ఎమ్మెల్సీ పదవి రేసులో..!

By KTV Telugu On 1 July, 2024
image

KTV TELUGU :-

ఏపీలో ఎమ్మెల్యే కోటాలోని రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ రెండు ఎమ్మెల్సీలు గతంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీవే. ఇప్పుడు ఇవి టీడీపీకి ఉన్న బలాన్ని బట్టి ఆ పార్టీ ఖాతాలో చేరబోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత తొలిసారిగా దక్కబోతున్న రెండు ఎమ్మెల్సీల కోసం టీడీపీలో పోటీ తీవ్రస్థాయిలో కనిపిస్తోంది. ఈ పదవులు ఎవరికి దక్కబోతున్నాయి? అసలు వాటి కోసం పోటీ పడుతున్నదెవరు?

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలోని రెండు ఎమ్మెల్సీ పదవులు భర్తీ చేయాల్సి ఉంది. ఇద్దరు ఎమ్మెల్సీల్లో ఒకరైన సి. రామచంద్రయ్య వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీడీపీలో చేరడంతో..ఆయనపై అనర్హత వేటు పడింది. మరో ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్‌ ఎమ్మెల్సీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. వీరిద్దరూ పదవులు కోల్పోవడంతో ఇప్పుడు ఆ రెండు సీట్లను భర్తీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం అసెంబ్లీలో టీడీపీకి ఉన్న బలం దృష్ట్యా రెండు ఎమ్మెల్సీలు కూడా తెలుగుదేశం పార్టీకే దక్కుతాయి.

దీంతో వీటి కోసం టీడీపీ నుంచి అనేక మంది సీనియర్ నాయకులు ఎమ్మెల్సీల కోసం ఎగబడుతున్నారు. ఎమ్మెల్యే సీట్లు దక్కని అనేక మందికి వేరే రూపంలో న్యాయం చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. కొందరికి నేరుగా ఎమ్మెల్సీలే ఇస్తామని కూడా చెప్పారు. ఇప్పుడు వారందరూ తమకే ఆ అర్హత ఉందని టీడీపీ నాయకత్వం ముందు తమ బయోడేటా విప్పుతున్నారు. అయితే అనర్హతకు గురైన రామచంద్రయ్య, రాజీనామా చేసి టీడీపీలో చేరిన ఇక్బాల్ తమ పదవులను తమకే ఇవ్వాలని చంద్రబాబును కోరుతున్నారు.

ఇదిలా ఉంటే…ఎన్నికల ముందు పార్టీ మారినవారికి మళ్ళీ ఎమ్మెల్సీలు ఇవ్వాల్సిన అవసరం లేదని కొందరు టీడీపీ నేతలు వాదిస్తున్నారు. పొత్తులో భాగంగా ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేసిన తమకే ఆ పదవులు ఇవ్వాలని కోరుతున్నారు. రామచంద్రయ్యపై అనర్హత వేటు కారణంగా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని వంగవీటి రాధా, బూరగడ్డ వేదవ్యాస్, కొనగళ్ళ నారాయణ, మాగంటి బాబు, అంగర రామ్మోహన్, మంతెన సత్యనారాయణ రాజు, బుద్ధా వెంకన్న, రావి వెంకటేశ్వరరావు వంటి నేతలు ఆశిస్తున్నారు.

ఇక మహమ్మద్ ఇక్బాల్ రాజీనామా చేసిన ఎమ్మెల్సీ స్థానాన్ని మైనార్టీలకే తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు..శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్, టిడిపి ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నారు. మైనార్టీలకు టిడిపి పెద్దగా ఎమ్మెల్యే స్థానాలు కేటాయించలేదు కాబట్టి ఖాళీగా ఉన్న రెండింటిలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని మైనార్టీలకే కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏం ఏ షరీఫ్, ఎండి నజీర్ ఇద్దరికీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు.

ఈ ఇద్దరు పోటీ చేయాలనుకున్న రెండు స్థానాలు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. కాబట్టి మైనార్టీలకే ఒక ఎమ్మెల్సీ స్థానం ఇస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ స్థానం కోసం టిడిపి నాయకులు గట్టిగానే పైరవీలు చేస్తున్నారు. ఎవరికి వీలున్న మార్గంలో వారు తమ పని తాము చక్క బెట్టుకుంటున్నారు.  చంద్రబాబు, లోకేష్ చుట్టూ పదవి కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. మరి ఈ రెండు స్థానాలు ఎవరికి దక్కనున్నాయో వేచి చూడాలి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి