జనసైన్యం – తెలంగాణలో క్రియాశీలం..

By KTV Telugu On 3 July, 2024
image

KTV  TELUGU :-

విజయం ఒక నేతకు, ఆ పార్టీకి కొత్త జోష్ ఇస్తుంది. సరికొత్త అవకాశాలను  వెదుక్కునే వెసులుబాట్లు కల్పిస్తుంది. పార్టీ విస్తరణపై దృష్టి పెట్టాలన్న కోరిక కలుగుతుంది. జనసైనాధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా అదే దిశగా ఆలోచిస్తున్నారు.  ఏపీలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు పక్కచూపులు చూసేందుకు వెనుకాడటం లేదు.  తెలంగాణలో కూడా ఒక లెగ్గు పెడితే తప్పేమిటన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లుగా  వార్తలు వస్తున్నాయి.దీనిపై జనసేన వ్యూహకర్తలు కరసత్తు చేస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి….

రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు మారుతున్నాయి. బీఆర్ఎస్, వైసీపీ ఓడిపోయి ఇరు  రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత వ్యూహాలు మారుతున్నాయి.  విస్తరణపై నేతలు దృష్టి పెడుతున్నారు. మరింతగా కాకపోయినా ఏపీలో కాంగ్రెస్ కాస్త పుంజుకుంది.  అదే ఆంధ్రప్రదేశ్లో  అధికార సంకీర్ణ భాగస్వాములు పక్క  రాష్ట్రం వైపు కూడా చూస్తున్నారు. ఇటీవల చంద్రబాబు ఒక సారి తెలంగాణ టీడీపీ నేతలతో పిచ్చాపాటీ  మాట్లాడి కొత్త రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను తెలుసుకున్నారు. పార్టీ బలాబలాలను సమీక్షించారు. ఇప్పటి  వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క  అన్నట్లుగా టీడీపీ ఆలోచిస్తోంది. త్వరలో  జరిగే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ సీరియస్ గా పోటీ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఇదీ ఒక కోణం.జనసేన కూడా తెలంగాణలో గట్టిగా ప్రయత్నించాలని  నిర్ణయించుకోవడం మరో కోణం. జనసేన కూడా గతాన్ని  మరిచి భవిష్యత్తుకు పూలబాట వేసుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది.

ఏపీలో జనసేన 21 చోట్ల పోటీ చేస్తే అన్ని  నియోజకవర్గాల్లో గెలిచింది. దానితో ఆ పార్టీకి కొత్త ఆశలు చిగురించాయి. తెలంగాణలో కూడా పవన్ కల్యాణ్ అభిమానులు ఉండటం, జనసేనకు సామాజిక వర్గాల పరంగా కూడా బలం ఉండటంతో మరో సారి ప్రయత్నిస్తే తప్పే లేదన్న ఫీలింగు వచ్చేస్తోంది….

ఏపీ డిప్యుటి సీఎం హోదాలో  పవన్ మొదటిసారి  కొండగట్టు ఆంజనేయుడ్ని దర్శించుకున్నారు.  తెలంగాణాలో కూడా బీజేపీతో కలిసి జనసేన పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.  బీజేపీ, జనసేన పార్టీలు టీడీపీతో పొత్తుపెట్టుకుని మొన్నటి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. తెలంగాణాలో టీడీపీతో కలిసి పనిచేసే విషయాన్ని పవన్ ప్రస్తావించలేదు కాని బీజేపీతో కలిసి పనిచేస్తామని ప్రత్యేకంగా చెప్పటం  రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది నియోజకవర్గాల్లో జనసేన పోటీచేసింది అప్పుడు కూడా బీజేపీతో పొత్తులోనే బరిలోకి దిగింది. అయితే ఒక్కటంటే ఒక్కసీటులో కూడా జనసేన అభ్యర్ధులకు డిపాజిట్ కూడా దక్కలేదు. అందుకనే పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. ఏపీ ఎన్నికల్లో కూటమి గెలిచిన  తర్వాత మాత్రం పార్టీ అగ్రనాయకత్వం  ఆలోచన మారింది.తెలంగాణలో మళ్లీ పోటీ చేయాలన్న ఆకాంక్ష వారిలో మొలకెత్తింది. ఈ క్రమంలో తెలంగాణ  జనసేన నేతల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు పవన్ ప్రయత్నంచబోతున్నారు. త్వరలో  వరుస సమీక్షలు జరగబోతున్నాయి. అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. తెలంగాణ స్థానిక ఎన్నికల్లో బీజేపీ,  టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయా లేదా అన్నది కూడా తేలుతుంది. అదే జరిగితే కాంగ్రెస్, బీఆర్ఎస్ కు కష్టకాలం తప్పదు. క్షేత్రస్థాయిలో  మూడు పార్టీలకు ఉన్న బలమే.. సమిష్టి బలం అవుతుందని ప్రత్యేకంగా  చెప్పాల్సిన పని లేదు.

రాజకీయంగా పవన్ కల్యాణ్ ఇప్పుడు రైజింగ్ స్టార్ గా ఉన్నారు. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూస్తానని ప్రకటించి మరీ కూటమిని గెలిపించి చూపించిన ఘనత ఆయనకే దక్కుతుంది. తెలంగాణలో కూడా వ్యూహాత్మకంగా  ముందుకు సాగితే జనసేన పుంజుకోవడం కష్టమేమీ కాదన్న ఆలోచన ఉన్నది. చూడాలి మరి సమీప భవిష్యత్తులో ఏం జరుగుతుందో…..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి