రియల్ ఢమాల్ @ హైదరాబాద్..!

By KTV Telugu On 29 June, 2024
image

KTV TELUGU :-

తెలంగాణలో భూముల క్రయ విక్రయాలు తగ్గాయని వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మందగించిందని ఆ రంగంలోని వ్యాపారులు చెబుతున్నారు. చంద్రబాబు అధికారానికి వచ్చిన తర్వాత ఏపీలో రియల్ ఎస్టేట్ పెరిగే అవకాశాలు మెరుగు పడటమే తెలంగాణకు శాపంగా మారిందని కొందరి వాదన. ఇంతకాలం హైదరాబాద్లో ఇన్వెస్ట్ మెంట్ చేసిన వారంతా..ఇప్పుడు పిఛే ముడ్ అనుకుని ఏపీ వైపుకు వెళ్తున్నారని రియల్టర్లు అంగీకరిస్తున్నారు.  ఐనా సరే తగ్గేదేలే అని తెలంగాణ సర్కారు అంటోంది. భూముల మార్కెట్ విలువను పెంచేందుకు రంగం సిద్ధం   చేస్తోంది…

రియల్ ఎస్టేట్ వ్యాపారానికి హైదరాబాద్ స్వర్గధామం అని చెబుతారు.  ఇక్కడ వ్యాపారానుకూలత ఉంది. పారిశ్రామికాభివృద్ధి అదీ ముఖ్యంగా సాప్ట్ వేర్ రంగం కారణంగా భాగ్యనగరంలో  స్థిరపడేందుకు జనం ఇష్టపడతారు. చాలా మంది లోన్లు తీసుకుని భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల వైపుకు దృష్టి పెట్టారు. ఐదు నుంచి ఏడు కోట్ల వరకు ఉండే విల్లాలకు మంచి డిమాండ్ ఏర్పడింది.ఇక కోటి..కోటిన్నర వరకు ఉండే అపార్టమెంట్ ఫ్లాట్ హాట్ కేకుల్లో అమ్ముడు పోతున్నాయి. అయితే ఇదంతా నిన్నటి మాట అని, ఇవ్వాళ ట్రెండ్ మారిపోయిందని రియల్  ఎస్టేట్ విశ్లేషణలు చేసే  ఒక వర్గం వాదిస్తోంది. ఈ వాదనకు ఒక నేపథ్యం కూడా ఉంది. గత ఐదేళ్లు ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం  పడకేసినందునే హైదరాబాద్ కు వరంగా  మారిందని వాళ్లు వాదిస్తున్నారు. జగన్  రెడ్డి పాలనపై విశ్వాసం లేక అక్కడ ఎవరు  పెట్టుబడులు పెట్టి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు మొదలు  పెట్టలేదు. అక్కడ ఇళ్లు కొనుక్కునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు చంద్రబాబు అధికారానికి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణానికి వడివడిగా  అడుగులు వేస్తున్న తరుణంలో అక్కడ స్థలాలు  కొనుక్కునేందుకు జనం ఇష్టపడుతున్నారు. ఇకపై హైదరాబాద్లో  ఫ్లాట్ కొనే కంటే అమరావతిలోనే సెటిలైపోదామని భావిస్తున్నారు. దాని వల్లే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మందగించిందని చెబుతున్నారు. పైగా చంద్రబాబు గెలుస్తారని  ముందే  ఊహించిన వాళ్లు.. హైదరాబాద్లో కొనుగోళ్లు ఆపేశారు. 2018 నుంచి 2020 మధ్య విపరీతంగా పెరిగిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు నిశ్చలంగా నిలబడిపోయింది. అప్పట్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్   రంగంలో 42 శాతం వృద్ధి రేటు ఉండేది. బెంగళూరు నుంచి కోల్ కతా, చెన్నై వరకు రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిన రోజుల్లో కూడా హైదరాబాద్ వృద్ధి రేటు మాత్రం యథావిథిగా కొనసాగింది. ఇప్పుడు ఏపీ దెబ్బకు హైదరాబాద్లో ఇళ్ల సేల్స్ 36 శాతం తగ్గాయని  ఆ రంగంలో ఉన్నవారు చెబుతున్నారు. దేశంలోని పలు నగరాల్లో వృద్ధి రేటు 18 శాతం పడిపోతే…హైదరాబాద్లో మాత్రం 36 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగించే అంశం. అవసరానికి మించి నిర్మాణాలు జరిగాయని కూడా కొందరు అంటుండగా,స్వతహాగా సేల్స్ తగ్గడమే అసలు కారణమని తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ సర్కారు వేర్వేరు సమస్యలతో బిజీగా ఉన్న మాట వాస్తవం. రియల్ ఎస్టేట్ స్లంపును అర్థం చేసుకోలేని  సర్కారు… ఇప్పుడు భూముల రేట్లను పెంచి మరిన్ని సమస్యలను సృష్టించే ప్రయత్నంలో ఉందని వార్తలు వస్తున్నాయి.

