చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఒకే వేదికపైకి వస్తే సరిపోతుందా. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిస్తే తెలుగు రాష్ట్రాలకు కలిగే ప్రయోజనం ఏమిటి. ఏపీ నుంచి తెలంగాణ ఏం ఆశిస్తోంది.ఏపీ ఎదురుచూస్తున్న అంశాలేమిటి. ఏపీ అడిగిన వాటిని తెలంగాణ ఇస్తుందా. ఇచ్చేందుకు సుముఖంగా ఉందా. చంద్రబాబు చాణక్యం పనిచేస్తుందా. పదేళ్లుగా నానుతున్న సమస్యలు పరిష్కారమవుతాయా….
రేవంత్ ఎంత లేదన్నా ఆయన్ను చంద్రబాబు శిష్యుడిగానే తెలుగు సమాజం పరిగణిస్తుంది. టీడీపీలో చేరిన తర్వాతే రేవంత్ కు ఒక రాజకీయ నాయకుడిగా పేరు వచ్చింది. అక్కడ నుంచి అంచలంచెలుగా ఎదిగి తర్వాత కాంగ్రెస్లో చేరి ఇప్పుడు తెలంగాణ సీఎం అయ్యారు. ఇప్పుడు ఒకే సారి గురుశిష్యులు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. చంద్రబాబు ఏపీకి, రేవంత్ తెలంగాణకు ముఖ్యమంత్రులుగా తొలి సారి కలుసుకోబోతున్నారు. ఈ నెల ముూడో వారంలో హైదరాబాద్ మహానగరంలో నిర్వహించే తొలి ప్రపంచ కమ్మ మహాసభలకు ఇద్దరు నేతలు హాజరవుతారు. సీఎంలిద్దరూ వేదికను పంచుకుంటారని కమ్మ మహాసభ నిర్వాహకుడు జెట్టి కుసుమకుమార్ వెల్లడించారు. హెచ్ఐసీసీ వేదికగా జరిగే కమ్మ మహాసభలకు మాజీ ఉప రాష్ట్రపతి కూడా హాజరవుతారు. మరి వెంకయ్య నాయుడు పక్కనే ఉండగా.. ఇద్దరు ముఖ్యమంత్రులు ఏమి మాట్లాడుకుంటారోనన్న చర్చ, ఉత్కంఠ కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పద అంశాలు చర్చకు వస్తాయా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకమవుతోంది….
విభజన హామీలకు సంబంధించి అనేక అంశాలు పరిష్కారం కాకుండానే ఉండిపోయాయి. పదేళ్ల పాటు రెండు రాష్ట్రాల మధ్య ప్రకటనలే కానీ పైసా చేతులు మారిన దాఖలాలు లేవు. తెలంగాణ నుంచి తమకు చాలా నిధులు రావాల్సి ఉందని ఏపీ అంటోంది. ఈ క్రమంలో చాయ్ తాగేప్పుడో, భోజనాలు చేసే సమయంలోనో ఇద్దరు నేతలు మాటమాత్రమైనా ఈ అంశాలపై దృష్టి పెడతారా అన్నదే ఇప్పుడు పాయింట్….
జగన్ రెడ్డి, కేసీఆర్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడే ఏపీకి రావాల్సిన నిధులపై ఒకటి రెండు సార్లు డిమాండ్లు వినిపించాయి. కేంద్రం జోక్యం చేసుకుని తమకు డబ్బులు ఇప్పించాలని కూడా జగన్ ఒకటి రెండు సార్లు అభ్యర్థించారు. కేసీఆర్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా జగన్ గట్టిగా అడగలేదు. ఇప్పుడు ప్రభుత్వాలు మారినా తర్వాత అవే అంశాలు మళ్లీ తెరమీదకు వస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం కూడా తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలు వసూలు చేసుకోవడంపై దృష్టి పెట్టింది. తెలంగాణ నుంచి రావాల్సిన ఐదువేల కోట్ల రూపాయలకు సంబంధించి అప్పట్లో జగన్ ప్రభుత్వం చేసిన డిమాండ్ ను ఇప్పుడు కూటమి ప్రభుత్వం గుర్తుచేస్తోంది. విద్యుత్ బకాయిలు ఐదువేల కోట్లు ఉన్నాయి. ఏపీ హౌసింగ్ బోర్డు బకాయిలకు సంబంధించి 5 వేల 170 కోట్లు రావాల్సి ఉందని చెబుతున్నారు. కొన్ని అంశాలపై సుప్రీం కోర్టు వరకు కేసులున్నాయి. రెండు రాష్ట్రాలకు సంబంధించి ఆస్తులు, అప్పుల పంపకం వివాదాలు కొనసాగుతున్నాయి.తొమ్మిది, పదో షెడ్యూల్ లో ఉన్న సంస్థల పంపకంపై పీటముడి వీడటం లేదు. పురపాలక, పట్టణాభివృద్దికి సంబంధించిన శాఖల విభజన కూడా పూర్తికాలేదు.
చంద్రబాబు అడుగుతారా. రేవంత్ రెడ్డి స్పందిస్తారా.. అన్న ప్రశ్నలు సహజంగానే వినిపిస్తున్నాయి. తక్షణమే పరిష్కారం కాని సమస్యలపై ముఖాముఖి ప్రస్తావన సహేతుకం కాదని చంద్రబాబు అనుకోవచ్చు. సెంటిమెంట్ సమస్య వస్తుందని రేవంత్ రెడ్డి మౌనం వహించే అవకాశం ఉంది. పదేళ్లపాటు కేసీఆర్ సాగదీసిన వ్యవహారాలను తాను పరిష్కరించాలనుకుంటే…. నెగిటివ్ సెంటిమెంట్ గా మారే ప్రమాదం ఉందని రేవంత్ కు తెలుసు. అందుకే వివాదాస్పద అంశాలను చాకచక్యంగా పరిష్కరించాలి. కర్ర విరగకుండా పాము చావకుండా చూసుకోవాలి. ఇద్దరు ముఖ్యమంత్రులు ఏం చేస్తారో చూడాలి..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…