ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేత పత్రాల విడుదలపై దృష్టి సారించారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ స్థితిగతులపై శ్వేత పత్రం విడుదల చేశారు. జగన్ మోహన్ రెడ్డి అయిదేళ్ల పాలనలో పోలవరం ప్రాజెక్టు అంగుళం కూడా ముందుకు కదల్లేదని ఆరోపించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో గత అయిదేళ్ల పనితీరుపైనా శ్వేత పత్రాలు విడుదల చేస్తారని అంటున్నారు. వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేయడం చంద్రబాబు నాయుడికి కొత్త కాదు. శ్వేత పత్రాలు విడుదల చేసి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగా లేదని చెప్పి సంక్షేమ పథకాలు, రాయితీలకు చెక్ పెట్టే అవకాశాలుంటాయని ఆర్ధిక రంగ నిపుణులు భావిస్తున్నారు.
పోలవరం పై శ్వేత పత్రం విడుదల చేసిన తర్వాత గత అయిదేళ్లలో పోలవరాన్ని భ్రష్ఠు పట్టించారని చంద్రబాబు ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రోజెక్టును నాశనం చేశారని దుయ్యబట్టారు. వాటికి మరమ్మతులు చేసుకుంటూ ప్రోజెక్టు పూర్తి చేయడానికి ఎన్నేళ్లు పడుతుందో నిపుణులు తేల్చి చెప్పాల్సి ఉంటుందన్నారు చంద్రబాబు. దీనికి కొద్ది రోజుల ముందే పోలవరం పూర్తి చేయాలంటే అన్నీ సజావుగా సాగితే కనీసం నాలుగేళ్లు పడుతుందని నిపుణులు అన్నారని చంద్రబాబు చెప్పారు. ఈ లెక్కన 2029 లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యే పరిస్థితులు లేవని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్నది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. తద్వారా పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుందని ప్రభుత్వంపై ఎవరూ ఒత్తిడి చేసే అవకాశం లేకుండా జాగ్రత్త పడ్డారని వారు అభిప్రాయ పడుతున్నారు.
శ్వేత పత్రాలు విడుదల చేయడం అనేది చంద్రబాబు గతంలోనూ చేశారు. తొంభైలలో ఎన్టీయార్ ను గద్దె దింపి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఎన్టీయార్ పథకాలు విధానాలు యథాతథంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే అవి అమలు చేస్తే ఆర్ధికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని చంద్రబాబు భయపడ్డారు. హామీల అమలును నిలిపివేయాలంటే ఏం చేయాలా? అని ఆలోచించిన చంద్రబాబు ఒక వ్యూహం పన్నారు. అదే శ్వేత పత్రాల విడుదల ద్వారా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ప్రజలకు వివరించడం.ఆ బూచిని చూపించి సంక్షేమ పథకాలు ఎత్తివేయడం ఈజీ అవుతుందన్నది బాబు ఆలోచన. అది అప్పట్లో విజయవంతం అయ్యింది.
అప్పట్లో ఎన్టీయార్ మద్య నిషేధ హామీతో అధికారంలోకి వచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నిషేధం విధించారు. నిషేధాన్ని ఎత్తివేయాలనుకున్న చంద్రబాబు నాయుడు శ్వేత పత్రాలతో రాష్ట్రం దివాళా స్థితిలో ఉందని వివరించారు. దాన్ని చూపి ఇక మద్యనిషేధం ఎత్తివేస్తేనే కానీ ఆదాయం పెరగదని అన్నారు. దాంతో పాటు నిషేధం ముసుగులో సంఘవిద్రోహక శక్తులు అడ్డగోలుగా అక్రమాదాయాలు సంపాదిస్తూ మద్య నిషేధానికి తూట్లు పొడుస్తున్నారని అన్నారు. ఈ కారణలు చెప్పి మద్య నిషేధం ఎత్తివేయడమే మంచిదని నిపుణులు సూచించినట్లు చెప్పారు. మొత్తం మీద నిషేధం ఎత్తివేశారు.
మద్య నిషేధం ఎత్తివేయడంతో పాటు ఎన్టీయార్ మానస పుత్రిక లాంటి రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని కూడా ఎత్తివేశారు చంద్రబాబు నాయుడు,. అలాగే రైతులకు నీటి తీరువా కూడా ఎత్తివేశారు. ఇలా ఎన్టీయార్ హయాంలో అమల్లో ఉన్న పలు సంక్షేమ పథకాలను చంద్రబాబు రద్దు చేసి ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించుకున్నారు. అదే వ్యూహాన్ని ఇపుడు కూడా రిపీట్ చేస్తున్నట్లుందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే లక్షా యాభై వేల కోట్ల రూపాయల మేరకు ఏటా ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా.
కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను చంద్రబాబు ఈ ఎన్నికల్లో హామీగా ఇచ్చారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు అమ్మవొడి పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ అమలు చేస్తామన్నారు. రైతు భరోసా కింది 20 వేలు ఇస్తామన్నారు. ఇంకా చాలా హామీలు ఇచ్చారు. ఇపుడు శ్వేత పత్రాలు విడుదల చేసి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఇంత దారుణంగా ఉందని తాము ఊహించలేదని..జగన్ మోహన్ రెడ్డి చేసిన డ్యామేజీకి రిపేర్ చేయాలంటే చాలా కాలం పడుతుందని అంత వరకు అందరూ ప్రభుత్వానికి అండగా నిలవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేసే అవకాశాలున్నాయి. హామీలు ఎగ్గొట్టారన్న అప ప్రధ నుండి అలా తప్పించుకోవచ్చునన్నది బాబు చాణక్యంగా భావిస్తున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…