూ వసూలులో రాష్ట్రాల సామర్థ్యం ఇలా అన్ని అంశాలను పరిగణలోకి కేటాయింపులు చేస్తారు.  దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదలకు సంబంధించిన చర్యలు సమర్థంగా తీసుకున్నారు. దీంతో దక్షిణాదిలో జనాభా తగ్గింది. కానీ ఉత్తరాదిలో జనాభా పెరుగుతూనే వచ్చింది. ఇది ఇప్పుడా రాష్ట్రాలకు ప్లస్‌గా మారింది.   2011 జనాభా లెక్కలను రిఫరెన్స్‌గా తీసుకోవడంతో దక్షిణాది రాష్ట్రాలకు కేటాయింపులు గణనీయంగా తగ్గిపోయాయి.

కేంద్ర ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయాన్ని ఇచ్చేది దక్షిణాది రాష్ట్రాలు. కానీ ఇప్పుడా నిధులను ఉత్తరాది రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగిస్తున్నారనేది ఆరోపణ. ఇదే విషయాన్ని ఫైనాన్స్ కమిషన్‌ ముందు ఉంచాయి దక్షిణాది రాష్ట్రాలు. దీంతో జనాభా నియంత్రణ చేసినందుకు తగిన ప్రోత్సాహకాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అమలు కూడా చేశారు.. కానీ ఓ తిరకాసు పెట్టారు. అదేంటంటే 1976కి బదులు 2011 నుంచి ఈ లెక్కలను పరిగణలోకి తీసుకుంటామన్నారు.  10వ ఫైనాన్స్‌ కమిషన్‌, 15వ ఫైనాన్స్ కమిషన్ కేటాయింపులను కంపేర్ చేసుకొని చూస్తే.. దక్షిణాది రాష్ట్రాలకు కేటాయింపులు తగ్గాయి. ఉత్తరాది రాష్ట్రాలకు కేటాయింపులు పెరిగాయి.  దక్షిణాది రాష్ట్రాలు అత్యధికంగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. ఈ అసమానతలు తొలగాలంటే ఇలాంటి కేటాయింపులు అవసరమంటూ సమర్థిస్తున్నారు. కానీ పెరిగిపోతున్న వివక్ష దక్షిణాది ప్రజల్లో అసహనానికి కారణం అవుతోంది.

ఎంత కేటాయించినా అభివృద్ధి చెందని రాష్ట్రాలకు ఎంత పెడితే ఏం ప్రయోజనం అన్నది ప్రధాన ప్రశ్న.  డబ్బులు దుర్వినియోగం కాకూడదు. మరి ఉత్తరాది రాష్ట్రాలకు కేటాయిస్తున్న నిధులు ఎటు పోతున్నాయి..? ఎందుకు ఆయా రాష్ట్రాలు అభివృద్దిలో ముందుకు రావడం లేదు ?

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి