ఆమె అనూహ్యంగా పార్టీ మారారు. అంతే అనూహ్యంగా ఎమ్మెల్యే అయ్యారు. అంతకంటే అనూహ్యంగా మంత్రి అయ్యారు. ఇక అంతే ఆమె గల్లా పెట్టెలో కాసులు గలగలలాడాయి. అందినకాడికి దోచుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆమె అవినీతి బాగోతాలు సాక్ష్యాలతో సహా బయటకు వస్తున్నాయి. అప్పటి బాధితులంతా ఇప్పుడు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తమను నిలువు దోపిడీ చేశారని వాపోతున్నారు. ఆమే చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడదల రజనీ. ఆమె అవినీతికి అంతే లేకుండా పోయిందన్న ఆరోపణలు పెల్లుబికాయి…
వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రజా ప్రతినిధులు అందినకాడికి దోచుకున్నారన్న ఆరోపణలు చాలా రోజులుగానే ఉన్నాయి. లాండ్, శాండ్, మైనింగ్ ఏదైనా సరే ఎమ్మెల్యేలు, వైసీపీ నేతల చేతులు తడపనిదే పని కాదన్న చర్చ జరిగేది. ఈ క్రమంలో ప్రతీ ఎమ్మెల్యే వెయ్యి నుంచి 1500 కోట్ల వరకు వెనుకేసుకున్నారని ఒక ఆరోపణ ఉంది. మంత్రులయితే అంతకంటే చాలా ఎక్కువే వసూలు చేశారు. అలా కలెక్షన్ చేసిన వారితో మాజీ మంత్రి విడదల రజనీ పేరు పెద్దగా వినిపిస్తోంది. తొలుత టీడీపీలో ఉండి తర్వాత వైసీపీలో చేరి తన రాజకీయ గురువు ప్రత్తిపాటి పుల్లారావునే 2019లో ఓడించిన రజనీ… వైసీపీలో చాలా వేగంగా ఎదిగారు. అంతే వేగంగా అవినీతికి ఆలవాలమయ్యారని వార్తలు వచ్చాయి. 2024 ఎన్నికలకు ముందే వైసీపీలో ఆమెపై ఆరోపణలున్నాయి. మల్లెల రాజేష్ అనే వ్యక్తి దగ్గర ఆరు కోట్లు తీసుకున్న వ్యవహారంలో ఆమెను అప్పటి ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. దానితో ఆమె మూడు కోట్లు వెనక్కి ఇచ్చేసి పరువు బజార్న పడకుండా చూసుకున్నారు. అప్పట్లోనే రజనీకి వసూలు రాణి అని పేరు ఉండేది….
అధికారంలో ఉన్నప్పుడు గత్యంతరం లేక లంచాలిచ్చిన వాళ్లు ఇప్పుడు రజనీపై దుమ్మెత్తిపోస్తున్నారు.పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు తమ డబ్బులు వెనక్కి ఇప్పించాలని వేడుకుంటున్నారు. దీనితో రజనీ ఎవరికీ కనిపించకుండా దాక్కుంటున్నారని వైసీపీ వాళ్లే చెబుతున్నారు…
చిలకలూరిపేట దగ్గరి యడ్లపాడు గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ అనే సంస్థ యజమాని నల్లపనేని చలపతి రావు నుంచి రజనీ ఐదు కోట్లు డిమాండ్ చేశారని సంస్థ యజమాని ఇప్పుడు పల్నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంత డబ్బు ఇవ్వలేనని చలపతిరావు చెప్పడంతో రజనీ వ్యక్తిగత సహాయకుడు రామకృష్ణ ఆయన్ను బెదిరించారు. విజిలెన్స్ ఎస్పీ రంగంలోకి దిగి స్టోన్ క్రషర్ పై రైడ్ చేశారు. దానితో రజనీ సోదరుడు గోపిని సంప్రదించగా.. రెండు కోట్లకు డీల్ కుదిరి.. ఆ డబ్బు చెల్లించడంతో పాటు విజిలెన్స్ ఎస్పీకి పది లక్షలు ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు ఏమీ చేయలేక డబ్బులు ఇచ్చేసిన స్టోన్ క్రషర్స్ యజమాని ఇప్పుడు పోలీసులను ఆశ్రయించారు. చిలకలూరిపేటలోని ఓ గ్రామంలో రైతుల నుంచి రజనీ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు . జగనన్న కాలనీ పథకం పేరుతో రజినీ తమ గ్రామంలో 200 ఎకరాలు సేకరించి ఎకరానికి 2.5 లక్షలు లంచం తీసుకున్నారని బాధిత రైతులు ఆరోపించారు. తొలిదశలోనే రైతుల నుంచి కోటి రూపాయలు వసూలు చేశారని వారు పేర్కొన్నారు.
రజనీ బాధితులు ఒక్కరొక్కరుగా బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఏదేమైనా ఒకప్పుడు గ్లామర్ గాళ్ గా బాగా ఫేమస్ అయిన విడదల రజనీ… ఇప్పుడు అవినీతి ఆరోపణల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. హైదరాబాద్లోని ఒక ఫార్మ్ హౌస్ లో ఎవరికీ కనిపించకుండా దాక్కున్నారని చెబుతున్నారు….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…