బహిరంగ మార్కెట్లో రేట్లకు, ప్రభుత్వం నిర్ణయించే ధరలకు  తేడా ఉంటడమే రియల్ ఎస్టేట్ రంగంలోని ప్రత్యేకమైన హైలైట్. అందుకే ఎటువంటి ప్రాపర్టీ అయినా సరే బ్లాక్  మనీ లావాదేవీల కిందుకే వస్తుంది. కోటి రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ఫ్లాట్ అయినా సరే ప్రభుత్వం లెక్కల్లో  పది లక్షల రూపాయలే రేటు ఉంటుంది. దాని ప్రకారం రిజిస్ట్రేషన్ సమయంలో స్టాంప్ డ్యూటీ చెల్లిస్తారు.అయితే ప్రభుత్వానికి ఆదాయం పెరగాల్సిన అనివార్యతలో భూముల రేట్లు పెంచి స్టాంప్ డ్యూటీ వసూలు చేసుకోవాలని భావిస్తున్నారు. ఖరీదైన ఫ్లాట్లు నిర్మించాలన్నా ముందుగా  భూములు కొనుక్కుని లే అవుట్లు వేసి తర్వాత డెవలప్ చేసుకోవాలి. ప్రభుత్వ తాజా నిర్ణయం  వల్ల  బహిరంగ  మార్కెట్ విలువకు, ప్రభుత్వ విలువకు  మధ్య ఉన్న వ్యత్యాసం కూడా తగ్గుతుందని ఎదురుచూస్తున్నారు.  అయితే భూముల రేట్లు పెంచి మూడు సంవత్సరాలే అయ్యిందని, ఇప్పుడే మరోసారి పెంచడం సహేతుకం కాదని  వాదించే వాళ్లూ ఉన్నారు. వ్యవసాయ భూమి రేటు పెంచడం మంచిదే అయినా.. వ్యవసాయేతర భూమి రేటు పెంచకుండా ఉంటే మంచిదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. హైదరాబాద్  నగరం  వేగంగా విస్తరిస్తున్న తరుణంలో రేట్లు పెంచడం కొనుగోలుదారులకు  ఇబ్బంది కావచ్చు. కొనుగోళ్లు తగ్గితే  డబ్బు అవసరమై అమ్ముకునే వారికి కష్టకాలం దాపురించినట్లే అవుతుంది. ఇక హైదరాబాద్ బయట చిట్యాల, చౌటుప్పల్ లాంటి విజయవాడ హైవే ప్రాంతాల్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన సెగ తగులుతోంది. అక్కడ కూడా  భూముల విలువ పెంచడం కారణంగా క్రయ విక్రయాలు దెబ్బతినే అవకాశం ఉంది. విజయవాడ హైవే, యాదాద్రి ప్రాంతాలు ఇంతకాలం హైదరాబాద్ కు  ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి…

తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా మందికి జీవనాడిగా ఉంది. వేలాది కుటుంబాలకు ఉపాధి అందిస్తోంది.  పెట్టుబడులు రెట్టింపు అయ్యేందుకు అవకాశం కల్పిస్తోంది. చాలా మంది నగరంలో సెటిలై హాయిగా బతికేందుకు అవకాశం ఇస్తోంది. దాన్ని కాపాడుకోవాల్సిన అనివార్యత ఉంది. కేవలం ప్రభుత్వానికి వచ్చే ఆదాయం దిశగానే  పరిగణించకూడదు…..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి