ఏపీలో వైసీపీ అధికారికంగా ప్రతిపక్ష హోదా రాలేదు. ప్రజలు ఇవ్వనందున.. ఒకే పార్టీ ఉన్నా ప్రతిపక్ష నేతగా జగన్‌కు అవకాశం ఇవ్వరు. అతి తక్కువ సంఖ్యాబలంతో అసెంబ్లీకి వెళ్లడం దండగన్న అభిప్రాయంతో జగన్ ఉన్నారు. మరి అసెంబ్లీకి వెళ్లకపోతే జగన్ పై అనర్హతా వేటుకు అవకాశం ఉందా ?. మిగతా సభ్యులనూ అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం లేదంటే వారిపైనా వేటు వేసే అవకాశం ఉంటుందా?. అదే జరిగితే వైసీపీ మరిన్ని కష్టాల్లో కూరుకుపోదా ?
చట్టసభ సభ్యుల ప్రధాన విధి సెటిల్మెంట్లు చేయడం, కాంట్రాక్టులు పొందడం, ప్రజా జీవితాల్లోకి తొంగిచూడటం కాదు. అసలు వారి పని చట్టాలు చేయడం . చట్టసభల్లో ప్రజా సమస్యలను ప్రస్తావించడం. అంటే ప్రజా ప్రతినిధిగా అసెంబ్లీలో సమస్యలను ప్రస్తావించడమే వారి పని. కానీ మారిపోతున్న ప్రజాస్వామ్య అర్థంలో చట్టసభలకు ప్రజాప్రతినిధులు ఇస్తున్న ప్రాధాన్యం తక్కువ. అసలు వెళ్లకపోతే ఏమవుతుందని అనుకుంటున్నారు. అదే జరుగుతోంది. ఏపీలో స్పీకర్ ఎన్నిక సంప్రదాయాన్ని కూడా వైసీపీ తోసి పుచ్చింది. స్పీకర్ ఎన్నికకు డుమ్మా కొట్టింది. అంతకు ముందు రోజే సభాసంప్రదాయాల్ని గౌరవిస్తామని అందరూ ప్రమాణం చేశారు. ఒక్క రోజులోనే ఉల్లంఘించారు. వారంతా అసెంబ్లీకి వస్తారా రారా అన్నది కూడా పెద్ద సస్పెన్స్ గా మారింది.
ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా అసెంబ్లీకి వచ్చేందుకు జగన్ సిద్ధంగా లేరు. ముఖ్యంగా అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా ఉన్నారు. ఆయనను అధ్యక్షా అని సంబోధించేందుకు జగన్ మనస్థత్వం అంగీకరించని వైఎస్ఆర్‌సీపీ నేతలే చెబుతూంటారు. అలాగే అసెంబ్లీలో పవన్ కల్యాణ్, రఘురామకృష్ణరాజు వంటి వాళ్లు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయాన్ని వ్యక్తిగతంగా.. రాజకీయంగా చూడరు. మొత్తం ఒకటే అనుకుంటారు. రాజకీయ ప్రత్యర్థులు వ్యక్తిగత శత్రువులుగానే చూస్తారు. గత అసెంబ్లీలో వైసీపీ సభ్యులు .. టీడీపీ సభ్యులకు చేసిన అవమానాలకు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటారని దాని వల్ల జగన్ పైనే ఎక్కువగా ఎటాక్ చేస్తారని అనుకుంటున్నారు.
అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వరని.. చచ్చేదాకా కొట్టాలని స్పీకర్ బయట మాట్లడుతున్నారని ఇలాంటి కౌరవ సభలో మనం ఏదో మాట్లాడుతామని.. పోరాటం చేస్తామని నాకైతే నమ్మకం లేదు అని జగన్ నేరుగా పార్టీ కార్యవర్గ సమావేశంలో చెప్పారు. అంటే అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా ఆయన చెప్పకనే చెప్పారు. జగన్ కు గతంలోనూ అసెంబ్లీని బహిష్కరించిన రికార్డు ఉంది. 2017లో పాదయాత్ర ప్రారంభించే ముందు అసెంబ్లీని బహిష్కరించారు. తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా ఆయన అసెంబ్లీకి వెళ్లడానికి అంగీకరించలేదు. నాలుగు సెషన్ల పాటు ఈ బహిష్కరణ సాగింది. అప్పట్లో టీడీపీ మాత్రమే అసెంబ్లీని నిర్వహించింది. టీడీపీ సభ్యులే ప్రతిపక్ష పాత్ర కూడా పోషించారు. జగన్ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదు. గతంలో తమిళనాడులో జయలలిత, ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ అసెంబ్లీలను బహిష్కరించారు కానీ.. వారి ఎమ్మెల్యేలు మాత్రం సభకు వెళ్లారు. చంద్రబాబునాయుడు కూడా అసెంబ్లీని బహిష్కరించి శపథం చేసి వచ్చేశారు కానీ.. టీడీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం తాను వెళ్లకపోతే ఎమ్మెల్యేలు కూడా వెళ్లాల్సిన అవసరం లేదనుకుంటున్నారు.
ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసినా వరుసగా మూడు సెషన్లకు స్పీకర్ అనుమతి తీసుకోకుండా డుమ్మా కొడితే.. అనర్హతా వేటు వేసేందుకు స్పీకర్‌కు సర్వాధికారాలు ఉంటాయి. వరుసగా మూడు సెషన్లకు రాకపోతే అనర్హతా వేటు వేయవచ్చని నిబంధనలు చెబుుతున్నాయి. ఇంత వరకూ దేశంలో.. ఇలాంటి ఘటన జరగలేదు. అసెంబ్లీ సెషన్స్ రాకపోతే.. నిబంధనల ప్రకారం అనర్హతా వేటు వేసే అవకాశం వస్తే.. టీడీపీ ఖచ్చితంగా ఉపయోగించుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి. అసెంబ్లీకి హాజరు కాకపోవడం ద్వారా స్పీకర్ అనర్హతా వేటు వేస్తే.. ఆ నిర్ణయాన్ని కోర్టుల్లో కూడా సవాల్ చేయలేరు. శాసన వ్యవస్థకు సంబంధించి స్పీకర్ అత్యంత పవర్ ఫుల్ . ఆయన నిర్ణయమే ఫైనల్. ఒక వేల ఇలాంటి పరిస్థితి తెచ్చుకుని వైసీపీ ఎమ్మెల్యేలు ఉపన్నికలు తెచ్చుకుంటే పులివెందులలోనూ గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావొచ్చు. అందకే వైసీపీ సభ్యులు అన్నీ ఆలోచించుకుని అసెంబ్లీకి రావడంపై నిర్ణయం తీసుకుంటారని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. వచ్చే నెలలోనే ఈ అసెంబ్లీ మొదటి సెషన్ జరిగే అవకాశం ఉంది.
రాజకీయాల్లో పంతాలు, పట్టింపులు అయినా ప్రజల కోణంలోనే ఉండాలి. వ్యక్తిగతంగా ఉంటే ప్రజలుకూడా నెగెటివ్ గా తీసుకుంటారు. ఏపీ ఎన్నికల ఫలితాలు అలాంటివే. వాటి నుంచి జగన్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…