జేసీ సోదరులకు కోపం వచ్చింది

By KTV Telugu On 26 June, 2024
image

KTV TELUGU :-

అనంతపురం జిల్లా టీడీపీలో ఆయనో ముఖ్య నాయకుడు. అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన నోటికి మాత్రం హద్దూ అదుపూ ఉండదు. ఇప్పుడు టీడీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఆ నేత కొడుకు కూడా ఎమ్మెల్యే అయ్యారు. వారసుడు ఎమ్మెల్యే అయ్యాడన్న సంతోషంలో ఉన్న ఆయన..తనకు నచ్చని అధికారుల అంతు చూస్తా అంటూ వీరంగం వేస్తున్నాడు. గతంలో తనను ఇబ్బంది పెట్టిన అధికారులను చంపుతా, నరుకుతా అంటూ బహిరంగంగా బెదిరించడం ఇప్పుడు అనంతపురం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆయన ఎవరో చూద్దాం.

జేసీ బ్రదర్స్ అంటే తెలియని వారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎవరూ ఉండరు. ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న ఈ సోదరులు రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరి జిల్లాలో తమ హవా కొనసాగించారు. 2019లో టీడీపీ ఓడిపోయి..వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక జేసీ బ్రదర్స్‌ హవా తగ్గిపోయింది. కుటుంబం నుంచి ఎవరూ చట్టసభకు ఎన్నిక కాలేదు. అయితే 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన జేసీ ప్రభాకరరెడ్డి  2019లో ఓడినా..ఆ తర్వాత తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. జేసీ బ్రదర్స్‌ ఇద్దరూ నోటి దురుసుకు బ్రాండ్‌ అంబాసిడర్లు. గతంలో అన్న దివాకరరెడ్డి ఎంతో దురుసుగా ఉన్నప్పటికీ..కొన్నాళ్ళుగా సైలెంట్‌గానే ఉంటున్నారు.

మున్సిపల్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న జేసీ ప్రభాకరరెడ్డి హుందాగా ఉండాల్సింది పోయి..టీడీపీ అధికారంలకి వచ్చిన వెంటనే తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. నిషేధించిన బీఎస్ -3 వాహనాలను స్క్రాప్ కింద కొనుగోలు చేసి.. నకిలీ డాక్యుమెంట్స్ ద్వారా బీఎస్-4గా మార్చి సుమారు 154 బస్సులు, లారీలను అక్రమంగా నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ వ్యవహారంలో జేసీ ప్రభాకర్‌ జైలుకు కూడా వెళ్లొచ్చారు. జేసీ ట్రావెల్స్‌ ఫోర్జరీకి సంబంధించి 22 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈ అక్రమ రిజిష్ట్రేషన్ల వ్యవహారంపై సీబీఐ కూడా రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తోంది.

జేసీ బ్రదర్స్‌ అక్రమ వ్యవహారాన్ని వెలికి తీసిన రాష్ట్ర రవాణా శాఖ అధికారులపై ఇప్పుడు జేసీ ప్రభాకరరెడ్డి కక్ష తీర్చుకుంటానంటూ బెదిరిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి రావడంతో తాను ఏమి చేసినా చెల్లుతుందని భావించిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. మీడియా సమావేశం ఏర్పాటు చేసి… తనకు నచ్చని అధికారులను చంపేస్తా… నరికేస్తా అంటూ ఊగిపోయారు. తనపై కేసులు నమోదు చేసిన రవాణా శాఖ అధికారులందరిపైనా ప్రతీకారం తీర్చుకుంటానని హెచ్చరికలు జారీ చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. పోలీసు అధికారులు, తాడిపత్రి మునిసిపల్ అధికారులపైనా ప్రతీకారం తీర్చుకుంటానంటూ వార్నింగ్ ఇస్తున్నారాయన.

జేసీ సోదరులపై వారి సొంత నియోజక వర్గాల్లోనే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. చాలా విమర్శలు ఉన్నాయి. ఎప్పుడూ వివాదస్పదంగానే వ్యవహరిస్తారన్న పేరూ మూటకట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుండీ జేసీ బ్రదర్స్ విశృంఖలంగానే వ్యవహారాలు నడుపుకు వచ్చారన్నది బహిరంగ రహస్యం. రాష్ట్ర విభజన తర్వాత టిడిపిలో చేరిన జేసీ బ్రదర్స్  తమ తీరును మాత్రం మార్చుకోలేదు. అయితే 2019లో టిడిపి ఓటమి అనంతరం జేసీ సోదరులను టార్గెట్ చేసింది వైసీపీ ప్రభుత్వం. వారి అక్రమాలు వెలుగులోకి తెచ్చి కేసులు పెట్టింది.

జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జేసీ ప్రభాకర్ ఇంత దారుణంగా రెచ్చిపోతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని హోం మంత్రి అనితగాని తమకు సంబంధం లేదన్నట్లుగా మౌనం వహిస్తున్నారు. అనుచితంగా, విద్వేషాలు రెచ్చగొట్టేవిధంగా మాట్లాడుతున్న టీడీపీ నేత, మున్సిపల్ ఛైర్మన్ పదవిలో ఉన్న జేసీ ప్రభాకర్‌ను ప్రభుత్వం నియంత్రించలేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జేసీ తీరుపై టీడీపీలోనే నిరసన వ్యక్తం అవుతోంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి