కేసీఆర్..జీవితకాలం లేటు..!

By KTV Telugu On 28 June, 2024
image

KTV TELUGU :-

రాజకీయ నాయకులు చాలా షార్ప్ గా ఉంటారంటారు.ఏ ఉపద్రవాన్నైనా క్షణాల్లో కనిపెట్టేసి ముందస్తు వ్యూహాలు రచిస్తారంటారు. అవకాశాన్ని, అవసరాన్ని బట్టి  ప్లేటు ఫిరాయించేస్తారంటారు. టైమ్ బాగుండాలే గానీ ప్రపంచాన్ని  ఏలేస్తామంటారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రం టైమ్ బాగున్నట్లుగా లేదు. ఆయన పరిస్థితి చిందరవందరగా  తయారైంది.అందుకే  ఎప్పుడో చేయాల్సిన పనులు ఇప్పుడు చేద్దామనుకుంటున్నారు. ఆయన నిర్వహిస్తున్న మీటింగులు కూడా జీవితకాలం లేటేనని చెప్పుకోవాల్సి వస్తోంది…

గతేడాది డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి . అప్పుడు బీఆర్ఎస్ గుర్తుపై 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఎన్నికలు ముగిసిన వెంటనే కాంగ్రెస్ గెలవడంతో బీఆర్ఎస్ టు కాంగ్రెస్ హైవే ఓపెన్ చేసినట్లయ్యింది. తొలి నాళ్లలోనే కొందరు, ఆ తర్వాత ఒకరిద్దరూ హస్తం గూటిలో సెటిలయ్యారు.దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో కంటోన్మెంట్ లో నిర్వహించిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపొందింది.  నందిత సోదరికే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినప్పటికీ ఆమె గెలవలేకపోయారు. దానితో   బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 33కు తగ్గిపోయింది. అసలు కథ ఇప్పుడే మొదలుతోంది. మరికొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల నాటికి బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్  దూకుడుకు చెక్ పెట్టేందుకు కేసీఆర్ నానా తంటాలు పడుతున్నారు…

బీఆర్ఎస్ కు ఉన్న ప్రతిపక్ష హోదా పోకూడదు. అంటే కాంగ్రెస్లో, బీఆర్ఎస్ఎల్పీ విలీనం కాకుండా ఆపాలి. అందుకే కేసీఆర్  ఇప్పుడు ఎమ్మెల్యేలను బుజ్జగించే  కార్యక్రమం మొదలు పెట్టారు.ఎన్నడూ తమ పార్టీ వారి మొహం చూడని  గులాబీ బాస్…ఇప్పుడు వరుస  మీటింగులతో వారికి టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో విధంగా బతిమాలి, బామాలి  వారిని పార్టీలోనే కొనసాంచాలని ఆయన ప్రయత్నిస్తున్నారు…..

కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన అధికారిక నివాసం ప్రగతి భవన్ గడప తొక్కేందుకు కూడా బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు భయపడేవారు. అక్కడిదాకా వెళ్లినా లోపలికి వెళ్లేందుకు పర్మీషన్ ఉండేది కాదు. కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ విషయంలోనూ అదే సీన్ కనిపించేదు. చాలా మంది ఫామ్ హౌస్ ను బయట నుంచి చూసి వచ్చేసే వారు. అలాంటిది ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకు ఫామ్ హౌజ్ లో ఎర్రతీవాచీ పరుస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ రోజువారీ మీటింగులు మొదలయ్యాయి.  ప్రతీ ఒక్కరినీ పేరుపేరునా పలుకరించి… వారి బాగోగులు తెలుసుకునే కార్యక్రమానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్ అగ్రనాయకత్వం వారి వెంటే ఉందన్న భరోసా కల్పించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. పోయిన వారు పోగా, మిగిలిన 30 మందిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ అధినేత ప్రయత్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులేమిటి, కాంగ్రెస్  వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా. వారిని ఎవరైనా వేధిస్తున్నారా.. కాంగ్రెస్ లో చేరాలని ఎవరైనా వత్తిడి తెస్తున్నారా లాంటి ప్రశ్నలతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి సమాచారం రాబట్టుతున్నారు. మీకేమీ  భయం వద్దు, నేనునాను అని భరోసా ఇచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ పని ముందే చేసి ఉంటే పార్టీ పరిస్తితి  మెరుగ్గా ఉండేదన్న టాక్ మొదలైంది. తొలుత అహంకారాన్ని  ప్రదర్శించి.. ఇప్పుడు పార్టీ పూర్తిగా ఖాళీ అవుతున్న నేపథ్యంలో వారిని బుజ్జగించడం ఏమిటన్న చర్చ కూడా జరుగుతోంది…

కేసీఆర్ పరిస్తితి చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉందని  పార్టీ వారే కొందరు సెటైర్లు వేస్తున్నారు. అయితే ప్రయత్న లోపం  లేకుండా ఏదోటి చేయాలన్న సంకల్పంతో ఆయన ముందుకు సాగుతున్నారని అనుచురులు అంటున్నారు. ఏదైమైనా బీఆర్ఎస్ కు వచ్చే పది రోజులు అత్యంత కీలక సమయంగానే పరిగణించాలి…..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి